సిమెంట్‌ అవసరం లేని కాంక్రీట్‌

Concrete that does not require cement - Sakshi

పరి పరిశోధన 

ఫ్లైయాష్‌ గురించి మీరెప్పుడైనా విన్నారా? థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో వ్యర్థంగా మిగిలిపోయే ఈ పదార్థంతో ఇటుకలు తయారవుతున్నాయి. కొద్దోగొప్పో కలుపుకుని సిమెంట్‌ కూడా తయారు చేస్తున్నారు. ఇలాకాకుండా పూర్తిగా ఫ్లైయాష్‌తో కాంక్రీట్‌ను తయారు చేసేందుకు రైస్‌ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు సరికొత్త పద్ధతిని కనుక్కున్నారు. తద్వారా కాంక్రీట్‌ తయారీ ద్వారా విడుదలయ్యే కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించడం, అదే సమయంలో వృధా అవుతున్న ఈ వనరును మళ్లీ వినియోగించుకోవడం సాధ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు. పర్యావరణ కాలుష్యం పెరిగిపోవడంలో కాంక్రీట్‌ తయారీ రవాణా, విద్యుచ్ఛక్తి రంగాల తరువాత మూడో స్థానంలో ఉంది. ఇంకోవైపు ఫ్లైయాష్‌ పునర్వినియోగం చాలా తక్కువగా ఉంది.

ఈనేపథ్యంలో తాము ఒక వినూత్నమైన బైండర్‌ను అభివృద్ధి చేశామని, దీన్ని వాడినప్పుడు సాధారణ పోర్ట్‌ల్యాండ్‌ సిమెంట్‌ అన్నది అస్సలు వాడకుండా దాదాపు 80 శాతం ఫ్లైయాష్‌ను వాడుకుని కాంక్రీట్‌ను తయారు చేయవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త రౌజబేషాసావరి అంటున్నారు. క్యాల్షియం పరిమాణం ఎక్కువగా ఉన్న ఫ్లైయాష్‌ 80 శాతం, ఐదు శాతం సోడియం ఆక్టివేటర్స్, మిగిలిన 15 శాతం నానో సిలికా, క్యాల్షియం ఆక్సైడ్‌లను కలిపి కాంక్రీట్‌ను తయారుచేస్తే అది సాధారణ పోర్ట్‌ల్యాండ్‌ సిమెంట్‌ కంటే దృఢంగా ఉండటంతోపాటు ఎక్కువ కాలం మన్నుతుంది కూడా అని ఆయన వివరించారు. కొత్త కాంక్రీట్‌ ధర్మాలను మరింత క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే నాణ్యత మెరుగుపడే అవకాశాలు లేకపోలేదని చెప్పారు.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top