
అమరిక : కొబ్బరి తినేశారా? అయితే డిజైన్ రెడీ!
కొబ్బరికాయను జాగ్రత్తగా కొడితే.. రెండు సమానమైన ముక్కలవుతాయి. లోపలి నీరు తాగి, కొబ్బరి తినేశాక చిప్పలను ఓ వైపుకు పడేసి చేతులు దులుపుకోవడం సాధారణంగా జరిగేదే! ఓ సారి ఈ కళాత్మక వస్తువులను చూశారంటే పడేసిన కొబ్బరిచిప్పలను వెతుక్కోవడం ఖాయం.
కొబ్బరికాయను జాగ్రత్తగా కొడితే.. రెండు సమానమైన ముక్కలవుతాయి. లోపలి నీరు తాగి, కొబ్బరి తినేశాక చిప్పలను ఓ వైపుకు పడేసి చేతులు దులుపుకోవడం సాధారణంగా జరిగేదే! ఓ సారి ఈ కళాత్మక వస్తువులను చూశారంటే పడేసిన కొబ్బరిచిప్పలను వెతుక్కోవడం ఖాయం. ఇవే కాదు ఎండిన కొబ్బరిబొండాలు, కొబ్బరికాయలు ఇంట్లో అలంకరణ వస్తువులుగా రకరకాలుగా రూపొందించవచ్చు. ఇందుకు కావలసింది తగినంత నైపుణ్యం, ఓపిక.
కావలసినవి: ఎండు కొబ్బరిబొండాలు, కొబ్బరికాయలు, కొబ్బరిచిప్పలు, సిలికాన్ కార్బైడ్ పేపర్ (కొబ్బరికాయ పైన స్మూత్ ఫినిషింగ్ చేయడం కోసం), స్క్రూలు, స్ట్రా, వార్నిష్, పైన అతికించడానికి రంగురంగుల పేపర్లు, గ్లూ, రంధ్రాలు చేయడానికి మేకు లేదా డ్రిల్లర్! అవసరాన్ని బట్టి మరికొన్ని ఉపకరణాలను వాడచ్చు లేత కొబ్బరికాయల్లో నీరు తీసేసి వాడుకోవాలంటే పైన (మూడు కన్నులు ఉన్న చోట) రంధ్రం చేసి, స్ట్రాతో నీరంతా తీసేయాలి సిలికాన్ కార్బైడ్ పేపర్ రఫ్‌గా ఉన్న వైపు తీసుకొని కొబ్బరి చిప్ప పై భాగాన్ని బాగా రుద్దాలి. దీంతో పైన ఉండే పీచు అంతా పోయి పై భాగం నునుపుగా అవుతుంది రెండు చిప్పలకు (పగలకుండా) రంధ్రాలు చేసి స్క్రూలు బిగించవచ్చు. ఆభరణాలు దాచుకునే పెట్టెగా రూపొందించవచ్చు లేదంటే చిన్న పూజామందిరంలా తయారుచేయవచ్చు ఎండుకొబ్బరిబొండాన్ని చాకుతో చెక్కి, కోతి బొమ్మ చేయవచ్చు. పిల్లలూ ఈ పనిలో పాలుపంచుకునేలా చేస్తే కొబ్బరి వల్ల కలిగే ఉపయోగాలన్నో వారికి తెలియజేసే వీలుంటుంది. ప్రకృతితో మమేకం చేసే అవకాశం లభిస్తుంది. సృజనాత్మకత, నైపుణ్యం ఉపయోగిస్తే లెక్కలేనన్ని అలంకరణ వస్తువులు మీ చేతుల్లోనే రూపుదిద్దుకుంటాయి. మీషోకేస్‌లో కనువిందుచేస్తాయి. అప్పుడిక కొబ్బరిచిప్పలను ఎవరు పడేసినా ఊరుకోరు. మీ కోకోనట్ షెల్ఫ్ చూసిన వారు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేరు.