కొబ్బరికి మూ‘ఢాం’ | Slowdown in coconut exports | Sakshi
Sakshi News home page

కొబ్బరికి మూ‘ఢాం’

Nov 30 2025 3:54 AM | Updated on Nov 30 2025 3:54 AM

Slowdown in coconut exports

శుక్ర మౌఢ్యమి ప్రభావంతో మందగించిన కొబ్బరి ఎగుమతులు

అంబాజీపేట మార్కెట్‌లో ధర పతనం

వెయ్యి కాయల ధర రూ.13,500 నుంచి రూ.14 వేలే

నాలుగు రోజుల్లో మరో  రూ.2,500 వరకూ తగ్గుదల

సాక్షి, అమలాపురం/అంబాజీపేట: కొబ్బరికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మూడు నెలల క్రితం ధర ఎంత వేగంగా పెరిగిందో.. ఇప్పుడు అంతకంటే వేగంగా పతనమవుతోంది. కార్తీక మాసం పూర్తవడంతో ఉత్తరాదికి కొబ్బరి ఎగుమతులు తగ్గాయి. ఫలితంగా ధర పడిపోయింది. రెండున్నర నెలల పాటు ఉండే శుక్ర మౌఢ్యమి మొదలవుతుండటంతో ఎగుమతులు మరింత క్షీణించి.. ధర మరింత పతనమైంది. 

రాష్ట్ర మార్కెట్‌కు దిక్సూచిగా నిలిచే అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట కొబ్బరి మార్కెట్‌లో వెయ్యి పచ్చికాయల ధర రూ.13,500 నుంచి రూ.14 వేలు మాత్రమే పలుకుతోంది. రెండు నెలల క్రితం పచ్చి కొబ్బరి వెయ్యి కాయల ధర రూ.28 వేల వరకూ ఉండేది. 

గత నెలలో రూ.23 వేలకు పడిపోయింది. నాలుగు రోజుల క్రితం వెయ్యి కాయల ధర రూ.16 వేలకు తగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా రూ.13,500కు పతనమైంది. నాలుగు రోజుల్లో రూ.2,500 వరకూ ధర తగ్గిపోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

ఎగుమతులు 20లోపు లారీలే
దీపావళి, కార్తీక మాసం పూర్తవడం, తమిళనాడు, కేరళల్లో దిగుబడులు పెరగడంతో రాష్ట్రంలో పండిన కొబ్బరికి డిమాండ్‌ తగ్గింది. దీంతోపాటు శుక్ర మౌఢ్యమి కారణంగా ధరలు మరింత పడిపోయాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతులు కూడా గణనీయంగా తగ్గుతున్నాయి. రోజుకు 20 లారీలలోపు పచ్చి కొబ్బరి ఎగుమతి మాత్రమే జరుగుతోందని వ్యాపారులు వాపోతున్నారు. ఈ ప్రభావం మార్కెట్‌పై పడుతోందని వారు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement