కనీసం 60 ఏళ్లకు పైగా వక్క తోటలతో స్థిరమైన ఆదాయం
కొబ్బరికి సమానంగా దీర్ఘకాలిక పంట
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2 వేల ఎకరాల్లో సాగు
ఇప్పుడిప్పుడే మొదలవుతున్న దిగుబడి
దీర్ఘకాలిక ఆదాయం వచ్చే కొబ్బరి తోటల జాబితాలో ‘వక్క’పంట కూడా నిలుస్తోంది. ఈ రెండు పంటలు కనీసం 60 నుంచి 100 ఏళ్ల వరకు దిగుబడి ఇస్తున్నాయి. తద్వారా రెండు నుంచి మూడు తరాలకు స్థిరమైన ఆదాయం లభిస్తోంది. కొబ్బరి తోటల్లో అంతర పంటగా వక్క సాగుకు అవకాశం ఉంది. ఒకవేళ వక్కపంటను నేరుగా సాగు చేస్తే కొన్నేళ్లపాటు అంతర పంటలతో అదనపు ఆదాయం కూడా పొందొచ్చు. – దమ్మపేట
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదలైన వక్క దిగుబడి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే తొలిసారి దమ్మపేట, అశ్వారావుపేట, సత్తుపల్లి తదితర మండలాల్లో రైతులు కొబ్బరి, ఆయిల్‌పామ్ క్షేత్రాల్లో వక్క పంటను అంతర పంటగా సుమారు 2 వేల ఎకరాలకు పైగానే సాగు చేశారు. అశ్వారావుపేట మండలం గంగారంలో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, దమ్మపేట మండలం మందలపల్లిలో సేంద్రియ రైతు దేవరపల్లి హరికృష్ణ తమ కొబ్బరి తోటల్లో అంతర పంటగా సాగు చేసిన వక్క తోటల్లో ఇటీవల దిగుబడి మొదలైంది. తాజాగా పచ్చి వక్క గెలలను కోయగా ఎకరాకు టన్ను నుంచి రెండు టన్నుల వరకు దిగుబడి వచి్చంది. టన్ను రూ.45 వేల చొప్పున విక్రయించారు. వక్క పంట జీవితకాలం 60–100 ఏళ్ల వరకు ఉంటుందని, అయితే 80 ఏళ్ల తర్వాత మొక్కలు ఎత్తు పెరిగి కోత కష్టం కావడంతో అంతవరకే ఆపేస్తారని చెబుతున్నారు. అయితే రాష్ట్రంలో ఆ వయస్సు తోటలు ఎక్కడా లేవు.
టన్ను ధర రూ.48 వేలకు పైనే..
ప్రస్తుతం పచ్చి వక్క టన్ను ధర రూ.48 వేల నుంచి రూ.52 వేల వరకు పలుకుతోంది. పెట్టుబడి వ్యయం తక్కువగా ఉండి దీర్ఘకాలం స్థిర ఆదాయాన్ని ఇచ్చే పంట కావడంతో రైతులు ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు. వక్క సాగుకు నీరు నిలవని పొడి, గట్టు, మెరక నేలలు అనుకూలంగా ఉంటాయి. తేమతో కూడిన మంచి ఉష్ణోగ్రతలు (14 డిగ్రీల నుంచి 36 డిగ్రీలు) మొక్క పెరుగుదల, దిగుబడికి దోహదం చేస్తాయి.
ఏపీలోని ఏలూరు జిల్లా నర్సరీల్లో రూ.50 అంతకన్నా కాస్త ఎక్కువ ధరలో మొక్కలు లభిస్తాయి. జూన్ నుంచి డిసెంబర్ వరకు ఎకరానికి 500’–700 మొక్కలు నాటుకోవచ్చు. కొబ్బరిలో అయితే అంతర పంటగా ఎకరాకు 400 మొక్కలు నాటొచ్చు. మొక్కల పెరుగుదల, కాలానుగుణంగా నీరు, పశువుల పేడ, సేంద్రియ, రసాయన ఎరువులను తగు మోతాదులో వాడాలి. మొదటి రెండేళ్లు అరటి, జాజి, మిరియాలు వంటివి అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు. సాగుకు ఏటా పెట్టుబడి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది.
దిగుబడి..ఆదాయం
వక్కలకు మార్కెట్‌లో డిమాండ్ పడిపోయే ప్రమాదం లేదు. ఈ మేరకు రైతులు నమ్మకంగా సాగు చేయొచ్చని అధికారులు సూచిస్తున్నారు. పంట దిగుబడి 5–6 ఏళ్లకు మొదలై తొలుత క్వింటా నుంచి రెండు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని చెబుతున్నారు. ఆ తర్వాత గరిష్టంగా ఎకరాకు 5– 8 క్వింటాళ్ల వరకు దిగుబడి రావొచ్చు. తద్వారా ఎకరా తోట నుంచి ఏటా రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల ఆదాయం సమకూరుతుంది.
ఆరో ఏట నుంచి దిగుబడి
రెండెకరాల కొబ్బరి తోటలో అంతర పంటగా ఎకరాకు 400 వక్క మొక్కలు నాటి సేంద్రియ ఎరువులే వాడా. పెట్టుబడి ఎకరాకు రూ.30 వేలు దాటలేదు. ఆరో ఏట ఎకరానికి టన్నుకు పైగానే దిగుబడి వచ్చింది. ఏపీలోని ఏలూరు జిల్లా సీతానగరంలో ఉన్న ప్రొసెసింగ్ యూనిట్ వారు టన్ను రూ.45 వేల చొప్పున కొనుగోలు చేశారు.
– దేవరపల్లి హరికృష్ణ, రైతు, మందలపల్లి


