పింక్ నెల | Breast cancer awareness | Sakshi
Sakshi News home page

పింక్ నెల

Oct 5 2016 10:58 PM | Updated on Sep 4 2017 4:17 PM

పింక్  నెల

పింక్ నెల

పింక్ రిబ్బన్ అనగానే రొమ్ము క్యాన్సర్ చైతన్యం గుర్తుకొస్తుంది.

ప్రతి అక్టోబర్‌లో...  పింక్ చైతన్యం
‘పింక్ రిబ్బన్ల’ కథేంటి?

 
పింక్ రిబ్బన్ అనగానే రొమ్ము క్యాన్సర్ చైతన్యం గుర్తుకొస్తుంది. 1993 నుంచి రొమ్ము క్యాన్సర్ చైతన్యానికి ప్రత్యేక చిహ్నంగా ‘పింక్ రిబ్బన్’ వాడకం స్థిరపడింది. కానీ, ‘పింక్ రిబ్బన్’ వాడకం అంతకు ముందు కొన్నేళ్ళ నుంచే ఉంది. అప్పట్లో క్యాలిఫోర్నియాకు చెందిన 68 ఏళ్ళ చార్లొటే హాలే అనే మహిళ తాలూకు సోదరి, కుమార్తె, మనుమరాలు - అందరూ రొమ్ము క్యాన్సర్ బారినపడ్డవాళ్ళే! దాంతో, ఈ క్యాన్సర్‌పై పరిశోధనకు తగినన్ని నిధులు సేకరించాల్సిన అవసరాన్ని అందరి దృష్టికీ తెచ్చేందుకు ఆమె ఒక వినూత్న ప్రయత్నం చేశారు. ‘పీచ్’ రంగులోని రిబ్బన్లను అందరికీ పంచారు. ఇక, ఆ తరువాత 1991లో ఒక సంస్థ రొమ్ము క్యాన్సర్ బారిన పడి బయటపడ్డవాళ్ళతో న్యూయార్క్ నగరంలో పరుగు నిర్వహించింది. అందులో పాల్గొన్నవాళ్ళందరికీ పింక్ రిబ్బన్లు పంచింది. అలా మొదలైన ‘పింక్ రిబ్బన్ల’ అలవాటు 1993 నుంచి పూర్తిగా స్థిరపడి, ఇప్పుడు రొమ్ము క్యాన్సర్‌కు పర్యాయపదంగా మారింది.
 
మహిళల్లో అధిక మరణాలు ఈ క్యాన్సర్ వల్లే!
ఇవాళ భారతదేశంలో మహిళల్లో ఎక్కువమంది ప్రాణాలు తీస్తున్న క్యాన్సర్ - రొమ్ము క్యాన్సర్. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనం ఈ సంగతి పేర్కొంది. 1990 నుంచి 2013 వరకు లెక్కలు చూస్తే బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఏకంగా 166 శాతం పెరిగాయి. ప్రపంచం నలుమూలల నెలకొన్న ధోరణులకు తగ్గట్లే, ఇండియాలో ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్, మగవాళ్ళలో ప్రొస్టేట్ క్యాన్సర్ అనూహ్యంగా పెరిగింది.
 

సగం మందికి 50 ఏళ్ళ లోపే!
కొన్ని దశాబ్దాల క్రితం దాకా కేవలం 50 ఏళ్ళ పైబడినవాళ్ళకే రొమ్ము క్యాన్సర్ వచ్చేది. చిన్న వయసు స్త్రీలలో అది చాలా తక్కువ. రొమ్ము క్యాన్సర్ పీడితుల్లో 50 ఏళ్ళ పైబడినవాళ్ళు దాదాపు 65 నుంచి 70 శాతం ఉండేవారు. ఇక, 50 ఏళ్ళ లోపు వాళ్ళు 30 నుంచి 35 శాతమే ఉండేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. చిన్న వయసు వారిలో ఈ క్యాన్సర్ మరింత కామన్‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలోని రొమ్ము క్యాన్సర్ బాధిత మహిళల్లో దాదాపు సగం మంది ముప్ఫై నుంచి యాభై ఏళ్ళ లోపు వయస్సువాళ్ళే! దురదృష్టం ఏమిటంటే, నూట్జికి 70 కేసుల్లో క్యాన్సర్ బాగా ముదిరేవరకు రోగాన్ని గుర్తించకపోవడం! అలా కాకుండా, ముందుగానే పరీక్ష చేయించుకొని, రోగాన్ని గుర్తిస్తే ప్రాణాలు నిలుపుకొనే అవకాశం ఎక్కువ.
 
 ప్రతి 28 మందిలో ఒకరికి!
మన దేశంలో దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ఎక్కువ మంది ప్రాణాలు తీసిన క్యాన్సర్ - గర్భాశయ (సర్వికల్) క్యాన్సర్. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. రోజు రోజుకీ రొమ్ము క్యాన్సర్ పీడితులు క్రమంగా పెరుగుతూ వస్తున్నారు. ఫలితంగా ఇప్పుడు సర్వికల్ క్యాన్సర్ కన్నా రొమ్ము క్యాన్సర్ పెను వ్యాధిగా మారింది. ఇవాళ మన దేశంలో ప్రతి 28 మంది మహిళల్లో ఒకరికి జీవితంలో ఏదో ఒక సమయంలో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం కనిపిస్తోంది.
 
 
 
ఇండియాలో ఇదే ఎక్కువ!
ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల తరువాత రెండో అతి పెద్ద ప్రాణాంతక వ్యాధి - క్యాన్సర్. అందులోనూ ఇండియాలో అయితే, అత్యంత తరచుగా వచ్చే క్యాన్సర్ - రొమ్ము క్యాన్సర్. ఆ తరువాతి స్థానం నోటి క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్‌లది. రొమ్ము క్యాన్సర్‌ను వీలైనంత తొందరగా తొలి దశలోనే గుర్తించడం చాలా అవసరం. ఎందుకంటే, ముదిరిన కొద్దీ క్యాన్సర్‌కు చికిత్స సంక్లిష్టంగా మారుతుంది.
 
 
 
మగాళ్ళకూ ఓ వారం!
చాలామందికి ఆశ్చర్యం అనిపించవచ్చు కానీ, మగవాళ్ళకీ రొమ్ము క్యాన్సర్ వస్తుంటుంది. కానీ, చాలా అరుదు. అందుకే కావచ్చు... సాధారణంగా దీని గురించి ఎవరూ పెద్దగా దృష్టి పెట్టరు, ప్రచారం చేయరు. అయితే, 2009లో పురుషుల రొమ్ము క్యాన్సర్‌పై చైతన్యం కోసం కొన్ని సంస్థలు కలసి ముందుకు వచ్చాయి. అప్పటి నుంచి ప్రపంచమంతటా ప్రతి ఏటా అక్టోబర్ నెలలోనే మూడో వారాన్ని ‘పురుషుల రొమ్ము క్యాన్సర్ చైతన్యోద్యోమ వారం’గా జరిపేలా చైతన్యం తీసుకువస్తున్నారు.
 
 త్వరగా.... కనిపెడితే కాపాడవచ్చు!
 ఒక్క గడచిన 2015 సంవత్సరంలోనే... కొత్తగా దాదాపు లక్షన్నర పైగా రొమ్ము క్యాన్సర్ కేసులు నమోదు. దేశంలో సుమారు 76 వేల మంది స్త్రీల మరణం. క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించాల్సిన అవసరంపై దృష్టి పెట్టకపోతే, ఈ మరణాల సంఖ్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. తొలి దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్‌ను కనిపెట్టడానికి - స్వయంగా రొమ్ములను పరీక్షించుకోవడం, అలాగే మ్యామోగ్రఫీ ఉత్తమ సాధనాలని డాక్టర్లు నొక్కిచెబుతున్నారు.  దురదృష్టవశాత్తూ మన దేశంలో అధిక శాతం కేసుల్లో క్యాన్సర్‌ను చాలా ఆలస్యంగా గుర్తిస్తున్నారు. సాక్షాత్తూ ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ (డబ్ల్యు.హెచ్.ఒ) ఆ సంగతి వెల్లడించింది. మహిళల్లో నూటికి 60కి పైగా కేసుల్లో - మూడో దశలోనో, నాలుగో దశలోనో ఉన్నప్పుడు కానీ, క్యాన్సర్‌ను కనిపెట్టడం లేదని డబ్ల్యు.హెచ్.ఒ. పేర్కొంది. దీని వల్ల చికిత్సకు అవకాశాలు, రోగిని కాపాడే ఛాన్స్‌లు తగ్గుతున్నాయి.
 
 
సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇలా!
బిఎస్‌ఇ అంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇరవై ఏళ్లు నిండిన ప్రతి స్త్రీ నెలకోసారి బిఎస్‌ఈ చేసుకోవాలి. బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలను ముందుగా పసిగట్టి, వ్యాధి ముదరకముందే చికిత్స చేయించుకోవడానికి ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. అద్దం ముందు నిలబడి చేతులను తల వెనుకకు పెట్టి బ్రెస్ట్ ఆకారాన్ని రొమ్ముల ఆకారాన్ని గమనించాలి  చేతులను నడుము మీద పెట్టి భుజాలను లోపలికి కుదించి మోచేతులను దేహం ముందు వైపుకు తీసుకురావాలి. ఇలా చేస్తున్నప్పుడు బ్రెస్ట్ కదులుతాయి, ఆ కదలికలను బట్టి కండరాల్లో మార్పులు ఉన్నాయేమో గమనించాలి  రొమ్ముల పై భాగం, చుట్టూ, చంకల కింద కూడా నొక్కి చూడాలి  ఇప్పుడు నిపిల్స్ మెల్లగా నొక్కి పాలలాగ లేదా నీటిలాగ ద్రవం విడుదలవుతుందేమో చూడాలి  తర్వాత వెల్లకిలా పడుకుని చేతివేళ్లతో బ్రెస్ట్‌ను తాకుతూ పరీక్షించుకోవాలి. పడుకున్నప్పుడు తలకింద దిండు  ఉండరాదు, భుజాల కింద మడతపెట్టిన టవల్‌ను ఉంచుకోవాలి. ఈ స్థితిలో రొమ్ముల కండరాలు పక్కటెముకల మీద విస్తరించినట్లు పరుచుకుంటాయి. దాంతో చిన్న గడ్డలాంటిది ఉన్నా వెంటనే తెలిసిపోతుంది.
 
ఈ పరీక్షను...

రుతుక్రమం పూర్తయిన తొలిరోజు చేసుకుంటే మంచిది. ఎందుకంటే పీరియడ్స్ మొదలయ్యే సమయంలో సాధారణంగానే రొమ్ములలో చిన్నపాటి గడ్డలు ఏర్పడుతుంటాయి. ఇవి రుతుక్రమం మొదలైన మూడు- నాలుగు రోజుల్లో కరిగిపోతాయి. ఆ తర్వాత కూడా ఏదైనా లంప్ తగిలితే అది బ్రెస్ట్ క్యాన్సర్‌కు సూచిక అయి ఉండవచ్చనే సందేహంతో డాక్టర్‌ను సంప్రదించి నిర్ధారించుకోవాలి.
 
అలాగే...
నిపిల్స్ నుంచి పాలలాగ ద్రవం విడుదలవుతున్నా, రొమ్ములలో వాపును గమనించినా, చర్మం మీద దురద పెడుతున్నా, బుడిపెలాంటిది ఏర్పడినా, నిపిల్స్‌లో నొప్పి, ఎరుపుదనం, లోపలికి ముడుచుకుపోవడం వంటి లక్షణాలను గమనించినా అశ్రద్ధ చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
 
ఓడించవచ్చు!
యూ ట్యూబ్ చిత్రం

బ్రెస్ట్ క్యాన్సర్‌ను ముందుగానే తెలుసుకుని నయం చేసుకుంటున్నవారు కొందరైతే, ఆలస్యంగా తెలుసుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారు మరికొందరు. బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన కోసం అనేక లఘుచిత్రాలు గతంలో వచ్చాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి.  ప్రారంభదశలోనే గుర్తించడం ప్రధానమని చెప్పే ‘వి కెన్ డిఫీట్ బ్రెస్ట్ క్యాన్సర్’ అనే చిత్రం 2012లో వచ్చింది. ‘ఫోరమ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రొటెక్షన్’ దీనిని నిర్మించింది. ఈ లఘుచిత్రంలో ముందుగా... క్యాన్సర్ బారి నుంచి బయటపడినవారితో మాట్లాడించారు. ఎవరికి వారు పరీక్షించుకోవడం ఒక విధానం. మామోగ్రఫీ ద్వారా తెలుసుకోవడం మరో విధానం. ఇది ఏమాత్రం నొప్పి కలిగించే పరీక్ష కాదు అని ఈ చిత్రం ద్వారా అవగాహన కల్పించారు.

భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ బాధితుల సంఖ్య అధికంగా ఉంటోందని, ఏటా వేలాది మంది మహిళలు ఈ క్యాన్సర్ కారణంగా మరణిస్తున్నారని ఈ చిత్రంలో చూపారు. 65 శాతం మంది మహిళలు ప్రారంభదశలో గుర్తించుకోలేక, మూడవ దశలోనో, నాల్గవ దశలోనో తెలుసుకుంటున్నారని, అందువల్ల వారు ప్రాణాలు కోల్పోతున్నారని కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ వినీత్ కపూర్ చేత ఈ చిత్రంలో చెప్పించారు. బాగా చదువుకున్నవారు సైతం ఈ విషయాలను తెలుసుకోలేక పోతున్నారని, తరచు డాక్టర్‌ను సంప్రదించి, పరీక్షలు చేయించుకోవడం మంచిదని ఈ షార్ట్ ఫిల్మ్ చెబుతోంది. ‘వి కెన్ డిఫీట్ బ్రెస్ట్ క్యాన్సర్’ అనే 16 నిమిషాల నిడివి గల ఈ లఘు చిత్రానికి రచన, నిర్మాణం, దర్శకత్వం సుస్మితా సేన్ గుప్తా.
 
బ్రెస్ట్‌క్యాన్సర్  బాధితులకి యోగా
రొమ్ము క్యాన్సర్‌కి ముఖ్యమైన కారణం లింఫ్యాటిక్ సర్క్యులేటరీ సిస్టమ్ సరిగా పనిచేయక పోవడం. ఆక్సిజన్ సరఫరా సరిగా లేక...లింపు గ్రంధుల్లో వాపు రావడం. కనుక లింఫ్యాటిక్ సిస్టమ్ బాగా పనిచేయడానికి ఉపయోగపడే ఆసనాలు, ప్రాణాయామాలు, జీవన విధానం అనుసరించాలి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పబ్లిక్ యాక్సిస్-ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయ పరిశోధనలో రిస్టోరేటివ్ యోగా ద్వారా 80 శాతం రోగులు ఒత్తిడి, చికాకులకు గురికాకుండా మానసికంగా చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు వెల్లడైంది. రొమ్ము క్యాన్సర్ బాధితులు మాత్రమే కాకుండా  నివారణ కోసం ముందు జాగ్రత్తగా  సేతు బంధాసనం, సర్వాంగాసనం, ధనురాసనం, సర్పాసనం, చక్రాసనం, బ్రహ్మ ముద్రలు, అంగచాలన, కర్ణ భుజ స్పర్శ వంటివి సాధన చేయడం చాలా మంచిది.
 
బ్రహ్మముద్రలు అంటే: సమస్థితిలో నిలబడి శ్వాస తీసుకుంటూ తలను కొంచెం పైకి ఎత్తడం, శ్వాస వదులుతూ మళ్లీ యథాస్థితికి రావడం, శ్వాస వదులుతూ గడ్డం ఛాతీ మీదకు శ్వాస తీసుకుంటూ మళ్లీ యథాస్థితికి రావడం, తర్వాత శ్వాస తీసుకుంటూ గడ్డం కుడి భుజం మీదకు... తిరిగి శ్వాస వదులుతూ మధ్యలోకి తీసుకురావాలి. ఇదే తరహాలో 5సార్లు రిపీట్ చేయాలి.
 
ప్రాణాయామాలు: భస్త్రిక, శక్తి చాలన భస్త్రిక, కపాల భాతి, మాత్రిక కపాల భాతి, మార్జాల కపాల భాతి, లింప్ గ్రంధులు బాగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. మనసుకు ప్రశాంతతను చేకూర్చే చంద్రబేధి, అనులోమ విలోమ, భ్రమరీ ప్రాణాయామాలు చేయడం కూడా చాలా ముఖ్యం. యోగ కాయ చికిత్స, కాయ సంవాదనను అనుసరించి రొమ్ములకు రెగ్యులర్‌గా క్లాక్ వైజ్, యాంటి క్లాక్‌వైజ్  మసాజ్ చేయడం, స్క్వీజింగ్, ఉద్ధ్వర్తనం లాంటి ప్రక్రియలను అనుసరించడం వల్ల కూడా రొమ్ములో కణితులు ఏర్పడకుండా నిరోధించవచ్చు. నాణ్యత కలిగిన స్పోర్ట్స్ బ్రాను అధికంగా ఉపయోగించడం మంచిది.  రోజులో ఎక్కువ సమయం బ్రా ధరించి ఉండడం మంచిది కాదు. ఎక్కువ సేపు బ్రా ధరించి ఉంటే క్యాన్సర్ కారకమైన ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువ విడుదల అవుతుంది.
 కొన్ని సూచనలు... ఆహార విషయంలో అయోడిన్ లోపం లేకుండా చూసుకోవాలి. సుగర్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, అడల్ట్రేటెడ్ మిల్క్ ప్రొడక్ట్స్, కార్బొరేటెడ్ డ్రింక్స్ తీసుకోకూడదు. కెఫిన్ పూర్తిగా నిషేధం. నడివయసు స్త్రీలు ఏడాదికి ఒకసారైన మామోగ్రఫీ లేదా 3డి ఇమేజింగ్ పరీక్షలు చేయించుకోవడం అవసరం.
 
ఎ.ఎల్.వి కుమార్
ట్రెడిషనల్  యోగా ఫౌండేషన్
 
వీరు రొమ్ము క్యాన్సర్‌ను జయించారు
రొమ్ము క్యాన్సర్ వచ్చిందని తెలియగానే జీవితం అంతం అయిపోయిందనీ ఇక మృత్యువుకు దగ్గర పడ్డట్టేనని ఎట్టి పరిస్థితిలోనూ అనుకోరాదు. ప్రపంచంలో ఎందరో మహిళలు ఈ క్యాన్సర్ నుంచి సులువుగా బయటపడ్డారు. పడుతూనే ఉన్నారు. వీరి విజయం స్ఫూర్తిదాయకం. కొందరు బ్రెస్ట్ క్యాన్సర్ విజేతలు.
 
మార్టినా నవ్రతిలోవా
ఈ టెన్నిస్ సూపర్‌స్టార్‌కు 2010లో రొమ్ము క్యాన్సర్ తొలి దశలో ఉందని గుర్తించారు. ఆరువారాల పాటు ఆమె రేడియేషన్ థెరపీని తీసుకుంది. ఆ తర్వాత పరీక్షిస్తే ఆమెకు క్యాన్సర్ పూర్తిగా నయమైందని తేలింది. ఇప్పుడు ఆమె క్యాన్సర్ విజేత.
 
ముంతాజ్
అలనాటి హిందీ సినీనటి ముంతాజ్‌కు తన 54వ ఏట రొమ్ము క్యాన్సర్ అని తేలింది. కాని ఆమె భయపడలేదు. వైద్యం చేయించుకుంది. ఇప్పటికి 11 ఏళ్లు గడిచాయి. ఆమె ఆ మహమ్మరి మీద విజయాన్ని సాధించి దరహాసం చిందిస్తూ ఉంది.
 
బార్బరా మోరి

హృతిక్ రోషన్ సరసన హిందీ చిత్రం ‘కైట్స్’లో నటించిన మెక్సికన్ నటి బార్బారా మోరీకి 2009లో రొమ్ము కేన్సర్ నిర్థారించారు. ఆమె ఏ మాత్రం ఆలస్యం చేయకుండా శస్త్ర చికిత్స ద్వారా క్యాన్సర్ సోకిన భాగాన్ని తొలగించుకుంది. కీమో థెరపీ అవసరం కూడా ఆమెకు లేకపోయింది. ఇప్పుడు ఆమె క్యాన్సర్ రహిత మహిళగా తన సినీ కెరీర్‌ను కొనసాగిస్తోంది.
 
క్రిస్టీనా ఏపిల్‌గేట్
ప్రఖ్యాత హాలీవుడ్ నటి క్రిస్టీనఆ ఏపిల్‌గేట్‌కు 2008లో రొమ్ము క్యాన్సర్ వచ్చింది. ఆమె తల్లికి కూడా ఈ సమస్య ఉండగా ఆమె దానిపై విజయం సాధించింది. అయితే పదేపదే ఈ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు క్రిస్టీనా తన రెండు వక్షోజాలను తొలగించుకుని బ్రెస్ట్ రీకన్‌స్ట్రక్షన్ సర్జరీ ద్వారా కృత్రిమ వక్షోజాలను అమర్చుకుంది. ఇప్పుడామె ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతూ క్యాన్సర్ పరీక్షలకు నోచుకోలేని పేద మహిళల కోసం పరీక్షలు నిర్వహించే ఫౌండేషన్‌ను నిర్వహిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement