ముంబై మిస్సమ్మ

Both Husband and Wife are Sharing each response  Response Buliti - Sakshi

ఇల్లు కావాలంటే ఇల్లాలు ఉండాలిముంబైలోని గవర్నమెంట్‌ హౌజింగ్‌ స్కీమ్‌లో తప్పనిసరి నిబంధన అది!ప్రభుత్వమే తప్పనిసరి అన్నప్పుడు తప్పుతుందా? ఏడు తప్పటడుగులు వేయక తప్పుతుందా?మన మిస్సమ్మలాగే!రామారావు, సావిత్రి ఉద్యోగం కోసం మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ అయితే అక్కడ ముంబైలో వాళ్లు ఫ్లాట్‌ కోసం మిస్సమ్మ, మిస్సయ్య అయ్యారు!ఇదే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ‘లవ్‌ పర్‌ స్క్వేర్‌ ఫూట్‌’ సినిమా!

‘‘ఇవ్వాళ్రేపు భార్యాభర్తలంతా ప్రతి రెస్పాన్స్‌ బులిటీని కలిసే షేర్‌ చేసుకుంటున్నారు తెల్సా? కలిసి గిన్నెలు కడుక్కోవడం.. బట్టలుతుక్కోవడం.. కలిసి ఆఫీస్‌కు వెళ్లడం..ఇలాఅన్నీ ఫిఫ్టీ ఫిఫ్టీ’’ కరీనా .‘‘సండేస్‌ చిల్‌గా.. బయటనుంచి ఫుడ్‌ ఆర్డర్‌ చేసుకోవడం...’’ సంజయ్‌.‘‘బయటనుంచి ఎందుకు? భార్యాభర్త ఇద్దరూ కలిసి వంట చేసుకుంటే ఎంత రొమాంటిక్‌గా ఉంటుంది?!’’ కరీనా. ‘‘ఎన్నాళ్ల నుంచి మీ ఫ్రెండ్‌షిప్‌?’’ బ్లాసమ్‌.‘‘వన్‌ మంత్‌ నుంచి ఆంటీ!’’ సంజయ్‌.‘‘ఆ జీవన్‌ వాలా ఫ్లాట్‌ ఎప్పుడు తీసుకున్నారు?’’ బ్లాసమ్‌.‘‘ మొన్ననే’’ ఉత్సాహంగా సంజయ్‌.‘‘లవ్‌? ఈరోజు పొద్దునా?’’ బ్లాసమ్‌ వెటకారం.‘‘మమ్మీ..’’ వారించింది కరీనా.నిట్టూరుస్తూ సోఫాలోంచి లేచింది ‘‘చికెన్‌ పాటీస్‌ తెస్తా. తింటాడుగా అతను’’అని సంజయ్‌ను ఉద్దేశించి కూతురిని అడుగుతూ.‘‘లేదాంటీ.. నేను వెజిటేరియన్‌’’ సంజయ్‌. ‘‘ ఫిష్‌?’’ బ్లాసమ్‌‘‘లే.. దాంటీ’’ తల అడ్డంగా తిప్పాడు.‘‘మరి ఈమెకు చచ్చేంత ఇష్టం కదా?’’ అవాక్కయింది బ్లాసమ్‌. ‘‘ఓ మైగాడ్‌.. నువ్వు హిందువుగా కన్వర్టవుతున్నావా?’’ కంగారు పడుతూ కూతురితో.

 ‘‘నో..’’ , ‘‘అయ్యో లేదాంటీ’’ కరీనా, సంజయ్‌ ఒకేసారి.‘‘మరి పిల్లలు?’’ అడిగింది బ్లాసమ్‌.‘‘మమ్మీ... ఇక ఆపుతావా నువ్వు?’’ కోపంగా కరీనా.‘‘ఆపను. అతనిది వేరే మతం. వాళ్ల సంప్రదాయాలు, ఆచారాలు తెలుసా నీకు? కలిసి బతకాలి’’ విసురుగా కూతురికి సమాధానమిస్తూనే – ‘‘పిల్లలు? హిందువులవుతారా? క్రిస్టియన్సా?’’ ప్రశ్నిస్తుంది సంజయ్‌ని.‘‘మమ్మీ.. ఇవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు’’ కోపాన్ని అణచుకుంటూ కరీనా.‘‘తర్వాత ఎప్పుడు? అంతా అయిపోయాకా?’’ కూతురిని వారించి – ‘‘నువ్వు దేవుడిని నమ్ముతావా?’’ అడుగుతుంది సంజయ్‌ని.‘‘నమ్మను ఆంటీ’’ చెప్తాడు ‘‘గుడ్‌.. ఈమె కూడా నమ్మదు’’ కూతురిని చూపిస్తూ బ్లాసమ్‌. ‘‘చూడూ.. సంజయ్‌! కష్టపడి పెంచా ఈమెను. అదేమీ తనకు పట్టదు. కేర్‌ చేయదు. అయినా నా చింతల్లా ఈ పిల్ల గురించే. ఒక్కగానొక్క కూతురు. రేప్పొద్దున తనకేమన్నా అయితే..’’ బ్లాసమ్‌. ‘‘ఆంటీ.. నేను చతుర్వేది. తను డిసౌజా.

నాకు పన్నీర్‌ అంటే ఇష్టం. తనకు ఫిష్‌ అంటే! మా ఇద్దరికి ఇవి అడ్డు కావు. కరీనా నా ప్రాణం. జీవితాంతం గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. పెళ్లయ్యాక చిన్న చిన్న స్పర్థలొచ్చినా వాటికి మతం మాత్రం రీజన్‌ కాదని ప్రామిస్‌ చేస్తున్నా ఆంటీ! ఇక మా పిల్లల గురించి అంటారా? జీసస్‌ను కొలుస్తారా.. ఆంజనేయస్వామిని తలుస్తారా? సచిన్‌ టెండూల్కర్‌ను పూజిస్తారా? వాళ్లిష్టం ఆంటీ! ఇప్పుడైతే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. బ్లెస్‌ చేయండి’’ విన్నవించుకున్నాడు సంజయ్‌.∙∙ ‘‘నాన్‌వెజ్‌ తినే అమ్మాయి ఎప్పటికీ ఈ ఇంటి కోడలు కాదు’’ వంటింట్లో భోజనం చేస్తూ సంజయ్‌ తండ్రి భాస్కర్‌.‘‘నాన్నా.. ’’బాధగా సంజయ్‌.ముందుగదిలో కొడుకు కొనబోయే ఫ్లాట్‌ తాలూకు నక్షా చూస్తూ ‘‘ఇదంతా ఎప్పుడు ప్లాన్‌ చేసుకున్నావ్‌?’’ అడిగింది కొడుకును అతని తల్లి లత. మొన్ననే అన్నట్లు సైగ చేశాడు. ‘‘నీ పేరు మీదే ఉంటుందా ఇల్లు?’’ ఆమె.

కాదు అన్నట్టు తలాడించాడు కొడుకు. ‘‘ఇద్దరి పేరు మీదనా?’’ ఆమె. అవునన్నట్టు తలూపాడు సంజయ్‌.  ‘‘ఆ పిల్ల పేరు విన్నావా? డిసూజా అట డిసూజా’’ లోపలి నుంచి తండ్రి. ‘‘ఎందుకలా మాట్లాడ్తారు నాన్నా.. మీరు సంతోషపడ్తారనుకున్నా..’’ ‘‘అలా అనుకున్నవాడివి అంతా అయ్యాకే చెప్పాల్సింది?’’ తండ్రి.‘‘పెళ్లయితే చేసుకోలేదు కదా?’’ తల్లి ఆందోళనగా. లేదన్నట్టు తలూపాడు కొడుకు. ‘‘తెల్లగా ఉంటుందా?’’ తల్లి ఉత్సుకత. ‘‘రేపు నువ్వే స్వయంగా చూడు’’ తల్లితో సంజయ్‌. ‘‘ఇంటి కోసం కిరస్తానీ పిల్ల చేయి పట్టుకోవాల్సిన అవసరం ఏం ఉండింది? నన్ను అడిగితే సర్దకపోయేవాడినా డబ్బు?’’ కోపగిస్తున్నాడు తండ్రి.‘‘ఆ.. ఉద్యోగంలో ఉన్నన్నాళ్లు చేతకాలేదు కానీ.. రిటైర్మెంట్‌ తర్వాత సర్దుతాడట సర్దుతాడు’’ అని లోలోపలే సణుక్కుంటూ కూర్చున్న చోట నుంచే వంటింట్లోకి తొంగి చూస్తూ ‘‘మీరు ప్రశాంతంగా భోంచేయండీ..’’అంది భర్తతో. ‘‘చతుర్వేది వంశం పేరు ఏం కాను?’’తండ్రి కొనసాగింపు. ‘‘అవును పాపం.. రోజూ పేపర్లలో హెడ్‌లైన్స్‌ అన్నీ చతుర్వేది వంశం గురించే!’’భర్తతో వెటకారమాడి కొడుకును ప్రశంసించింది.

 ‘‘చతుర్వేది కుటుంబం నాలుగు తరాల్లో ఓ ఇంటి యజమాని అవుతోంది నువ్వేరా’’ అంటూ! లోపల్నుంచి ఇంకేదో గొణుగుతున్న భర్తతో.. ‘‘అయిందేదో అయిపోయింది. పోనిద్దురూ! పిల్లల్ని దీవిద్దాం’’ అంది. ‘‘బ్లాసమ్‌గారూ... మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందండీ’’ సంజయ్‌ తండ్రి భాస్కర్‌.‘‘నాక్కూడా. ఇదిగో ఈ బ్రౌనీస్‌ తీసుకోండి.. నేనే చేశాను’’ అంటూ కూడా తెచ్చుకున్న టిఫిన్‌ బాక్స్‌ మూత తెరిచి పక్కనే కూర్చున్న సంజయ్‌ తల్లి లత ముందుకు చాపింది బ్లాసమ్‌. ఆమె మొహమాట పడ్తూంటే – ‘‘ఎగ్‌ లెస్‌.. ఎగ్‌ లేకుండా చేశాను’’ నిర్ధారించింది బ్లాసమ్‌. ధైర్యంగా తీసుకొని భర్తకు ఇచ్చింది లతా. అతను చిన్న ముక్క తీసుకొని ‘‘మా ఇంట్లో నాన్‌వెజ్‌ అస్సలు నడవదు’’ అన్నాడు. ‘‘యెస్‌.. మా ఇంట్లో వెజ్‌ ఎవరూ తినరు’’ చెప్పింది బ్లాసమ్‌. ‘‘ఎవరూ తినరా? ఎవ్వరూ? అలా అయితే ఈ పెళ్లి ఎలా కుదురుతుంది?’’ కంగారుగా భాస్కర్‌.

‘‘అదే.. నేనూ అడిగా వీళ్లను ఎలా కుదురుతుంది అని?’’ బ్లాసమ్‌.పిల్లలిద్దరూ ఆందోళనపడుతుంటే.. ‘‘అరే.. ఎందుకు కుదర్దు? వాళ్లిద్దరూ ఒకింటి వాళ్లయ్యాక.. వాళ్లకంటూ కొన్ని నియమాలు ఏర్పర్చుకుంటారు..’’ అని లత సర్దిచెప్పబోతుంటే ‘‘ఒకింటి వాళ్లు.. అంటే ఇల్లు లేకపోతే పెళ్లి చేసుకోరా? ఇల్లు కోసమే పెళ్లి చేసుకుంటున్నారా?’’ వ్యంగ్యంతో అడ్డుకున్నాడు భాస్కర్‌.‘‘అయ్యో లేదంకుల్‌.. మేమిద్దరం ప్రేమించుకున్నాం. అందుకే పెళ్లి చేసుకుందామనుకుంటున్నాం’’ కరీనా. ‘‘ఒరేయ్‌.. నువ్వూ చెప్పరా?’’ మిన్నకున్న కొడుకుతో లత. ‘‘అవున్నాన్నా.. ప్రేమించుకున్నాం’’ చెప్తాడు సంజయ్‌. అలా ఆ ప్రేమ .. వాళ్లు కలలు కన్న సొంతింటి ప్రాంగణంలోనే పెళ్లితో సుఖాంతం అవుతుంది. అయితే ఓ ట్విస్ట్‌తో. దానికి కారణం సంజయ్‌ బాస్‌ రాశీ. ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఐటీ ఎంప్లాయ్‌ సంజయ్‌. అదే బిల్డింగ్‌లో ఉన్న బ్యాంక్‌ ఉద్యోగిని కరీనా.

హోమ్‌లోన్‌ కోసం అప్లయ్‌ చేసుకుంటాడు అతను. రిక్వైర్డ్‌ శాలరీ లేదని లోన్‌ రిజెక్ట్‌ చేస్తుంది కరీనా. అంతకుముందు రోజే ఓ కామన్‌ ఫ్రెండ్‌ పెళ్లి రిసెప్షన్‌లో పరిచయం అవుతుంది ఇద్దరికీ. హోమ్‌ లోన్‌ రిజెక్షన్‌తో ఒకరి వివరాలు ఒకరికి పూర్తిగా తెలుస్తాయి. సంజయ్‌ తండ్రి రైల్వేలో ఎనౌన్సర్‌. కరీనాకు తండ్రి ఉండడు. మేనమామ ఇంట్లో ఉంటుంది తల్లితో కలిసి. ఇరుకు క్వార్టర్స్‌లో పెరిగిన సంజయ్‌కి, మేనమాల దయాదాక్షిణ్యాల మీద ఉంటున్న కరీనాకు ఒకటే లక్ష్యం.. కష్టార్జితంతో ఇల్లు కొనుక్కోవాలని. అలా ఆ ఇద్దరూ కలిసి జాయింట్‌ హోమ్‌ లోన్‌కు అప్లయ్‌ చేస్తారు ‘జీవన్‌సాథీ’అనే హౌజింగ్‌ స్కీమ్‌లోని ఫ్లాట్‌ కోసం. అది పెళ్లయిన జంటలకే కాబట్టి ఇంటికోసం పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఆ క్రమంలో నిజంగానే ఇద్దరూ ప్రేమలో పడ్తారు. కాని అప్పటికే కరీనా జీవితంలో తల్లి చూసిన పెద్దింటి కుర్రాడు సామ్యూల్‌ మస్కిటా ఉంటాడు.

కరీనా ఇండిపెండెంట్‌గా ఆలోచించే స్త్రీ. ఆమె ఇండిపెండెన్స్‌ సామ్యూల్‌కి నచ్చదు. ఆ స్వతంత్ర వ్యక్తిత్వాన్నే సంజయ్‌ ప్రేమిస్తూంటాడు, గౌరవిస్తుంటాడు. దాంతో సామ్యూల్‌ మ్యాచ్‌కి బ్రేక్‌ చెప్పి.. సంజయ్‌తో బంధాన్ని బలపర్చుకుంటుంది. సంజయ్‌ విషయానికి వస్తే.. అతని బాస్‌ రాశి ఓ వివాహితురాలు. ఆమె భర్త విదేశాల్లో బిజినెస్‌ చేస్తుంటాడు. ఒంటరితనం వల్ల సంజయ్‌కి దగ్గరవుతుంది. అదంతా ప్రేమ అనుకుంటాడు సంజయ్‌. బాస్‌ను ఇష్టపడడం మొదలుపెడ్తాడు. భర్తకు విడాకులు ఇచ్చేసి తనను పెళ్లిచేసుకోమంటాడు. ఆమె కోసం ఇల్లూ కొంటున్నట్టు చెప్తాడు. సంజయ్‌ స్టోరీ అక్కడిదాకా వెళ్లేసరికి ఖంగు తింటుంది రాశీ. వదిలించుకోవడానికి భర్తను ఈ దేశానికి రప్పిస్తుంది.

వాళ్ల అన్యోన్యత చూపి పక్కకు తప్పుకుంటాడు సంజయ్‌. అప్పుడే కరీనాతో ప్రేమలో పడ్తాడు. అది తెలిసిన రాశీ .. సంజయ్‌ను మళ్లీ తన గుప్పిట్లో పెట్టుకోవాలని.. తన బర్త్‌డే రోజు పార్టీలో బాగా తాగించి.. అతను తనతో గడిపినట్టు ఫోటోస్‌ తీస్తుంది. వాటితో బ్లాక్‌మెయిల్, ప్రెగ్నెన్సీ వచ్చినట్టు ఎమోషనల్‌ బ్లాక్‌మెయిలూ చేస్తుంది. ఇదంతా తెలిసిన కరీనా హర్ట్‌ అయ్యి ఇంటివరకే అగ్రిమెంట్‌ అని చెప్పేస్తుంది సంజయ్‌తో. బాధ పడ్తాడు అతను. ఆ రాత్రి రాశీతో ఏమీ జరగలేదని ఎంత చెప్పినా కరీనా వినదు. తర్వాత రాశే చెప్తుంది తను డ్రామా ఆడానని. సంజయ్‌ పట్ల కరీనాకున్న అపార్థమూ తొలగిపోతుంది. ఇంటికోసం స్టార్ట్‌ అయిన ఆ లవ్‌ స్టోరీ.

హండ్రెడ్‌ పర్సెంట్‌ ప్రేమగా మారి.. ఆ ఇంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ బాధ్యతలను పంచుకునే కాపురంగా ఎండ్‌ అవుతుంది. సంజయ్‌ చతుర్వేదిగా విక్కీ కౌశల్, కరీనా డిసూజాగా అంగీరా ధార్‌ నటించారు. సొంత ఇల్లు అనే బ్యాక్‌డ్రాప్‌లో మతసామరస్యాన్ని చాటిన చక్కటి కథ. కులమతాలకతీతంగా పిల్లలు ఒక్కటైతే.. పరువు తీశారని హత్యలతో ఆవేశపడక .. అండగా నిలబడే ఆలోచన చేయాలి. కష్టానష్టాలకు ఓర్చుకునే సహనాన్ని అవర్చాలని సూచించే సినిమా లవ్‌ పర్‌ స్క్వేర్‌ ఫూట్‌! 
 – సరస్వతి రమ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top