సూపర్‌ 'షీ'రోస్‌

Behind Every Successful Man ..There Is A Woman  - Sakshi

మగాడు చాలా తెలివైనోడు... మగాడు మోసగాడు. ‘‘బిహైండ్‌ ఎవ్రీ సక్సెస్‌ఫుల్‌ మ్యాన్‌.. దేర్‌ ఈజ్‌ ఏ ఉమన్‌’’ అంటూ మహిళను తెరవెనకే  బందీ చేశాడు.. సూపర్‌ మ్యాన్‌.. స్పైడర్‌ మ్యాన్‌..టార్జాన్‌... బ్యాట్‌ మ్యాన్‌.. హెర్క్యూలస్‌.. హీ మ్యాన్‌.. ఫాంటమ్‌.. శక్తిమాన్‌.. ప్రపంచాన్ని ఉద్ధరించేవాళ్లంతా మగానుభావులే! అని తెలుసుకున్న కొందరు ఆర్టిస్టులు  కలిసి కొంతమంది సూపర్‌ ఉమన్‌లను సృష్టించారు.. మహిళల గొప్పతనానికి గుర్తింపు లేని సమాజంలో తాటతీసే ఇలాంటి  హీరోయిన్లను క్రియేట్‌ చేయడమంటే నవ సమాజానికి సూపర్‌ షీరోస్‌ పరిచయమవడమే!

బాయీ సెక్సువల్‌...
ముంబైలోని కామటిపురాలోని ఓ సెక్స్‌వర్కర్‌కు పుట్టిన కూతురు. జీవితంలోని చీకటి కోణాలను చూస్తూ పెరుగుతుంది. బాయీని అదే దారిలో నడిపించాలనుకుంటుంది  తన తల్లి ఉంటున్న బ్రోతల్‌ హౌజ్‌ యజమాని. బాయి కూడా ఆ దారినే ఎంచుకుంటుంది కాని బ్రోతల్‌ హౌజ్‌ యజమాని అనుకున్న రీతిలో కాదు. బాయి ఆధునిక యువతి. సోషల్‌ మీడియాను ఫాలో అవుతూ ఉంటుంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్‌ అకౌంట్లను మెయిన్‌టైన్‌ చేస్తుంటుంది. పగలంతా కామటిపురాకు దగ్గర  ప్రాంతాల్లోని ఇళ్లల్లో పని చేస్తూ.. రాత్రంతా మోటర్‌బైక్‌ మీద బస్తీల్లో గస్తీ తిరుగుతుంది. ఏ అమ్మాయిని.. ఎవడు ఏడ్పించినా.. పిల్లలను, టీనేజర్స్‌ని ట్రాఫికింగ్‌ చేస్తున్నట్టు అనుమానం వచ్చినా ఆ మగవాళ్లను చీల్చి చెండాడుతుంది. మొబైల్‌ఫోన్‌ ఆమె ప్రధాన ఆయుధం. 

వనితా ఫెయిర్‌నెస్‌
తెల్లగా.. చక్కటి శరీరాకృతితో మెరిసిపోయే బొమ్మలాంటి అమ్మాయి కాదు వనిత. పేదరికం, నిరుద్యోగం, అవినీతి, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే ధీర. ఎక్కడ అవినీతి ఉన్నా తన దగ్గరున్న వైట్‌వాష్‌ గన్‌తో పారదోలి.. వ్యవస్థను ఫెయిర్‌ చేసేస్తుంది. 

మోహ్‌ మాయా
ఆమె పురుషాధిపత్యాన్ని సహించదు. ఆడపిల్ల కంట కన్నీరొలికితే  చాలు కారణమైన వాళ్ల పట్ల కాళీలా మారుతుంది. మహిళల మీద, చిన్న పిల్లల మీద జరిగే హింసకు వ్యతిరేకంగా పోరాడుతుంది. 

ఆంఖ్‌మారీ జాన్‌
స్త్రీని రెండో పౌరురాలిగా చూడడాన్ని క్షమించదు. మహిళ ఇబ్బందులు ఎలాంటివో.. తనెన్ని అవమానాలకు గురవుతోందో వాటిని పురుషుడి అనుభవంలోకీ తెచ్చి చూపిస్తుంది . కన్నుగీటి స్త్రీ సమస్యలను పురుషులకు బదిలీ చేసేంత శక్తిమంతురాలు ఆంఖ్‌మారీ జాన్‌.  

పూనమ్‌ 3000
సాధారణ యువతి. సింగిల్‌ పేరెంట్‌. అద్భుతాలు చేతకావు. రోజువారీ జీవితంలోని ఇబ్బందులను ఎదుర్కోవడమే ఆమె టాస్క్‌.  తన కొడుకును మంచి స్కూల్లో చేర్పించడమే ఆమె లక్ష్యం. ‘మన సమస్యలను తీర్చడానికి ఎవరూరారు.. అసలు ఎవరూ ఉండరు. ఎవరి జీవితం వాళ్లదే. స్ట్రగులే లైఫ్‌ అని చెప్తుంది. పోరాడడమే మనం చేయగల అద్భుతం అంటుంది.  

నింజా నానీ
చాదస్తం, సంప్రదాయంతో ఇంట్లో వాళ్లను తిప్పలు పెడ్తున్నా.. మోరల్‌ సపోర్ట్, ఆర్థిక ఇబ్బందులను గట్టెక్కించే  చిట్కాలు, పిల్లల పెంపకంలో ఇచ్చే సలహాలు.. క్లిష్ట పరిస్థితుల నుంచి కుటుంబాన్ని బయటపడేసే పెద్దరికం.. నింజా నానీ నైజం. 

మిస్‌ పమేలా
ఓ చేత్తో బేకరీ నిర్వహిస్తూనే ఇంకో చేత్తో సమాజంలోని అవలక్షణాలతో ఫైట్‌ చేస్తుంటుంది. ఆ ఫైట్‌ ఎక్కడికి దారితీసినా  వెరవదు. వెనకడుగు వేయదు. అవతలి పక్షం వాళ్లను మైదా ముద్దలా చేసి ఫుట్‌బాల్‌ ఆడుతుంది. విజయంతో నిలబడుతుంది. 

లేడీ నైట్‌ (యోధురాలు)
స్కాలర్‌.. వీరురాలు.. శూరురాలు.. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె ఒక సూపర్‌ పవర్‌. బైక్, కారు, లారీ.. అన్నీ డ్రైవ్‌ చేస్తుంది. గుర్రాన్నయితే గాల్లో కూడా పరిగెత్తిస్తుంది. అదీ లేడీ నైట్‌ ప్రత్యేకత. ఈ మహిళల గురించి చదువుతుంటే.. ఇన్‌స్పైరింగ్‌గా ఉంది కదా! ప్రేరణ కూడా వస్తోంది.. అవునా?! మనమూ ఇలా అవ్వాలి అనీ అనిపిస్తోంది కదూ.. బట్‌ సారీ.. ఇవి రియల్‌ లైఫ్‌ స్టోరీస్‌ కాదు!

కామిక్‌  క్యారెక్టర్స్‌!
ఒహ్హో.. దీర్ఘమైన నిట్టూర్పు.. మూతి ముడిచేసుకునే ఎమోజీలు వద్దు. ఇలాంటి ఎమోషన్స్‌తో బలహీనపడొద్దనే  చెప్పే స్ట్రాంగ్‌ అండ్‌ పవర్‌ఫుల్‌ విమెన్‌ రోల్స్‌ ఇవి! సూపర్‌ హీరోయిన్స్‌ క్యారెక్టర్స్‌!వాటి పేర్లు  వేరైనా ఈ పాత్రలన్నిటి వెనక ఉన్న లక్ష్యం  ఒకటే.. మహిళ ఇండిపెండెంట్‌గా ఉండాలి..  సాధికారత సాధించాలి.  ఆత్మస్థయిర్యం,  హాస్య చతురత, చాకచక్యం, లౌక్యం.. ఇవన్నీ ప్రతి మనిషికీ ఉండాల్సినవి.. జీవితంలో గెలవాలంటే ఇవి తప్పనిసరి కూడా. వీటిని ప్రతి అమ్మాయికీ ఓ మెస్సేజ్‌లా ఇవ్వాలనే ఈ పాత్రలను క్రియేట్‌ చేశాం’’ అంటారు ఈ నాయికలకు రూపం ఇచ్చిన ఆర్టిస్టులు. 

ఇంతకీ ఆర్టిస్టుల ప్రస్తావనే రాలేదు...  
బాయీ సెక్సువల్‌కు ప్రాణం పోసింది మహారాష్ట్రకు చెందిన రుచా దయార్కర్‌. వనితా ఫెయిర్‌నెస్‌కు రూపమిచ్చింది టిన్‌టిన్‌ క్వారంటినో .  ‘మోహ్‌ మాయా’ కృతికా సుసర్ల సృష్టి.   ‘ఆంఖ్‌మారీ జాన్‌’..  అరుంధతీ ఘోష్, జార్జ్‌ మ్యాథన్‌ల  బ్రెయిన్‌ హీరోయిన్‌.  ‘పూనమ్‌ 3000’  విష్ణు ఎమ్‌ నాయర్‌ కథానాయిక.  అమ్మమ్మ, నానమ్మల స్ఫూర్తితో ‘నింజా నానీ’కి  ఊపిరి పోసింది లావణ్యా కార్తిక్‌.  ‘మిస్‌ పమేలా’  ఆనందా మీనన్‌ ఇష్ట సఖి.  ‘లేడీ నైట్‌’ మంజులా పద్మనాభన్‌ ఊహల్లోంచి వచ్చిన స్ట్రాంగ్‌ లేడీ.  సండే అబ్జర్వర్, పయోనీర్, హిందూ బిజినెస్‌ లైన్‌ వంటి పత్రికల్లో వచ్చే  ‘సుకి’ అనే కామిక్‌ క్యారెక్టర్‌ గురించి  తెలిసిన వాళ్లకు మంజులా పద్మనాభన్‌ సుపరిచితురాలు. సుకికి జన్మనిచ్చింది ఆమే. ఇప్పుడు లేడీ నైట్‌తో ఓ సూపర్‌ హీరోయిన్‌ను తయారు చేసింది. 

అసలు ఇవన్నీ ఎందుకు పుట్టాయంటే 
సూపర్‌ హీరోయిన్‌ క్యారెక్టర్స్‌ వెలితిని గ్రహించిన  ‘బ్రెయిన్‌డెడ్‌ ఇండియా’ అనే ఆర్టిస్ట్స్‌ కలెక్టివ్‌ గ్రూప్‌ ఒక ఆన్‌లైన్‌ ప్రాజెక్ట్‌ కోసం.. సృజనాత్మకమైన పోటీని నిర్వహించింది. దాని పేరు ‘‘స్త్రీ స్త్రీ సెప్టెంబర్‌’’.మోడర్న్‌ ఇండియా సూపర్‌ హీరోయిన్స్‌ ఎలా ఉండాలో... గుణాలను  అభివర్ణిస్తూ..  కాస్ట్యూమ్స్‌ను కూడా డిజైన్‌ చేస్తూ.. వాటి  బలాబలాలను కూడా చెప్తూ పాత్రలను రూపొందిచమని దేశ వ్యాప్తంగా  ఎంట్రీలను ఆహ్వానించింది. చాలామంది ఆర్టిస్టులు స్పందించారు.  25 ఎంట్రీలను ఎంపిక చేసింది బ్రెయిన్‌డెడ్‌ గ్రూప్‌. అందులోని కొన్నిటినే ఇక్కడ ఇంట్రడ్యూస్‌ చేశాం. ఈ  సూపర్‌ హీరోయిన్స్‌ని బ్రెయిన్‌డెడ్‌ నిర్వాహకులు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్స్‌ ద్వారా ఇప్పటికే నెటిజన్లకు  పరిచయం చేసేశారు.  ‘‘సోషల్‌ మీడియాలో ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. మాకు వచ్చిన ఎంట్రీలన్నిటిలో  సాహసం.. సరదా కలగలసి ఉన్నారు సూపర్‌ హీరోయిన్స్‌. కామిక్‌ అండ్‌ సీరియస్‌ రెండూ అన్నమాట. అయితే ఎక్కడా వాస్తవానికి అతీతంగా లేవు. డే టు డే లైఫ్‌లో ఆడవాళ్లు ఫేస్‌ చేసే వాటి మీదే  కాన్‌సన్‌ట్రేట్‌ చేశారు ఆర్టిస్టులు. ఆ హార్డిల్స్‌ను ఓవర్‌కమ్‌ చేసుకోవడానికి కావల్సిన ధైర్యం, స్థితప్రజ్ఞతను ఇంజెక్ట్‌ చేసేలా ఉన్నాయి ఈ క్యారెక్టర్స్‌’’ అంటున్నారు..  నిర్వాహకులు అరుంధతీ ఘోష్, జార్జ్‌ మ్యాథన్‌. మంచి ప్రయత్నం.. ఫెయిరీ టేల్స్‌.. ప్లేస్‌లో పై పాత్రలతో కొత్త తరానికి సరికొత్త కథలు వినిపించాలి.
– శరాది 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top