శాస్తారం ప్రణమామ్యహం

Ayyappa comes to mind that Sabarimala is remembered for all - Sakshi

కథాశిల్పం 

అయ్యప్ప అనగానే అందరికీ యోగాసనంలో, మోకాలికి యోగపట్టం ధరించి కుడి చేత్తో అభయాన్నిస్తూ, ఎడమచేతిని మోకాలిపై ఉంచే రూపం గుర్తుకు వస్తుంది. శబరిమలైపై కొలువు తీరిన రూపం ఇదే. ఇక్కడ ఆయన బ్రహ్మచారిగా కనిపిస్తాడు. కానీ ఆయనకు ఇద్దరు భార్యలు ఉన్నారు. పూర్ణ, పుష్కలా వారి పేర్లు. శక్తి సమేతుడైన స్వామిని ధర్మశాస్త అని పిలుస్తారు. అచ్చన్‌ కోసం ఆలయంలో స్వామివారు ఇరువైపుల దేవేరులతో పాటు ఆసీనుడై కుడి కాలిని కిందకు చాచి ఎడమకాలిని మడిచి పీఠంపై ఉంచి నడుముకూ ఎడమమోకాలికీ కలిపి వేసిన పట్టంతో కుడిచేతిలో పుష్పాన్ని, ఎడమచేతిని ఎడమమోకాలిపై జారవిడిచి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ ఉంటాడు. పూర్ణాపుష్కలా దేవేరులు చేతిలో సౌగంధికా పుష్పాలను పట్టుకుని వరదముద్రనూ చూపుతూ వరాలిస్తుంటారు. ఇదే స్వరూపంలో తమిళనాడులోని కాంచీపురం,కడలూర్‌ మొదలైన కొన్ని దేవాలయాలలో మాత్రం అరుదుగా దర్శనమిస్తాడు.

పూర్ణాపుష్కలాసమేత ధర్మశాస్త విగ్రహ స్వరూపాన్ని మయమత శిల్పశాస్త్రం విశేషంగా వివరించింది. ఇతడి చేతిలో చండ్రాకోలును ఉంచాలని చెప్పింది. ఈ స్వామి వాహనం, ధ్వజచిహ్నం రెండూ గజమే. చతుర్భుజుడైన స్వామికి కుక్కుటధ్వజం ఉంటుంది.శాస్త అంటే శాసించువాడని అర్థం. ఆగమ, శిల్ప శాస్త్రాలలో అనేక శాస్తా స్వరూపాలున్నా వాటిలో ఎనిమిది శాస్తారూపాలు ప్రసిద్ధమైనవి. ఆదిశాస్త, ధర్మశాస్త, జ్ఞానశాస్త, కల్యాణవరదశాస్త, గజారూఢ శాస్త, సమ్మోహన శాస్త, సంతానప్రాప్తి శాస్త, వేదశాస్త, వీరశాస్తలలో ఒక్కో దేవుడూ ఒక్కో ఫలితాన్ని ఇస్తాడు.ధర్మశాస్తా దర్శనంతో సకలాభీష్టాలూ నెరవేరుతాయి. మహాపాతకాలు తొలగిపోతాయి. ఆరోగ్యం, పుత్రసిద్ధి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయని శాస్త్రాగమం చెప్పింది.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top