అత్తా? అమ్మా?

Aunts daughter in law is just as good as her mother in law - Sakshi

ఎంతైనా అత్తగారు అత్తగారే. కోడలు పిల్ల కోడలు పిల్లే. ఇద్దరూ తల్లీకూతుళ్లలా ఉండడం సాధ్యమేనా?సాధ్యమే. అదీ అత్తగారి వల్లనే సాధ్యం.  ఒకింటికి కోడలిగా వెళ్లి.. తర్వాత అత్తయింది కనుక ఒకప్పటికి అత్త అయ్యే కోడలికి తనే నేర్పించుకోవాలి. కొడుక్కి పెళ్లయిపోగానే అత్తగారైపోయిన ‘అమ్మ’లోఅమ్మతనాన్ని ఎవరైనా అకస్మాత్తుగా ఎత్తుకుపోతారా?అమ్మ అమ్మే. అత్తయ్యాక కూడా అమ్మే. అత్తమ్మే.

బార్‌లో అందరూ వెళ్లిపోయారు అతను తప్ప.మూసేసే టైమ్‌ అయ్యింది.లైట్లు కూడా ఆఫ్‌ చేసేస్తున్నారు.వెయిటర్‌కు అతడు తెలుసు. రెండు మూడు వారాలకు ఒకసారి వచ్చి సరదాగా ఒక బీర్‌ తాగేసి పోతుంటాడు. ఈసారి సరదా కోసం వచ్చినట్టు లేదు. చాలా తాగాడు. ఇంటికి వెళ్లకుండా కదలక మెదలక ఉన్నాడు.వెయిటర్‌కు ఇలాంటి వాళ్లు తెలుసు.అనునయంగా లేపి, బయటకు తీసుకొచ్చి ఆటో ఎక్కిస్తూ అడిగాడు– ‘వైఫ్‌ ప్రాబ్లమా సార్‌’.అతడు ఆటోలో కూలబడ్డాడు.‘అదైనా బాగుండేది. కాని ఇది అమ్మ ప్రాబ్లమ్‌. మా అమ్మతో ప్రాబ్లమ్‌’ అని, ఎంతిస్తున్నాడో కూడా చూసుకోకుండా టిప్పు కుక్కి కళ్లు మూసుకున్నాడు.తెల్లారింది. తల్లి వెళ్లి మెయిన్‌ డోర్‌ తెరిచింది. గుమ్మంలో పాలప్యాకెట్లు పడి ఉన్నాయి. పేపర్‌ కూడా. వాటిని చూడగానే ఆమెకు కోపం వచ్చింది.‘ఈ పిల్ల ఉదయాన్నే లేచి వీటిని తీయవచ్చు కదా’ అనుకుంది.

కొడుక్కి కొత్తగా పెళ్లయ్యిందని కాపురం మొదలయ్యి ఆరు నెలలు అయ్యిందని కోడలు తొందరగా లేవ వలసిన పని లేదని మార్నింగ్‌ కాఫీ పెట్టి తానే నిద్ర లేపుతానని ఈ తల్లే కొత్తల్లో చెప్పింది. కాని ఇప్పుడు ఎందుకో ఆమెకు కోపం వస్తోంది.వెళ్లి ముందు వెనుకా చూసుకోకుండా కొడుకు కోడలు ఉండే బెడ్‌రూమ్‌ తలుపును బాదింది.‘అమ్మాయ్‌ సరళా. ఇంకా ఏంటా మొద్దు నిద్ర లే’ అని అరిచింది.నిద్రలో ఉన్న సరళా ఉలిక్కి పడి లేచింది. రాత్రి తాగి బతుకు జీవుడా అని నిద్రపోయిన కొడుకూ అదిరిపడి లేచాడు.రోజు మొదలైంది అని ఇద్దరూ అనుకున్నారు.‘వస్తున్నా అత్తయ్యా’ కోడలు బయటకు పరిగెత్తింది నైటీ సరి చేసుకుంటూ.‘అబ్బాయికి బాక్స్‌ కట్టావా’‘కట్టాను అత్తయ్యా’‘ఏం కట్టావ్‌?’ ‘చామగడ్డల పులుసు. పప్పు. అరటి కాయ తాలింపు’...‘నీ తలకాయ తాలింపు చేయకపోయావా.

వాడు అరటికాయ తినడని తెలియదా?’‘నాకు మీరు చెప్పలేదు అత్తయ్యా’‘పర్లేదులేమ్మా. తింటాలే’‘నువ్వు నోర్మూయరా... అప్పుడే తందానా అనడం మొదలెట్టావా’కొడుకూ కోడలూ ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఉక్రోషంగా ఉంది. ఏం చేయాలో తోచనట్టుగా ఉంది. తిరగబడ్డానికి వీలు లేకుండా ఉంది.ఎదురుగా ఉన్నది శతృవు కాదు.సొంత తల్లి. ఆమెకు అత్త.సుజాతమ్మకు ఆ వీధిలో చాలా మంచిదని పేరు. ఒకరికి కష్టం వస్తే పరిగెత్తుకొని వస్తుందని పేరు. మంచీ చెడ్డ చెబుతుందని పేరు. అందరి ఇళ్లల్లో తల్లో నాలుక అని పేరు. ఆమెను అభిమానించని ఇల్లు ఆ వీధిలో లేదు. పెళ్లిళ్లలో శుభకార్యాలలో ఆమె పెత్తనమే ఎక్కడైనా. అలాంటిది ఆమె ఇంట్లో కూడా శుభకార్యమే జరిగింది. కొడుకు పెళ్లే జరిగింది. అది శుభప్రదంగా ఉంటుందని తమ ఇళ్లల్లో లాగా చికాకులు చిర్రుబుర్రులతో సాగదని అందరూ అనుకున్నారు.

సుజాతమ్మ కోడలిని బాగా చూసుకుంటుందని అనుకున్నారు. భర్త చనిపోయాక ఎన్నో కష్టాలు పడి ఇంటిని నిలబెట్టుకున్న సుజాతమ్మ ఇన్నాళ్లకు ఆడతోడు దొరికి కాసింత తెరిపిన పడుతుందని అనుకున్నారు. ప్రస్తుతం బయట అందరి అభిప్రాయమూ అదే. ఆమె మీద ఎవరికి ఏ చాడీ చెప్పినా నమ్మరు.కాని ఇంట్లో జరుగుతున్నది వేరు.సుజాతమ్మ ఇప్పుడు ఒక రాక్షసి.‘ఏమండీ... ఇలాగైతే నా వల్ల కాదు. నేను మా పుట్టింటికి వెళ్లిపోతాను’ అంది సరళ.‘అదేమిటి అలా అంటావు. ఓపిక పట్టు. అంతా సర్దుకుంటుంది’ అన్నాడు భార్గవ్‌ హతాశుడవుతూ.‘సర్దుకునే సూచన కనిపించడం లేదండీ. ఇది ఇంకా పెరిగేలా ఉంది. నేను ఆల్రెడీ మా పెద్దవాళ్లకు ఫోన్‌ చేశాను. రేపు వస్తారు’‘నిజమా’ గుడ్లు తేలేశాడు.మరునాడు సుజాతమ్మ కూడా గుడ్లు తేలేయక తప్పలేదు.

‘మీరు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నారండీ’ కొంచెం మర్యాద పాటిస్తూ అన్నాడు సరళ తండ్రి.‘ఇబ్బందా.. పీక్కు తింటోంది’ కోపం పట్టలేక అంది సరళ తల్లి.‘మాకేం కూటికి గతిలేదనుకోవద్దు. విడాకులిప్పించి దర్జాగా ఇంకో పెళ్లి చేస్తాం’ సరళ తల్లి కోపంతో బుసలు కొడుతోంది.సుజాతమ్మ ఒణికిపోయింది.‘సరళంటే నాకు ఇష్టం. నేనేదో చిన్న మాట అంటున్నాను తప్ప ఆ పిల్ల ఇంత బాధ పడుతుందని నాక్కూడా తెలియదు. మా వాడు విడాకులు తీసుకుంటే నాకేం సంతోషం. నాకేం లాభం. అయ్యో.. వద్దే వద్దు’ అంది ఎలాగోలా శక్తి తెచ్చుకుని.‘లేదండీ... మీ మైండ్‌ ఖరాబయ్యింది. మీకు కౌన్సెలింగ్‌ అవసరం’ అని తేల్చాడు అనుభవజ్ఞుడైన సరళ తండ్రి.వేరే మార్గం లేక తల వొంచుకుని అంగీకరించింది సుజాతమ్మ.సుజాతమ్మ కథ ఇది. ఆమెకు యాభై సంవత్సరాలు. పద్దెనిమిదేళ్లకే పెళ్లయ్యింది. ముప్పై ఏళ్లకే భర్త చనిపోయాడు.

ఆమెకు పెద్దగా బంధుగణం లేదు. జీవితాన్ని ఎలా గడపాలో తెలియదు. ఒక్కగానొక్క కొడుకు. వాడే లోకంగా బతికింది. వాడి కోసమే జీవించింది. జీవితంలో కొంతమంది మగవాళ్లు ఆమెకు తారసపడ్డారు. కోరుకున్నారు. మరోపెళ్లిని ప్రస్తావించారు. కాని ఆమె కొడుకు కోసం తన సంతోషాలన్నింటినీ త్యాగం చేసింది. వీధిలో వాళ్లే తన బంధువులనుకుంది. కొడుకును ప్రయోజకుణ్ణి చేసింది. అతడికి పెళ్లి చేసింది. కాని పెళ్లయ్యి రెండు మూడు నెలలు గడిచిన తర్వాత కోడలు నచ్చకపోవడం మొదలైంది. ఆమెను తిట్టడం మొదలెట్టింది. బాధ పెట్టడం సూటిపోటి మాటలు అనడం... ఇలా ఎందుకు చేస్తున్నదో ఆమెకే తెలియదు. ఆమె తనను తాను అర్థం చేసుకోవాల్సి ఉంది.‘మీ కోడలు మీ కొడుకును మీకు ఎక్కడ కాకుండా చేస్తుందోనని మీ భయం కదా’ లేడీ సైకియాట్రిస్ట్‌ అడిగింది.సుజాతమ్మ ఏం మాట్లాడలేదు. మౌనంగా తల ఊపింది.

‘కొంత కాలం మీరు మీ కోడలిని అభిమానించారు. కాని మీ కొడుకు కోడలు ఏకాంతంగా ఉన్నా, కలిసి సినిమాకు వెళ్లినా, డిన్నర్‌కు వెళ్లినా మీ కొడుకు మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నాడేమో, క్రమంగా మిమ్మల్ని వదులుకుంటాడేమో, మీ ప్రాధాన్యం తగ్గిపోతుందేమో అని మీకు అనిపించి ఏం చేయాలో తెలియక మీ కోడలిని బాధ పెట్టడం మొదలెట్టారు’ అంది సైకియాట్రిస్ట్‌.మళ్లీ అడిగింది.‘మీకు కొడుకు పుట్టినప్పుడు మీ భర్త ఉండగా మీరు వారిద్దరినీ సమానంగా ప్రేమించారా? ఒక్కరినే ప్రేమించారా?’సుజాతమ్మ తలెత్తి చూసి ‘ఇద్దరినీ ప్రేమించాను’ అంది.‘మీ కొడుకు కూడా అలాగే చేయగలడు అని మీరు ఎందుకు అనుకోవడం లేదు. మీ కొడుకు మిమ్మల్ని, మీ కోడలిని కూడా ఏక కాలంలో ప్రేమగా చూసుకోవచ్చు కదా. ఎవరూ ఏ ఒక్కరికీ సొంతం కాదు. అందరూ అందరికీ చెందినప్పుడే కుటుంబం నడుస్తుంది.

సాధారణంగా ఏమవుతుందంటే మీ కొడుకు స్థానంలో మీకు కూతురు ఉంటే ఆ కూతురు ఏదో ఒకనాటికి అత్తారింటికి వెళ్లిపోతుందని మీరు ప్రిపేర్డ్‌గా ఉండేవారు. కొడుకు అయ్యే సరికి అతనితోనే జీవితాంతం ఉండాలనుకుని, అలా ఉండటానికి ఎక్కడ అడ్డంకులు వస్తాయో అని ఉలిక్కి పడుతున్నారు. మీ కొడుక్కే కాదు ఏ కొడుక్కైనా తల్లంటే ప్రేమ ఇష్టం ఉంటాయి. వాళ్లను ప్రేమించకుండా మానేయరు. కాని కోడలు వచ్చేసరికి మీలాగే చాలామంది అత్తగార్లు ఇన్‌సెక్యూర్‌ అయ్యి ఇంటిని ఇబ్బందుల్లోకి నెడతారు. మీ కోడలు మంచి అవగాహన ఉన్న అమ్మాయి.

ఆమెను నమ్మండి. మీ అబ్బాయిని నమ్మండి. వారు మిమ్మల్ని బాగా చూసుకుంటారు’ అంది లేడీ సైకియాట్రిస్ట్‌.సుజాతమ్మకు ఆ కౌన్సెలింగ్‌ చాలా ఉపయోగపడింది.ఆమె వెంటనే కోడలిని పిలిచి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరింది.కొద్దిపాటి అవగాహన, అవసరమైన చర్చలు కుటుంబ సభ్యుల మధ్య సాగితే ప్రతి ఇల్లు సౌకర్యవంతమైన అనుబంధాలతో కొనసాగుతుంది.నాలుగైదు రోజుల తర్వాత సుజాతమ్మ తెల్లవారుతూనే లేచింది.గుమ్మంలో పాలప్యాకెట్లు, పేపర్‌ పడి ఉన్నాయి.వాటిని చేతిలోకి తీసుకుని కాఫీ పెట్టడానికి వెనుదిరుగుతుండగానే.. కోడలు ఎదురొచ్చింది!‘ఇటివ్వండత్తయ్యా.. కాఫీ పెట్టుకొస్తాను’ అంది. ఆ తర్వాత ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతున్న దృశ్యం అప్పుడే నిద్ర లేచి హాల్లోకి వస్తున్న కొడుక్కి కనిపించింది. 
– కథనం: సాక్షి ఫ్యామిలీ
ఇన్‌పుట్స్‌: పద్మ పాల్వాయి, సైకియాట్రిస్ట్‌

మీ కొడుక్కే కాదు ఏ కొడుక్కైనా తల్లంటే ప్రేమ ఇష్టం ఉంటాయి. వాళ్లను ప్రేమించకుండా మానేయరు. కాని కోడలు వచ్చేసరికి మీలాగే చాలామంది అత్తగార్లు ఇన్‌సెక్యూర్‌ అయ్యి ఇంటిని ఇబ్బందుల్లోకి నెడతారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top