కోరేది ఏమీ లేదు ప్రేమ తప్ప

Article From Chalam Autobiography Book In Sakshi

ప్రతిధ్వనించే పుస్తకం  

1972లో వచ్చిన చలం ఆత్మకథలో ‘ఇది చలం సొంత అభిరుచుల విషయం. ఇది అతని జీవిత కథకి అనవసరం. యిష్టమున్నవాళ్ళు చదవండి’ పేరుతో రాసినదాన్లోంచి కొంత భాగం ఇక్కడ.

నాకు ఈ లోకానికి సంబంధించిన ఆశలు, అభిరుచులు చాలా తక్కువ. అందుకనే నాకు డబ్బు అవసరం వుండేది కాదు. ఏ కొంచెం వున్నప్పటికినీ దాంతోనే గడుపుకునేవాణ్ని. వాంఛలు నాకు చాలా స్వల్పం. మా తిండి, మా బట్ట తప్ప అంతకంటే పెద్ద పెద్ద ఇబ్బందులు జన్మలో ఎప్పుడూ వుండేవి కావు. రంగనాయకమ్మ గారు, మా పిల్లలు అందరూ అట్లాంటి వాళ్ళే. ఎంతసేపటికి మేము వాస్తవంలో కన్న కలలలోనే బతికేవాళ్లం. కలలు అంటే అవి ఏవో పెద్ద పెద్దవి కావు. మా అవసరాలు అని చెప్పుకోవాలి. మేము చాలా హాయిగా తిరగాలి. మేము ఒకళ్ళ నొకళ్ళం ప్రేమించుకోవాలి. మమ్మల్ని ప్రేమించేవాళ్ళు మా దగ్గరికి రావాలి. ఇట్టానే వుండేవి మా కోర్కెలు. జీవితమంతా అంతే.

నా ఆశయం– నాకే ఆరోగ్యం వుంటే కట్టుకున్న బట్ట తప్ప ఇంకేమి లేకండా వూరినించి వూరికి తిరగాలని. నా ప్రియురాళ్ళు, నాకొచ్చిన స్త్రీలు, అట్లాంటివాళ్లే తటస్తించారు. వాళ్ళు ఎట్లాంటివాళ్ళయినా, నా దగ్గరికి రాగానే అట్లానే అయిపోయేవాళ్ళు. మొదట్లో కంప్లయింట్‌ చేసేవారు. ఎప్పుడు ఇంట్లో నిలవనియ్యవేం? రోడ్లంబడి, కాలవలంబడి, లాక్కుపోతుంటావేం? అని. నేను అనుకుంటాను. ఈ జీవితంలో అనారోగ్యం వల్ల నాకా భాగ్యం లభించకపోయినా, పరలోకంలోనన్నా ఈ శరీరం లేనప్పుడైనా (లేని) చెయ్యి చెయ్యి పట్టుకుని ఏ చీకూ చింతా లేకండా నవ్వుతో, ఏదీ అక్కర లేకండా, ఏ విధమైనది బైటనించి అవసరం లేకుండా (లేని) నడుములు పట్టుకుని అట్లా తేలిపోతే మేం వుండాలి. నిశ్చయంగా నాకు తెలుసు, ఈ లోకమే కాకండా అనేక లోకాలు ఉన్నాయని, ఎవరు వాంఛించే లోకం వాళ్ళకి కటాక్షింపబడుతుందని.

ఇక్కడ ఈ ప్రపంచాన్ని చూస్తే దైవం ఎంతో క్రూరుడులాగా కనపడుతాడు గాని, తక్కిన లోకాలు అనంతమైన, దయామయమైన లోకాలలో మనం ప్రేమించే దైవం మన కోర్కెల్ని, సంతోషాల్ని, మన అందాల్ని, ఆశయాన్ని తప్పకండా తీరుస్తుందని నా నమ్మకం. అక్కడైనా నేను కోరేది ఏమీలేదు. వుత్త ప్రేమ. నాతో పక్కన ఒకర్ని వొకరు ప్రేమిస్తో నాతో తిరిగే మిత్రులుంటే చాలు. ఆ విధంగా నా జీవితం వుండాలని నా ఆశ. నా దృష్టి అట్లాంటి ఆశయం మీద వుండబట్టి నాకేదీ ఇది కావాలి, అది కావాలని వుండేది కాదు. ఈ నాటికీ ఏదీలేదు. అదేమి నాకు తృప్తినివ్వదని నాకు తెలుసు. అందుకనే నా కథల్లోను, నాటకాల్లోను, సంపాయించుకోవాలని కోర్కె పడేవాళ్ళు, గొప్పవాళ్ళు కనపడరు. ఎంతసేపటికి వున్నవేవో వొదిలించుకుందామనే తప్ప, కావాలని, ఇది తెచ్చుకుందామనే మనుషులే కనపడరు నా రచనల్లో. ఎంతసేపటికి ప్రేమ కోసం బంధువుల్ని, బంధాల్ని వొదిలించుకోవడం కోసం, ఈ బంధాల్నించి ఇంకో విశాలమైన ప్రేమలోకి పోవడం కోసం, అంతే తప్ప అంతకంటే వాళ్ళకి వేరే ఏమీ అక్కర లేదు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top