యాంటీ డిసీజ్‌ ఆహారం

Aunty Disease Fruits - Sakshi

రుచికరమైన పండ్లు, ఆహార పదార్థాలు లొట్టలేసుకుంటూ తింటూనే మేనిపై ముడతలనేవే రాకుండా చూసుకోవాలని ఉందా? ఇదే యౌవనంతో ఇలాగే చాలాకాలం పాటు ఉండిపోవాలని ఉందా? హాయిగా రకరకాల వెజిటబుల్స్‌ తినేస్తూనే క్యాన్సర్‌తో పాటు అనేక రకాల వ్యాధులను దూరంగా ఉంచాలని ఉందా? అయితే మీరు మీలోని ఫ్రీ–రాడికల్స్‌ అనే జీవవ్యర్థాలను తుదముట్టించే యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉన్న ఆహారం తినాలి. అవేవో తెలుసుకోవాలని ఉందా... ఇలా రండి... ఇది చదవండి.

వయసు పెరగడం అందరిలోనూ చాలా సహజం. అది సాధారణంగా జరిగే ప్రక్రియ. అది వీలైనంతగా ఆలస్యం అయితే కాదనుకునేవారెవరు? చాలాకాలంపాటు యౌవనంగా ఉండాలని ఎవరు కోరుకోరు? అలాగే కొన్ని ఆహారాలతో క్యాన్సర్‌ను నివారించుకోవచ్చంటే వాటిని కోరుకోని వారెవరు? ముందుగా వయసు పెరగడం వల్ల వచ్చే శారీరక మార్పులు వేగవంతం కావడానికి, క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు పెరగడానికి కారణం ఏమిటో తెలుసా? ఫ్రీరాడికల్స్‌ అనే కొన్ని పదార్థాలు. వాటిని తుదముట్టించేవే యాంటీఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉండే ఆహారపదార్థాలు. అసలు యాంటీ ఆక్సిడెంట్స్‌ అంటే ఏమిటి? వాటి వల్ల ప్రయోజనాలు, అవి ఏయే ఆహారపదార్థాల్లో ఉంటాయనే అనేక విషయాలపై అవగాహన కోసం ఈ కథనం.

మన దేహంలో నిత్యం అనేక జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. వాహనం నడుస్తున్నప్పుడు, మోటార్‌ లేదా ఇంజన్‌ పనిచేస్తున్నప్పుడు పొగ వెలువడినట్టే... ఆ జీవక్రియలు జరిగే సమయంలో మన దేహంలో కొన్ని  కాలుష్య పదార్థాలు విడుదల అవుతాయి. వాటిని ఫ్రీరాడికల్స్‌ అంటారు. అవి కణాలను దెబ్బతీస్తాయి. ఫ్రీ–రాడికల్స్‌ అన్నవి మన దేహంలోని ఏ కణంపై ప్రభావం చూపితే ఆ కణం జీవిత కాలం తగ్గిపోతుంది. ఆ కణం కూడా దెబ్బతింటుంది.

కణం స్వరూపం మారితే మరింత ప్రమాదం...
ఫ్రీ రాడికల్స్‌ ప్రభావంతో ఒక్కోసారి కణం తన స్వభావాన్ని పూర్తిగా మార్చుకుందనుకోండి. అప్పుడది మరింత ప్రమాదకరమైన పరిణామానికి దారిస్తుంది. క్యాన్సర్‌ అంటే ఒక కణం తన స్వాభావికమైన ధర్మాలు కోల్పోయి, విచిత్రంగా ప్రవర్తించడం అన్నది తెలిసిందే కదా. అలా ఒక కణం తన సహజధర్మాలకు విరుద్ధంగా క్యాన్సర్‌ కణంగా కూడా మారిపోయే ప్రమాదం ఈ ఫ్రీ–రాడికల్స్‌ వల్ల ఉంటుంది. ఇలాంటి ఫ్రీ–రాడికల్స్‌ను నిస్తేజంగా మార్చే పోషకాలూ మన ఆహారంలో ఉంటాయి. అలా ఫ్రీ–రాడికల్స్‌ను నిర్వీర్యం చేయగల పోషక పదార్థాలనే ‘యాంటీ ఆక్సిడెంట్స్‌’. ఇవి మనం తీసుకునే ఆహారపదార్థాల్లో ఉంటాయి. మరికొన్ని  ఆహార పదార్థాల్లోని పోషకాలు నేరుగా యాంటీ ఆక్సిడెంట్స్‌ కాకపోయినా వాటిలోని  కొన్ని వృక్ష రసాయనాల (ఫైటో కెమికల్స్‌)కు యాంటీ ఆక్సిడెంట్‌కు ఉన్న లక్షణాలే ఉంటాయి. అంటే అవి కూడా యాంటీ ఆక్సిడెంట్స్‌లాగే పనిచేస్తాయన్నమాట. 

యాంటీ ఆక్సిడెంట్స్‌ అంటే...?
మనం తినే ఆహారంలోని కొన్ని పోషకాలు... ఫ్రీ రాడికల్స్‌తో చర్యజరిపి దాని ప్రభావాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తాయి. రసాయన పరిభాషలో చెప్పాలంటే తటస్థీకరిస్తాయి. అంటే న్యూట్రలైజ్‌ చేస్తాయన్నమాట. దాంతో ఫ్రీ–రాడికల్స్‌ వల్ల కలిగే దుష్ప్రభావాలు తొలగిపోతాయి. అంతేకాదు... ఫ్రీరాడికల్స్‌ కణాన్ని దెబ్బతీయడం గాని, కణాన్ని క్యాన్సర్‌ కణంగా మార్చడం గాని జరగకుండా కూడా ఆగిపోతుంది. అలా ఫ్రీ–రాడికల్స్‌ను తటస్థీకరించడానికి ఉపయోగపడే ఆహార పదార్థాల్లోని పోషకాలనే ‘యాంటీ ఆక్సిడెంట్స్‌’ అంటారు.

యాంటీ ఆక్సిడెంట్స్‌తో ప్రయోజనాలివే...
జీవక్రియల (మెటబాలిక్‌ ప్రాసెసెస్‌) ద్వారా వెలువడే వ్యర్థాల్లోని హానికర పదార్థాలను నిర్వీర్యం చేసి, కణంలో జరిగే ధ్వంసాన్ని (సెల్‌ డ్యామేజీని) నిలిపివేస్తుంది. సెల్‌డ్యామేజ్‌ తగ్గడం వల్ల కణం చాలాకాలంపాటు ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటి సెల్‌ డ్యామేజీలు కాలుష్యం వల్ల, పొగతాగడం వల్ల, శారీరక శ్రమ వల్ల, అల్ట్రావయొలెట్‌ లైట్‌ వల్ల కూడా జరుగుతుంటాయి. ఫలితంగా చర్మం ముడుతలు పడటం వంటి వృద్ధాప్య చిహ్నాలు కనపడుతుంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్‌ ఫ్రీ–రాడికల్‌ కార్యకలాపాలను నిరోధించడం వల్ల ఈ దుష్పరిణామాలన్నీ ఆగుతాయి లేదా తగ్గుతాయి. దాంతో చాలా కాలం పాటు వయసు పెరిగినట్లుగానే కనిపించదు.
ఆక్సిజన్‌ ఫ్రీ–రాడికల్స్‌ అన్నవి ఒక్కోసారి కణంలోని స్వరూపాన్నే పూర్తిగా మార్చివేస్తుంది. దాంతో కణంలోని జన్యుస్వభావమే మారి కణం కాస్తా... క్యాన్సర్‌కణంగా మారిపోతుంది. అప్పుడది క్యాన్సర్‌ గడ్డలాగా అపరిమితంగా పెరిగిపోయి మనిషికి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. కానీ యాంటీ ఆక్సిడెంట్స్‌ ఆ ప్రమాదాన్ని నివారిస్తాయి. కణాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

రకరకాల యాంటీ ఆక్సిడెంట్స్‌... అవి చేసే మేలు
బీటా–కెరోటిన్‌ అనే పోషకానికి యాంటీఆక్సిడెంట్‌ గుణం ఉంటుంది. ఇవి పసుపు పచ్చగానూ, నారింజరంగులోనూ ఉండే అన్ని పండ్లలో, కూరగాయల్లో, ముదురు ఆకుపచ్చ ఆకుకూరల్లో ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణాల్లోని పైపొర (సెల్‌ మెంబ్రేన్‌)ను సురక్షితంగా కాపాడతాయి. అందుకే ఈ రంగు పండ్లు  తింటే క్యాన్సర్‌ నుంచి రక్షణతో పాటు దీర్ఘకాలం పాటు కణం ఆరోగ్యంగానూ, యౌవనంతోనూ ఉంటుంది. ఫలితంగా మన దేహం కూడా చాలాకాలం పాటు యౌవనంగా ఉంటుంది.  
లైకోపిన్‌ అన్నది ఒక ఫైటో కెమికల్‌. అంటే చెట్టు నుంచి వచ్చే రసాయనం. దీనికి యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి. ఎరుపు రంగు పిగ్మెంట్‌ ఉండే ఆహారాల్లో లైకోపిన్‌ ఎక్కువగా ఉంటుంది.  అన్ని ఎరుపు రంగు పండ్లలోనూ ఇది ఉన్నా ఎరుపురంగు పండు అనగానే గుర్తొచ్చే టొమాటోలో ఇది మరీ ఎక్కువ. టొమాటోతో పాటు లైకోపిన్‌ పుచ్చకాయలోనూ ఎక్కువే. అది మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటమేగాక... పెద్దపేగు క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌లను నివారిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌లో లైకోపిన్‌దే అత్యంత ప్రధానమైన పాత్ర.  
అల్లిసిన్‌ అనేది చాలా శక్తిమంతమైన ఫైటో కెమికల్‌. అంటే చెట్టు నుంచి వచ్చే జీవరసాయనం. దీనికి యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి. ఈ అల్లిసిన్‌ వెల్లుల్లి, ఉల్లిలో ఉంటుంది. ఇది అన్ని రకాల క్యాన్సర్లను నిరోధిస్తుంది. అంతేకాదు... ఈ యాంటీఆక్సిడెంట్‌ మన శరీరంలోని హానికరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అందుకే రక్తంలో కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్నవారు ఉల్లి, వెల్లుల్లి పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వారి ఆరోగ్యానికి చాలా మంచిది.
ఐసోథయనేట్స్, ఐసోఫ్లేవోన్స్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సోయా ఉత్పాదనల్లో, క్యాబేజీ, కాలిఫ్లవర్‌ లాంటి ఆహార పదార్థాల్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి అనేక రకాల క్యాన్సర్‌ల నుంచి శరీరాన్ని కాపాడతాయన్న విషయం చాలా మందికి తెలిసిందే.
గ్లుటాథియోన్‌  ఇది చాలా శక్తిమంతమైన యాంటీ–ఆక్సిడెంట్‌. ఇది కంటిజబ్బులైన క్యాటరాక్ట్‌ను నివారిస్తుంది.
యాంథోసయనిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్స్‌ ద్రాక్షలో, బెర్రీ పండ్లలో  ఎక్కువ. గుండె జబ్బులను యాంథోసయనిన్‌ సమర్థంగా నివారిస్తుంది.
ఫ్లేవనాయిడ్స్‌ అన్నవి చాలా చిక్కటి ముదురు రంగులో ఉండే అన్ని రకాల పండ్లలోనూ, కూరగాయల్లోనూ లభ్యమయ్యే యాంటీఆక్సిడెంట్‌. ఫ్లేవనాయిడ్స్‌ గుండెజబ్బులను నివారిస్తాయి. ఇవి పండ్లు, కూరగాయల్లోని పైపొరల్లో ఉంటాయి. వాటికి ఫ్రీ–రాడికల్స్‌ను తటస్థీకరించే గుణం బాగా ఎక్కువ. అందుకే అవి సహజసిద్ధమైన క్యాన్సర్‌ నిరోధక (యాంటీక్యాన్సర్‌) గుణాలను కలిగి ఉంటాయి. శరీరంలో పుట్టే మంటను తగ్గిస్తాయి. అంటే వాటిని సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పోషకాలుగా పరిగణించవచ్చు. మన రక్తప్రసరణ వ్యవస్థలో... అంటే రక్తం ప్రవహించే సిరలు, ధమనులు, గుండె వంటి కీలక శరీర భాగాలనూ కాపాడతాయి. రక్తంలోని రకరకాల పదార్థాలైన ప్లేట్‌లెట్స్‌ వంటివి గుంపులు కట్టకుండా (ప్లేట్‌లెట్‌ అగ్రిగేషన్‌ కాకుండా) కాపాడతాయి. దాంతో రక్తప్రవాహం సాఫీగా సాగేలా చూస్తాయి. అంతేకాదు... రక్తనాళాల గోడలకు బలం చేకూరుస్తాయి.
అంతెందుకు... పుల్లగా ఉండే నిమ్మజాతి పండ్లలో లభ్యమయ్యే విటమిన్‌–సి కూడా యాంటీ ఆక్సిడెంటే. దాంతోపాటు విటమిన్‌–ఇ కూడా ఒక యాంటీ ఆక్సిడెంటే.
అందుకే యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. దీర్ఘకాలం పాటు యౌవనంతో, మంచి ఆరోగ్యంతో జీవించండి.-డాక్టర్‌ హరిచరణ్‌కన్సల్టెంట్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్,హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top