అమితాబ్‌ చెప్పిన చెట్టు కథ

Amitabh Bachchan Speaks About His Affection With Gulmohar Tree - Sakshi

బాధ ఇంటి మనిషిని కోల్పోయినప్పుడు మాత్రమే ఉండదు. ఇంటి చెట్టును పోగొట్టుకున్నప్పుడు కూడా ఉంటుంది. అమితాబ్‌ ఇప్పుడు అలాంటి బాధలో ఉన్నాడు. 43లో ఏళ్లుగా ఆయన ఇంట నీడనిస్తూ వచ్చిన ఒక గుల్‌మొహర్‌ చెట్టు మొన్నటి భారీ వర్షాలకు కూకటివేళ్లతో సహా కూలిపోయింది. అమితాబ్‌ ఆ చెట్టు ఫొటోలను తన బ్లాగ్‌లో పెట్టి దానితో తన అనుబంధాన్ని పంచుకున్నారు. ‘అది పోయేటప్పుడు కూడా నిశ్శబ్దంగా పోయింది. ఎవరికీ హాని కలిగించకుండా మెల్లగా వాలిపోయింది’ అని రాశాడాయన.

అమితాబ్‌ బంగ్లా పేరు ‘ప్రతీక్ష’ అని చాలామందికి తెలుసు. 1976లో అమితాబ్‌ ఆ బంగ్లా కొన్నప్పుడు బంగ్లా మధ్యస్థలంలో అడుగు ఎత్తున ఉన్న ఆ మొక్కను నాటారట. అప్పటి నుంచి ఇంట్లో అది కూడా ఒక సదస్యుడయ్యింది. ‘పిల్లలు దాంతో పాటు పెరిగారు. దాని కిందనే ఆడుకున్నారు. హోలీ వచ్చినా, దివాలి వచ్చినా ఆ చెట్టుకే మేము సోకు చేసేవారం. అభిషేక్‌ బచ్చన్‌ పెళ్లి ఆ చెట్టు కిందనే జరిగింది. మా అమ్మా నాన్నలు మరణించినప్పుడు ఆ చెట్టు కింద జరిగిన ప్రార్థనల్లో అది కూడా పాల్గొనింది. ఇవాళ అది లేదు’ అని ఆయన భావోద్వేగంతో రాసుకొచ్చారు.

బంగ్లా కొన్నాక తండ్రి హరివంశరాయ్‌ బచ్చన్‌ వచ్చి చూసి సంతోషించాడట. దానికి పేరు కూడా ఆయన కవిత్వం నుంచే తీసుకున్నారు. ‘అందరికీ ఇక్కడ స్వాగతం ఉంటుంది. ఎవరి గురించీ ప్రతీక్ష ఉండదు’ అని తండ్రి రాసిన కవిత నుంచి అమితాబ్‌ ప్రతీక్ష అనే మాట తీసుకుని తన బంగ్లాకు పెట్టుకున్నారు. అమితాబ్‌కు తన బాధ చెప్పుకుంటూ ఉంటే మధ్యతరగతి వారికి కొన్ని జ్ఞాపకాలు తాకవచ్చు. అద్దె ఇళ్లల్లో ఇష్టపడి పెంచుకున్న చెట్లను ఆ ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్నప్పుడు వదల్లేక బాధ పడేవారు ఎందరో. ఏ బంధానికైనా ఏదో ఒకరోజు ఏదో ఒక రూపంలో ఎడబాటు తప్పదు కదా.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top