ఇడిసిపెడితే నడిసి నేను బోత సారూ..!

Adesh Ravi Emotional Song On Covid19 - Sakshi

వలస పాట

‘ఇడిసిపెడితే నడిసి నేను బోత సారూ’.. ఈ ఒక్కమాట చాలు లాక్‌డౌన్‌ కష్టకాలంలో పేదలు, వలస కూలీల దీనస్థితిని అద్దం పట్టేందుకు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటకు చెందిన ఆదేశ్‌ రవి.. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని వలస వెళ్లిన శ్రమజీవుల కరోనా లాక్‌డౌన్‌ కష్టాలను అక్షరబద్దం చేసిన పాటలోని ఆవేదన ఇది. పాట వింటే కళ్లు చెమ్మగిల్లుతాయి.

‘పూట పూట జేసుకోని బతికేటోళ్లం.. పూట గడవా ఇంత దూరం వచ్చినోళ్లం..’ అంటూ మొదలై, ‘ఇంటికాడ పిల్ల జెల్ల ఎట్ల ఉన్నరో.. నా ముసలి తల్లి ఏమి బెట్టి సాదుతున్నదో.. ఇడిసిపెడితే నడిసి నేను బోత సారూ.. ఇడిసిపెడితే నడిసి నేను బోత సారూ.. అనే విన్నపంతో పాట ముగుస్తుంది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ పాటను విన్న దేశపతి శ్రీనివాస్, చంద్రసిద్ధార్థ, ఆర్పీ పట్నాయక్, సుకుమార్, మరికొంత మంది ప్రముఖులు రవిని అభినందించారు. ఇదే పాటను రవి ఇప్పుడు హిందీలో కూడా పాడబోతున్నారు. ‘పేద రోగం కంటే పెద్ద రోగముందా..? అయినవాళ్ల కంటే అండ ఉందా..? అనే చరణంలో.. కష్టకాలంలో అయినవాళ్ల వద్ద ఉండాలనే తపన, ఆరాటం.. పాటలో వ్యక్తం అవుతున్నాయి. సౌండ్‌ ఇంజినీర్‌ అయిన రవి వందకు పైగా సినిమాలకు పని చేశారు. కొన్ని చిత్రాలకు మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఉన్నారు.

బాధ.. సంఘర్షణ నుంచి పుట్టిన పాట
దక్షిణాది నుంచి ఉత్తరాదికి.. ఉత్తరాది నుంచి దక్షిణానికి వేలాది వలస జీవులు నడిచి వెళ్తున్నారు. నాకేమైనా ఫర్వాలేదు.. నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనుకుని ఎర్రటి ఎండలో మైళ్లకు మైళ్లు నడుస్తున్న వలస జీవుల్ని మీడియాలో.. సోషల్‌ మీడియాలో చూసి.. ఎట్లాంటి స్థితిలో ఉన్నాం.. అని బాధనిపించింది. ఆ బాధ, సంఘర్షణలోంచి ఈ పాట పుట్టింది.

– ఆదేశ్‌ రవి

 – గుర్రాల మహేశ్, సాక్షి, కరీంనగర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top