‘నాచే నాచే...’ అంటూ ముగ్గురు భామలతో ఆడి పాడుతున్నారు ప్రభాస్. ఆయన హీరోగా రూపొందిన తాజా పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది.
తమన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘నాచే నాచే...’ అంటూ సాగే సాంగ్ లాంచ్ ఈవెంట్‌ని ముంబైలో నిర్వహించారు. ఈ పాటలో నిధి, మాళవిక, రిద్దీలతో కలిసి స్టెప్పులేశారు ప్రభాస్. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా సంస్థ నుంచి ఇప్పటివరకు ‘కార్తికేయ, జాట్, మిరాయ్’ వంటి సినిమాలను బాలీవుడ్‌లో రిలీజ్ చేశాం. ఇప్పుడు మా సంస్థలో బిగ్గెస్ట్ స్టార్ హీరో ప్రభాస్‌గారితో ‘ది రాజా సాబ్’ వంటి పెద్ద సినిమా నిర్మించాం’’ అని తెలిపారు.
‘‘ఈ సినిమా కోసం తెలుగు నేర్చుకుని డబ్బింగ్ చె΄్పాను’’ అన్నారు రిద్దీ కుమార్. ‘‘పెద్దలతో పాటు పిల్లలకు కూడా మా సినిమా బాగా నచ్చుతుంది’’ అన్నారు మాళవికా మోహనన్. ‘‘రాజా సాబ్’లో వీఎఫ్‌ఎక్స్ సహజంగా ఉంటాయి. స్క్రీన్ మీద సన్నివేశాలు చూస్తుంటే నిజమైన అనుభూతి కలుగుతుంది’’ అని నిధీ అగర్వాల్ పేర్కొన్నారు. నటీనటులు జరీనా వాహబ్, బొమన్ ఇరానీ మాట్లాడారు.


