కళాత్మకం : నవ్వుల హరివిల్లు

కళాత్మకం :  నవ్వుల హరివిల్లు - Sakshi


 ఎదురుగా కొలీగ్ కనిపిస్తే అసంకల్పిత చర్యగా నవ్వుతాం. అది క్యాజువల్ నవ్వు. పక్కింటివాళ్లు కనిపిస్తే నవ్వుతాం... అది తప్పనిసరి నవ్వు. ఇష్టం లేని వాళ్లు ఎదురైతే తిట్టలేక... లోలోపల తిట్టుకుంటూ నవ్వుతాం. అది కృతకమైన నవ్వు. 24 గంటల్లో ఇలాంటి ఎన్నో నవ్వులు నవ్వుతూనే ఉంటాం. అయితే నవ్వంటే ఇది కాదు. హాయిగా నవ్వాలి. అరమరికలు లేకుండా నవ్వాలి. భుజాలు కదిలేలా నవ్వాలి. అలా నవ్వాలంటే... నవ్వు రావాలి. ఆ నవ్వు ఎలా వస్తుంది? నవ్వించే వాళ్లు మన దగ్గరగా ఉంటే వస్తుంది. నవ్వించడమే పనిగా ఎవరు పెట్టుకుంటారు? దోర్నాల హరిబాబు అదే పనిలో ఉన్నారు. రంగస్థలం మీద నవ్వించారు, టీవీ రియాలిటీ షోలలో నవ్వించారు, సినిమాల్లో, సినిమా ప్రోగ్రాముల్లో నవ్విస్తున్నారు. విదేశాలకెళ్లి మరీ అక్కడి తెలుగు వాళ్లను నవ్విస్తున్నారు. ఈ నెల 9నుంచి 25వ తేదీ వరకు అమెరికాలో జరిగే ‘క్యాపిటల్ ఏరియా తెలుగు అసోసియేషన్(క్యాట్స్)’ దసరా - దీపావళి ఉత్సవాలలో నవ్వించడానికి ప్రయాణమవుతున్నారు. డల్లాస్, వాషింగ్టన్ డిసి, ఇండియానా పోలిస్, అట్లాంటా, కాలిఫోర్నియాలలో సాంస్కృతిక సంబరాలలో పాల్గొననున్నారు.

 

 పౌరాణికాల నుంచి...

 హాస్యనటుడు దోర్నాల హరిబాబు నాటకరంగంలో అడుగుపెట్టి 30 ఏళ్లు దాటింది. మొదట పౌరాణికాల్లో రంగప్రవేశం చేశారు. 1980లో ప్రముఖ రంగస్థల నటులు పొన్నాల రామసుబ్బారెడ్డి దగ్గర శిష్యరికం చేశారు. పన్నెండేళ్లపాటు పౌరాణిక నాటకాల్లో నటించిన అనుభవం చక్కటి ఉచ్చారణనిచ్చింది. నటుడిగా ఇంకా ఏదో చేయాలన్న తపనను పెంచింది. తనకు ఇష్టమైన హాస్యాన్ని పండించాలంటే సాంఘిక అంశాలతోనే సాధ్యం అనుకున్నారు హరిబాబు. తనే కామెడీ స్కిట్స్ రాయడం మొదలుపెట్టారు. ఆయన ఇతివృత్తాలలో సామాజికాంశం, ఫ్యామిలీ డ్రామా ప్రధానంగా ఉంటాయి. హరిబాబు సామాజికాంశాలకు చమత్కారం జోడించి నవ్విస్తూ చెప్పడం వల్ల ప్రభుత్వ పథకాలను సామాన్యులకు చేరవేయడానికి ఇదే మంచి ప్రసారసాధనం అనుకున్నారు అధికారులు. అలా సారా వ్యతిరేకోద్యమం, పారిశుద్ధ్యం- ప్రజారోగ్యం, దోమల నిర్మూలన పథకాల ప్రచార కార్యక్రమాలలో నటించారు. కామిడీ స్కిట్స్ తానే రాసుకోవడం వల్ల వాటిని అంతే పట్టుతో నటించి నవ్వించడం సులువవుతోందంటారాయన.

 

 ట్రెండ్‌కు అనుగుణంగా...

 రంగస్థలం మీద హాస్యాన్ని పండించి 19సార్లు ఉత్తమ హాస్యనటుడుగా బహుమతి అందుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలతోపాటు తమిళనాడు, కర్నాటక, గుజరాత్ రాష్ట్రాల్లో హాస్యనాటకాలు ప్రదర్శించారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా కళాప్రదర్శన మాద్యమాన్ని కూడా మార్చుకుంటేనే మనుగడ. హరిబాబు సక్సెస్ ఫార్ములా సరిగ్గా అదే. టీవీ చానెళ్లలో ప్రసారమయ్యే కామెడీ ప్రోగ్రామ్‌లలో నటించి ప్రేక్షకులను నవ్వించారు. ఈ నవ్వులు ఖండాంతరాలు దాటాయి. విదేశాల్లో ఉన్న తెలుగువాళ్లు స్వయంగా వచ్చి నవ్వించమని ఆహ్వానించారు. ఆ ఆహ్వానాల మేరకు అమెరికా, దుబాయ్, మలేసియా, మారిషస్ దేశాల్లో సంక్రాంతి సంబరాలు, తెలుగు సంఘం వేడుకల్లో హాస్యనాటకాలు ప్రదర్శించారు. లెక్కలేనన్ని ప్రదర్శనలిచ్చి పురస్కారాలందుకోవడం నాణేనికి ఒకవైపు, మరోవైపు హరిబాబు తోటి కళాకారులను సత్కారాలు చేస్తుంటారు. హరివిల్లు క్రియేషన్స్ పేరుతో సాంస్కృతిక సంస్థను స్థాపించి కళాసేవ చేస్తున్నారు.

 

 ఆధునిక జీవితంలో రోజంతా ఉరుకులు పరుగులతో క్షణం కూడా తీరికలేకుండా ఎన్నో పనులు చేస్తున్నాం, ఎంతో సాధిస్తున్నాం. ఇన్ని సాధించే హడావిడిలో పడిపోయి మంచి నవ్వుని మిస్ అవుతున్నాం. ఆ నవ్వుని అందించే హాస్యపువిల్లు ఈ హరిబాబు.

 - వాకామంజులారెడ్డి, సాక్షి ఫీచర్‌‌స ప్రతినిధి

 

 హరిబాబు గురించి...

  పుట్టింది, పెరిగింది... నెల్లూరు  పౌరాణిక పాత్రలు: కర్కోటకుడు, జీవలుడు (చిత్రనళీయం), లోహితుడు, కేశవుడు (సత్యహరిశ్చంద్ర), భరతుడు (శకుంతల), చిన్న చంద్రుడు (తారాశశాంకం), సుకులుడు (సారంగధర), శ్రీరాముడు(భక్తరామదాసు)  పౌరాణిక ప్రదర్శనలు: దాదాపుగా 400  19 సార్లు ఉత్తమ హాస్యనటుడిగా బహుమతులు  చెన్నైలో ఆంధ్రసోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నాటక పోటీల్లో స్వర్ణ పతకం  ప్రభుత్వ పథకాల అంశాలతో హాస్యనాటకాల రాయడం, నటించడం.

 టీవీ రియాలిటీషోలలో...

  ‘స్మైల్ రాజా’ అవార్డుతోపాటు లక్షరూపాయల బహుమతి.

  జీ స్మైల్ శ్రీ, మత్తుగా గమ్మత్తుగా, నవ్వుల్- నవ్వుల్‌కి వ్యాఖ్యాత.

 

 స్టేజ్ ప్రోగ్రామ్‌లు...

  హాస్యవల్లరి పేరుతో రాష్ర్టవ్యాప్తంగా వెయ్యికి పైగా ప్రదర్శనలు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top