దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లింల సంక్షేమం సాధ్యమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అన్నారు.
నందికొట్కూరు, న్యూస్‌లైన్: దివంగతనేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే ముస్లింల సంక్షేమం సాధ్యమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి అన్నారు. గురువారం నందికొట్కూరులోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్‌ఆర్‌కే దక్కిందన్నారు. ముస్లిం పేద విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలను వర్తింపజేశారన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో ముస్లింలు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. వైఎస్‌ఆర్ హయాంలో అమలు చేసిన పథకాలన్నీ తిరిగి అమలు జరగాలంటే వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని పేర్కొన్నారు. హఫీజ్‌ఖాన్ ముస్లింలకు అందుబాటులో ఉండి సేవలందిస్తారని చెప్పారు.
టీడీపీకి ఓటు వేస్తే బీజేపీని గెలిపించినట్లే : హఫీజ్‌ఖాన్
రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసినట్లయితే అది పరోక్షంగా బీజేపీని గెలిపించినట్లేనని వైఎస్సార్సీపీ జిల్లా మైనార్టీసెల్ కన్వీనర్ హఫీజ్‌ఖాన్ అన్నారు. తాను వైఎస్‌ఆర్‌సీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. కొన్ని పత్రికలు పనిగట్టుకొని అవాస్తవాలను ప్రచురిస్తున్నాయని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి గౌరు సమక్షంలోనే పనిచేస్తున్నానన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసేందుకు తమవంతు కృషి చేస్తానని అన్నారు.
టీడీపీ కాంగ్రెస్ పార్టీగా మారిందని ఆరోపించారు. టీడీపీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేననే విషయాన్ని ముస్లింలు గుర్తించి వైఎస్‌ఆర్‌సీపీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు ఇంతియాజ్, అలీఖాన్, ఎండీ.బాషా, మాలిక్, నజీర్‌ఖాన్, అరిఫ్‌ఖాన్, రమణ, సోహైల్ తదితరులు ఉన్నారు.