జిల్లాలో ఫ్యాన్ హవా | ysr congress party guntur district dominant | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఫ్యాన్ హవా

May 7 2014 12:14 AM | Updated on Aug 24 2018 2:33 PM

జిల్లాలో ఫ్యాన్ హవా - Sakshi

జిల్లాలో ఫ్యాన్ హవా

రాజకీయ కురుక్షేత్రంలో కుట్రలు, కుతంత్రాలకు, విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న పోరులో విశ్వసనీయతకే పట్టం కట్టేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు.

సాక్షిప్రతినిధి, గుంటూరు :రాజకీయ కురుక్షేత్రంలో కుట్రలు, కుతంత్రాలకు, విశ్వసనీయతకు మధ్య జరుగుతున్న పోరులో విశ్వసనీయతకే పట్టం కట్టేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా బుధవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలు ముందే ఒక నిర్ణయానికి వచ్చేశారు. జిల్లాలోని 17 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఫ్యాన్ హవా కొనసాగుతోంది. అభ్యర్థుల ఎంపికనుంచి, ప్రచారం ముగిసేవరకూ పార్టీ ముందంజలోనే ఉంది. వైఎస్సార్ సీపీ నుంచి ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయా నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగాపనిచేశారు.
 
 నరసరావుపే పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, గుంటూరు పార్లమెంటు పరిధిలో వల్లభనేని బాలశౌరి, బాపట్ల పార్లమెంటు పరిధిలోని డాక్టర్ అమృతపాణిలు ఆయా స్థానాల పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులు సమన్వయంతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం, ఉత్తేజం నింపారు. దీనికి తోడు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, జగన్ సోదరి షర్మిల జిల్లాలో రెండు, మూడు దఫాలుగా విస్తృతంగా పర్యటించారు. మండుటెండల్లో సైతం వీరి పర్యటనలకు జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జగన్ సభలకు వేలాదిసంఖ్యలో ప్రజలు హాజరుకావడంతో జిల్లాలో పార్టీకి తిరుగులేదని తేలిపోయింది. రోజురోజుకూ పార్టీలో చేరుతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో ప్రత్యర్థి వర్గాల్లో గుబులు మొదలైంది.
 
 ఫ్యాన్ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు యత్నాలు...
 వైఎస్సార్ సీపీ ప్రభంజనాన్ని అడ్డుకుని, ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న ఉద్దేశంతో టీడీపీ అభ్యర్థులు చేయని ప్రయత్నం లేదు. మద్యం, డబ్బును విచ్చలవిడిగా పంపిణీ చేశారు. గుంటూరు ఈస్ట్, వెస్ట్, నరసరావుపేట, పెదకూరపాడు, గురజాల, తెనాలి, రేపల్లె, మంగళగిరి, వినుకొండ, ప్రత్తిపాడు, పొన్నూరు నియోజకవర్గాల్లో ఓటుకు రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. ఓటర్లను మద్యం మత్తులో ముంచెత్తారు. చాలా ప్రాంతాల్లో ఓటుకు నోట్లు పంచుతూ పోలీసులకు పట్టుబడ్డారు. అయినా ప్రలోభాల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆలయాలు, కమ్యూనిటీ హాళ్లు, కల్యాణ మండపాల నిర్మాణం కోసమంటూ గ్రామాల వారీగా పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారు. తాము ఎన్ని ఎత్తుగడలు వేసినా ఫ్యాన్ ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోతున్నామని తెలుగుదేశం శ్రేణుల్లో చర్చించుకోవడం గమనార్హం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement