పిలుపే ప్రభం‘జనం’


 •      మండే ఎండలోనూ జగన్ జనభేరి

 •      జిల్లా పరిస్థితిని ప్రస్తావించిన జననేత

 •      బాబు పాలనలో నిర్లక్ష్యం.. వైఎస్ పాలనతో వైభవం

 •      రెండో పంటకు నీరిచ్చిన రైతు బాంధవుడు వైఎస్

 •      చేనేత.. మత్స్యకారులను ఆదుకుంటానని హామీ

 •      తీరంలో సమస్యలు పరిస్కారిస్తానని భరోసా

 •      25 ఎంపీలు గెలిపించుకుంటే కొల్లేరు కుదింపు సాధించుకోవచ్చని పిలుపు

 •  ప్రజల చల్లని దీవెనల ముందు మండే భానుడు చిన్నబోయాడు.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోసం గంటల సమయాన్ని సైతం నిమిషాలు, క్షణాలుగా గడిపేసిన జనం తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉక్కపోతను సైతం లెక్కచేయక అభిమాన నేత కోసం ఎదురుచూసి జననేత చూపిన అభిమాన జడిలో తడిసి ముద్దయ్యారు. జనభేరి సభల్లో జగన్ జిల్లా వాసుల ఇబ్బందులను సమస్యలపై స్పష్టమైన హామీలిచ్చారు. పేదోడి క్షేమం కోరే తమ ప్రభుత్వంవస్తుందని, మళ్లీ వైఎస్ సంక్షేమ రాజ్యం తేస్తానని భరోసా ఇచ్చారు.

   

  సాక్షి ప్రతినిధి, విజయవాడ : జిల్లాలో వైఎస్సార్ జనభేరి మూడోరోజైన గురువారం పెడన నియోజకవర్గం బంటుమిల్లి నుంచి ప్రారంభమైంది. సింగరాయపాలెం మీదుగా కైకలూరు వరకు సాగింది. బంటుమిల్లి, కైకలూరులో జరిగిన సభల్లో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రోడ్‌షోలో భాగంగా దారిపొడవునా ఆయన వృద్ధులను, యువకులను, మహిళలను పలుకరిస్తూ ముందుకు సాగారు. జగన్‌మోహన్‌రెడ్డి వెంట మచిలీపట్నం, ఏలూరు ఎంపీ అభ్యర్థులు కొలుసు పార్థసారథి, తోట చంద్రశేఖర్, పెడన, కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థులు బూరగడ్డ వేదవ్యాస్, ఉప్పాల రామ్‌ప్రసాద్, కైకలూరు నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఉన్నారు.

   

  రెండో పంటకు నీరిచ్చిన వైఎస్...

   

  జనభేరి సభల్లో జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో కనీసం ఒక పంటకు కూడా సరిగా నీరివ్వకపోవడంతో అన్నదాతలు వలస కూలీలుగా మారిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. పూలమ్మినచోటే కట్టెలు అమ్మలేక పొరుగు ప్రాంతాలకు పొట్ట చేతపట్టుకుని వెళ్లిన అన్నదాతల అవస్థలు వైఎస్ గుర్తించారని చెప్పారు. అందుకే జిల్లాలో రైతుల కష్టాలను తీర్చేందుకు దివంగత మహానేత వైఎస్ రెండో పంటకు కూడా సకాలంలో నీరిచ్చారన్నారు.  కృష్ణా డెల్టాకు సాగు, తాగునీటి సమస్య రాకుండా పులిచింతల ప్రాజెక్టు నిర్మాణానికి వైఎస్ ఎంతో కృషిచేశారని తెలిపారు. తీర ప్రాంత రైతుల సాగునీటి సమస్య తనకు తెలుసునని, రానున్న కాలంలో ఈ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం కనుగొనే దిశగా కృషిచేస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ప్రాంతంలో చేనేత, మత్స్యకారులు ఎక్కువగా ఉన్నారని,వారి భవిత బాగుండేలా తన హయాంలో ప్రత్యేకంగా కృషి చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

   

  తీరం సమస్యలు.. కొల్లేరు వాసుల వెతలు తీరుస్తా...

   

  తీర ప్రాతంలోని పలు సమస్యలను పెడన ఎమ్మెల్యే అభ్యర్థి బూరగడ్డ వేదవ్యాస్ జననేత జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తేవడంతో ఆయన వాటిపై స్పందించారు. జిల్లాలో ఉన్న సువిశాల తీర ప్రాంతంలో ప్రజలు పడుతున్న సాగు, తాగునీటి కష్టాలను తీర్చడంతో పాటు ఈ ప్రాంతంలోని వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. కైకలూరులో కొల్లేరు సమస్యను ఎంపీ అభ్యర్థి తోట చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పాల రామ్‌ప్రసాద్‌లు జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తెచ్చారు.  కొల్లేరు వాసుల కష్టాలను తీర్చేందుకు దివంగత మహానేత వైఎస్ కాంటూరును ఐదు నుంచి మూడుకు కుదిస్తూ తీర్మానం చేసి కేంద్రానికి పంపారని జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆయన చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 25 మంది ఎంపీలనూ గెలిపించుకుందామని, కేంద్రంలో మనమే కీలకంగా ఉందామని జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. 25 మంది ఎంపీలను గెలిపించుకోవడం ద్వారా అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే కొల్లేరు కాంటూరు కుదింపు బిల్లును కేంద్రానికి పంపి కచ్చితంగా సాధించుకుందామని ఆయన తెలిపారు.

   

  డీఎన్నార్‌కు మొదటి ఎమ్మెల్సీ...

   

  కైకలూరులో కొన్ని కారణాలతో దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్)కు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేకపోయామని, ఇక్కడ ఉప్పాల రామ్‌ప్రసాద్‌ను గెలిపించుకోవడం ద్వారా డీఎన్నార్‌కు సముచిత స్థానం ఇస్తామని జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. తాము అధికారం చేపట్టిన వెంటనే జిల్లా నుంచే మొదటి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి డీఎన్నార్‌ను శాసనమండలిలో కూర్చోబెడతానని ఆయన హామీ ఇచ్చారు. ఉదయం 12 గంటలకే జననేత వస్తారని ప్రకటించడంతో కైకలూరు సెంటర్‌కు తరలివచ్చిన వేలాది మంది మండే ఎండలోనూ వేచిచూశారు. జగన్‌మోహన్‌రెడ్డి రాత్రి 7 గంటలకు కైకలూరు సెంటర్‌కు చేరుకునే వరకు ఏడు గంటలపాటు వేలాది మంది ప్రజలు ఆయనపై అభిమానంతో ఎదురుచూడటం విశేషం.

   

  జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు...

   

  రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు పలికారు. టీడీపీ మైనార్టీ సెల్ మచిలీపట్నం నాయకులు షకీర్ అహ్మద్, ఎస్‌కే మునీరు, మహ్మద్ అక్బర్‌లు వైఎస్సార్‌సీపీలో చేరారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ జెడ్పీటీసీ పంచికర్ల శివశంకరరావు, మాజీ సర్పంచ్ శ్యాంసన్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు అంగర రామ్మోహన్‌రావు, మల్లేశ్వరస్వామి ఆలయ మాజీ చైర్మన్ పి.నారాయణరెడ్డి, పెనమలూరు సమన్వయకర్త పడమట సురేష్‌బాబు, బంటుమిల్లి ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు ఊరా రాంపండు, సబ్బిశెట్టి హరనాథబాబు, సబ్బిశెట్టి విఠల్, సీహెచ్ గాంధీలు కలిసి మద్దతు తెలిపారు. బ్రాహ్మణ సమాఖ్య రాష్ట్ర నాయకులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మద్దతు ప్రకటించారు.

   

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top