
లేచింది మహిళాలోకం..!
ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో తామే ముందుంటామని మహిళా ఓటర్లు నిరూపించారు. అదీ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు పురుషుల కంటే అధికంగా ఓట్లు వేశారు.
అక్షరాస్యతలో వెనుకబడినా.. ఓటింగ్‌లో ముందున్నారు
30కి పైగా అసెంబ్లీ సీట్లలోపోటెత్తిన మిహళలు
పురుషుల కంటే వారి ఓట్లే అధికం
కరీంనగర్, నిజామాబాద్, మెదక్,ఖమ్మం జిల్లాల్లో అత్యధికం
హైదరాబాద్‌లో అతివల ఓటింగ్ తక్కువ
సాక్షి, హైదరాబాద్ : ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడంలో తామే ముందుంటామని మహిళా ఓటర్లు నిరూపించారు. అదీ గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు పురుషుల కంటే అధికంగా ఓట్లు వేశారు. ఒకటి అరా కాదు. పోలైన ఓట్లలో పురుషులకు, మహిళా ఓటర్లకు వ్యత్యాసం ఏకంగా వేల సంఖ్యలో ఉంది. ప్రధానంగా కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం జిల్లాల్లో మహిళలు ఓట్ల వేయడానికి పోటెత్తారు. మహిళా ప్రభంజనంతో ఎవరి జాతకాలు మారవుతాయోనన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. 30 కి పైగా అసెంబ్లీ సెగ్మెంట్లలో మహిళా ఓటర్లు రాజకీయ నాయకుల భవితవ్యం తేల్చబోతున్నారు. అందులో ప్రధానంగా పీసీసీ మాజీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేసులో ఉన్న డి.శ్రీనివాస్ పోటీ చేసిన నిజామాబాద్ (గ్రామీణ) నియోజకవర్గంలో ఏకంగా 23 వేల ఓట్ల తేడా ఉండడం గమనార్హం. మహిళల ఓట్లు అధికంగా పడడం నిశ్శబ్ద ఓటింగ్‌కు నిదర్శనం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ నియోజకవర్గంలో పురుషుల ఓట్లు 71,926 పోలవగా, మహిళలు 94,788 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి డి.శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బాజిరెడ్డి గోవర్ధన్‌ల మధ్య ప్రధాన పోటీ ఉంది. నిజామాబాద్ జిల్లా బాల్కొండలోనూ ఇదే పరిస్థితి. పోలైన ఓట్లలో పురుషులవి 61,674 కాగా, మహిళలవి 85,554 కావడం గమనార్హం. ఇక్కడ దాదాపు 24 వేల ఓట్ల వ్యత్యాసం ఉంది. అలాగే కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, ఎల్లారెడ్డి, బాన్సువాడ, ఆర్మూర్, హుస్నాబాద్, ఖానాపూర్, ముథోల్, నిర్మల్, బోథ్, ములుగు, కోదాడ, మెదక్, దుబ్బాక, సిద్దిపేట, కోడంగల్, కార్వాన్, భద్రాచలం, పాలేరు. మధిర, ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలైన ఓట్లలో వేల సంఖ్యలో పురుష, మహిళా ఓట్ల మధ్య వ్యత్యాసం ఉంది.
పధానమైన ఈ నియోజకవర్గాల్లో మహిళలు ఎటువైపు మొగ్గుచూపారన్న విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి మహిళా సంఘాలకు ఇచ్చే రుణ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలకు పెంచి వడ్డీలేని రుణాలు వర్తింప చేస్తామన్న హామీ బాగా పనిచేసిందని ఆ పార్టీ నాయకులు చెబుతుంటే, మహిళలు కాంగ్రెస్ వైపు ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. నిజామాబాద్ జిల్లాలో పురుషుల ఓట్లు 6,20,913 పోలవగా, మహిళా ఓట్లు 7,04,128 పోలయ్యాయి. ఈ ఒక్క జిల్లాలోనే పురుషులతో పోలిస్తే 84 వేల మంది మహిళలు అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్ జిల్లాలో 9,97,737 పురుషుల ఓట్లు పోలవగా, మహిళల ఓట్లు 10,42,821 పోలయ్యాయి. తెలంగాణ మొత్తంలో ఓటింగ్ తక్కువగా నమోదైన జిల్లా హైదరాబాదేననే సంగతి తెలిసిందే. ఇక్కడ పురుషులతో పోలిస్తే మహిళా ఓట్ల శాతం తక్కువగా ఉంది.