
తెలంగాణకు మహిళా సీఎం నా స్వప్నం: రాహుల్
తెలంగాణలో మహిళ ముఖ్యమంత్రి కావాలన్నదే తన కల అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
రూ.2 లక్షల్లోపు రైతు రుణాలు మాఫీ చేస్తాం
మాట మార్చడం కేసీఆర్‌కు అలవాటే
సీఎం కావాలని తహతహలాడుతున్నాడు
రుణ మాఫీ కేసీఆర్ వల్ల కాదు
‘మేడిన్ తెలంగాణ’ వాచీ ధరించాలని ఉంది
మడికొండ, హైదరాబాద్ సభల్లో పాల్గొన్న రాహుల్
సాక్షి, హైదరాబాద్, మడికొండ: తెలంగాణలో మహిళ ముఖ్యమంత్రి కావాలన్నదే తన కల అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పాలించాలంటే ఎంతో దూరదృష్టి, సంకల్పం కావాలని... తన స్వప్నం త్వరలోనే నెరవేరుతుందని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలో మలివిడత అడుగుపెట్టిన రాహుల్ గాంధీ శుక్రవారం వరంగల్ జిల్లా మడికొండలో, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలోనూ పార్టీ నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడిన ఆయన.. తెలంగాణ ఇచ్చింది తామేనని, ‘బ్రాండ్ తెలంగాణ’ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ అధినేత కే సీఆర్‌కు మాట మార్చడం అలవాటేనని, రుణ మాఫీ హామీని నెరవేర్చడం ఆయన వల్ల కాదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రెండు లక్షల వరకు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. ‘కేసీఆర్ రూ. లక్ష వరకే మాఫీ చేస్తానని చెప్పారు. మేం రూ. 2 లక్షల వరకు రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తాం’ అని రాహుల్ స్పష్టం చేశారు. తెలంగాణ కోసం కులమతాలకతీతంగా, చిన్నాపెద్దా తేడాలేకుండా పోరాడినట్టుగానే, దాని పరిపూర్ణ అభివృద్ధి కోసం కాంగ్రాస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
స్వయం సంఘాలతో విప్లవం
‘తెలంగాణ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం ఎంతో ఉంది. ఇక్కడ స్వయం సంఘాల విప్లవం వచ్చింది. తెలంగాణ, సీమాంధ్ర మహిళలు సాధించిన ప్రగతికి నేను ప్రభావితుడినయ్యాను. ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌సహా దేశవ్యాప్తంగా స్వయం సహాయ సంఘాలను విస్తరించాం. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. అదే విధంగా పార్టీలో కూడా ఆ స్థాయిలో మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తాం. 9 గ్యాస్ సిలిండర్ల పరిమితి సరిపోదని మహిళలు చెప్పడంతో ప్రధాని దృష్టికి తీసుకెళ్లి 3 నిమిషాల్లో ఆ సంఖ్యను 12కు పెంచగలిగాం. ఇప్పుడు మీ ముఖాల్లో చిరునవ్వులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేనేం కల కంటున్నానో మీకు తెలుసా? తెలంగాణలో త్వరలో మహిళ... ముఖ్యమంత్రి కావాలన్నదే నా స్వప్నం. అది త్వరలోనే నెరవేరుతుందని ఆకాంక్షిస్తున్నా. రాష్ట్రాన్ని పాలించాలంటే ఎంతో దూరదృష్టి, సంకల్పం కావాలి’ అని రాహుల్ పేర్కొన్నారు.
తెలంగాణ సాధనలో టీఆర్‌ఎస్ పాత్ర లేదు
‘60 ఏళ్లుగా ఎదురుచూసిన కలను మేం సాకారం చేసి చూపాం. జూన్ 2 తర్వాత ఏర్పడే రెండు రాష్ట్రాలు సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుంది. ఎన్నికల సమయంలో అనేక పార్టీలు ముందుకొచ్చి ఏవేవో హామీలిస్తాయి. కాంగ్రెస్ వల్లే తెలంగాణ సాధ్యమైందని మీక్కూడా తెలుసు. తెలుగుదేశం, బీజేపీలు తెలంగాణను వ్యతిరేకించాయి. టీఆర్‌ఎస్ ఏర్పడక ముందే తెలంగాణ ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తీర్మానం చేసి పంపారు. తెలంగాణ బిల్లు రూపొందించినప్పుడు, పార్లమెంట్‌లో ప్రతిపాదించినప్పుడు, రాజ్యాంగ, ప్రజాస్వామ్యబద్దంగా ఆమోదించినప్పుడు టీఆర్‌ఎస్ పాత్ర ఎక్కడా లేద’ని పునరుద్ఘాటించారు.
కాంగ్రెస్‌ను మోసం చేసిన కేసీఆర్: ‘తెలంగాణ కల సాకారమైనా ఇప్పుడు మలి అడుగు చాలా కీలకం. తెలంగాణను దేశంలోనే అగ్ర రాష్ట్రాల సరసన నిలబెట్టాల్సిన అవసరం ఉంది. అద్భుతమైన ప్రగతి జరగాలి. సామాజిక న్యాయం కావాలి. నిరుపేద వ్యక్తికి కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం ఉన్నప్పుడు సామాజిక న్యాయం జరిగినట్లు. ముఖ్యంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్లే నాయకుడు కావాలి. ఆ నాయకుడు ఇచ్చే హామీలపట్ల విశ్వాసం ఉండాలి. కాంగ్రెస్‌లో టీఆర్‌ఎస్‌ను విలీనం చేస్తానన్న కేసీఆర్ మాట మార్చాడు. కాంగ్రెస్‌ను మోసం చేశాడు. దళితుడినే తెలంగాణ సీఎం చేస్తానని పజలకిచ్చిన హామీని కూడా మర్చిపోయాడు. తానే సీఎం కావాలని తహతహలాడుతున్నాడు’ అని ధ్వజమెత్తారు.
మళ్లీ రుణాలను మాఫీ చేస్తాం: ‘రాష్ట్రాభివృద్ధిలో రైతులకు, వ్యవసాయానికి ఏమాత్రం భాగస్వామ్యం లేద ని టీడీపీ హయాంలో చెప్పారు. నాడు రుణం కోసం ఏ బ్యాంకుకు వెళ్లినా తలుపులు మూసేశారు. యూపీఏ అధికారంలోకి వచ్చాక బ్యాంకు తలుపులు తెరిచేలా చేసింది. రూ. 70 వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేసింది. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని విపక్షాలు వేసిన ప్రశ్నను సవాల్‌గా తీసుకుని నెరవేర్చాం. కనీస మద్దతు ధరను పదేళ్లలో 7 రెట్లు పెంచాం. ఇప్పుడు రూ. లక్షలోపు రైతు రుణాలను మాఫీ చేస్తానని కేసీఆర్ చెబుతున్నాడు. తర్వాత అది కూడా మర్చిపోతాడు. అసలు రుణ మాఫీ చేయడం కేసీఆర్ వల్ల కాదు. కానీ కాంగ్రెస్ గురించి మీకు తెలుసు. మాట ఇస్తే నెరవేరుస్తాం. టీఆర్‌ఎస్ రూ. లక్ష రుణాన్ని మాత్రమే మాఫీ చేస్తానంటోంది. కానీ మేం రెండు లక్షల వరకు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేస్తాం. మాట ఇస్తే ఎన్ని కష్టాలు ఎదురైనా ఆకాశం కిందపడినా నెరవేరుస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే మాఫీ చేస్తాం’ అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.
‘మేడ్ ఇన్ తెలంగాణ’ మా సంకల్పం: ‘చెప్పులు, టీషర్టులు, మొబైల్స్, వాచీలు సహా మీరు ధరించే వస్తువులన్నీ చైనా ఉత్పత్తులే. వాటిపై ‘మేడ్ ఇన్ చైనా’ అని ఉంటుంది. అది చూసినప్పుడల్లా బాధ కలుగుతుంది. తెలంగాణ యువత సంపాదించిన సొమ్మంతా చైనాకు వెళుతోంది. ఫలితంగా ఇక్కడ ఉపాధి లేకుండా పోయింది. సాఫ్ట్‌వేర్ రంగంలో హైదరాబాద్ అద్భుతమైన ప్రగతి సాధించింది. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఒక సంకల్పం ఉంది. ఇకపై మనం కొనే, ధరించే ఏ వస్తువులపైనైనా ఇకపై ‘మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ ఇన్ వరంగల్, మేడిన్ హైదరాబాద్’ అని ఉండేలా చేయాలన్నదే ఆ సంకల్పం. మార్కెట్లో వస్తువులను చూసినప్పుడల్లా అందులో తమ భాగస్వామ్యముందనే తృప్తి ప్రతి ఒక్కరికీ కలగాలి. తెలంగాణలో ఉత్పత్తి చేసిన గడియారాన్ని నా చేతికి ధరించాలని కోరికగా ఉంది’ అని ఆయన వ్యాఖ్యానించారు. కాగా, పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను రెండు సభల్లోనూ రాహుల్ ప్రస్తావించారు. టీ-కాంగ్రెస్ ముఖ్యనేతలతో పాటు, పలువురు పార్టీ అభ్యర్థులు, స్థానిక నేతలు ఈ సభల్లో పాల్గొన్నారు.
ఓరుగల్లుకు వరాలు: వరంగల్ జిల్లాకు ప్రపంచ వారసత్వ హోదాను కల్పిస్తామని, రూ. 150 కోట్లతో వరంగల్ మెడికల్ కళాశాలకు ఎయిమ్స్ హోదా తెస్తామని రాహుల్ హామీలిచ్చారు. మడికొండ సభలో 38 నిమిషాలు ప్రసంగించిన ఆయన జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ‘తెలంగాణలో హైదరాబాద్ తర్వా త వరంగల్‌ను రెండో ఐటీ హబ్‌గా మారుస్తాం. జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తాం. ఇప్పటికే జిల్లాలో 7 లక్షల ఎకరాలకు ఆయకట్టును అందించాం. రూ. 400 కోట్లతో స్టేషన్‌ఘన్‌పూర్‌లో టెక్స్‌టైల్ పార్కు, వర్దన్నపేటలో రూ. 10 కోట్లతో టెక్స్‌టైల్, ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తున్నాం. భూపాలపల్లిలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేశాం’ అని పేర్కొన్నారు. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మ య్య, కేంద్ర మంత్రి బలరాం నాయక్, స్థానిక ఎంపీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య ఐదు నిమిషాల చొప్పున మాట్లాడారు. ఓరుగల్లు చరిత్రను పొన్నాల వివరించగా, బలరాం నాయక్ తన ప్రసంగాన్ని గాంధీల కుటుంబాన్ని పొగిడేందుకు వినియోగించారు. ఇక రాజయ్య పూర్తిగా కేసీఆర్‌పై ధ్వజమెత్తారు.
హైదరాబాద్ అందరిది
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎంతోమంది హైదారబాద్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారని, అందరి సహకారంతో ఈ నగరం అంతర్జాతీయ స్థాయిలో ఎదిగిందని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ర్ట విభజన అనంతరం హైదరాబాద్‌లో ఉండే ఇతర ప్రాంతాల వారికి రక్షణ కల్పించే విషయంలో భరోసానిస్తామని హైదరాబాద్ సభలో రాహుల్ తెలిపారు. రూ. 14 వేల కోట్ల వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టు, రూ. 632 కోట్ల వ్యయంతో ఎంఎంటీఎస్ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం కీలకంగా వ్యవహరించిందని గుర్తు చేశారు. ఐటీ రంగంలో ఈ నగరం అగ్రస్థానంలో ఉండే లక్ష్యంతో ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్(ఐటీఐఆర్)’ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, ఎల్బీస్టేడియం సభా వేదికపై ఆది నుంచీ హల్‌చల్ చేసిన మాజీ మంత్రి దానం నాగేందర్.. రాహుల్ హిందీ ప్రసంగాన్ని తెలుగులోకి అడ్డదిడ్డంగా అనువదించి పరువుతీశారు. రాహుల్ మాట్లాడే విషయంపై అవగాహనలేకో, అర్థంకాకనో తెలియదు కానీ... గందరగోళంగా సొంత మాటలు చెప్పి వేదికపై ఉన్న నేతలు నిర్ఘాంతపోయేలా చేశారు. మధ్యలో ఆపలేక, ఏం చేయాలో అర్థంకాక టీపీసీసీ నేతలు బిక్కమొహాలేసి అలాగే కూర్చుండిపోయారు. ఇక రాజ్యసభ సభ్యుడు, గాంధీ కుటుంబానికి వీర విధేయుడు వీహెచ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన్ని వేదికపైకి రాకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. తాను ఎంపీనని చెప్పినా వినిపించుకోలేదు. చివరకు పార్టీ నేతలు జోక్యం చేసుకుని ఆయన్ని వేదికపైకి తీసుకురావాల్సి వచ్చింది.
ప్రజలను పెడదోవ పట్టిస్తున్న కేసీఆర్: ఆజాద్
సాక్షి, హైదరాబాద్: సీఎం అయ్యేందుకే టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజలను పెడదోవ పట్టిస్తున్నాడని కేంద్ర మంత్రి గులాం నబీ అజాద్ ఆరోపించారు. శుక్రవారం సాయంత్రం ఎల్‌బీ స్టేడియంలో జరిగిన కాంగ్రెస్ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ కుటుంబం ఫామ్‌హౌస్‌లో తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాలేదని, కాంగ్రెస్ అధినే త్రి సోనియా సారథ్యంలోని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని యూపీఏ ప్రభుత్వం ఆమోదించడంతోనే తెలంగాణ సాకారమైందని గుర్తుచేశారు. కేసీఆర్ ఒక ఎంపీ మాత్రమేనని, ఒక్కరితో తెలంగాణ ఏర్పాటు ఎలా సాధ్యమవుతుందని ఆజాద్ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని వాగ్దానం చేసి ఆయన మాట తప్పారని దుయ్యబట్టారు. తెలంగాణలో నివసిస్తున్న సెటిలర్స్‌కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. బీజే పీ అగ్రనేత నరేంద్ర మోడీకి ఎంపీగా ఎలాంటి అనుభ వం లేదని, ఆయన కంటే తనకు మూడురెట్లు అధిక రాజకీయ అనుభవం ఉందని వ్యాఖ్యానించారు. మోడీ అధికారంలోకి వస్తే దేశ సెక్యూలరిజానికి ముప్పువాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమర్థ పాలన అందించే సత్తా గల కాంగ్రెస్‌నే బలపరచాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.