Sakshi News home page

కిరణ్ మళ్లీ కాంగ్రెస్ లోకి?

Published Thu, May 1 2014 6:24 PM

కిరణ్ మళ్లీ కాంగ్రెస్ లోకి? - Sakshi

2014 ఎన్నికల్లో చేతులెత్తేసిన కాంగ్రెస్ ఇప్పుడు 2019 పైనే కన్నేసిందా? ఇప్పుడు పోయినా అప్పుడు చూసుకుందాం అనుకుంటుందా? అవసరమైతే తెప్ప తగలెట్టి మరీ వెళ్లిపోయిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ని మళ్లీ చేర్చుకుందాం అనుకుంటుందా?

ఇప్పటికైతే కాంగ్రెస్ సీమాంధ్రలో పూర్తిగా కుదేలైపోయింది. రాష్ట్ర విభజన పాప భారం ఒక వైపు, ప్రముఖ నేతల నిష్క్రమణ మరో వైపు పార్టీని సీమాంధ్ర లో చచ్చిన పాముగా చేశాయి. అందుకే సీమాంధ్రలో 'ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడ్చింది' అన్నట్టు తయారైంది కాంగ్రెస్ పరిస్థితి. అయితే పార్టీకి సీమాంధ్రలో ఇంకా భవిష్యత్తుందని రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ చెబుతున్నారు. 'మా కార్యకర్తల బలం మాకుంది. మా క్యాడర్ చెక్కుచెదరలేదు. కొందరు నేతలు వెళ్లారు తప్ప కార్యకర్తలు పార్టీ వదల్లేదు' అన్నారాయన.  'కిరణ్ కుమార్ రెడ్డిని మేము బయటకిపంపలేదు. ఆయనంతట ఆయనే వెళ్లిపోయారు,' అన్నారాయన. ఆయన రావాలనుకుంటే నిర్ణయం తీసుకోవచ్చు అని కూడా దిగ్విజయ్ అన్నారు.

'మేం అధికారంలోకి వస్తామని చెప్పడం జోక్ అవుతుంది. కానీ మంచి ఓటింగ్ శాతాన్ని పొందడం, గౌరవప్రదమైన పరిస్థితిలో ఉండటం మాకు చాలా ముఖ్యం' అన్నారు మరో సీనియర్ నేత జైరామ్ రమేశ్.  ఆయన కూడా కిరణ్ కుమార్ రెడ్డిని పార్టీలో తిరిగి చేర్చుకునే అవకాశం లేకపోలేదనే సంకేతాలు ఇచ్చారు.

కాబట్టి ఎన్నికల తరువాత జైసమైక్యాంధ్ర పార్టీ చాప చుట్టేస్తుందా? దుకాణం కట్టేస్తుందా? తరువాత చేతికి చేయూతనిస్తుందా? ఇదే ఇప్పుడు సీమాంధ్ర ప్రజల ముందున్న ప్రశ్న!

Advertisement

What’s your opinion

Advertisement