జనరల్ వార్డుల్లో త్రిముఖ పోరు | triangular fighting in general wards | Sakshi
Sakshi News home page

జనరల్ వార్డుల్లో త్రిముఖ పోరు

Mar 20 2014 12:26 AM | Updated on Mar 28 2018 10:59 AM

రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారుతుండటంతో మున్సిపల్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.

వికారాబాద్ , న్యూస్‌లైన్: రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారుతుండటంతో మున్సిపల్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఎవరు ఎవరికి ఓటేస్తారు అనే విషయమై ఒక అంచనాకు రాలేకపోతున్నారు. 28 వార్డుల్లో 17వ వార్డు  ఏకగ్రీవం కావడంతో మిగిలిన 27 వార్డుల్లో బరిలో ఉన్న 120 మంది అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీనియర్ రాజకీయ నేతలను సంప్రదించి వ్యూహాలు రచిస్తున్నారు. మొన్నటి వరకు రెబల్స్‌పై దృష్టి సారించిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు గడువు ముగియడంతో ఇక ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. పోటీదారుల ఎత్తులను తెలుసుకునేందుకు అభ్యర్థులు ఒకరిపై మరొకరు షాడోను ఏర్పాటు చేసుకున్నారు. అభ్యర్థులు ఎక్కడికి వెళ్లి ఎవరితో మాట్లాడుతున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ వ్యూహాలు రచిస్తున్నారు.

 త్రిముఖ పోరు..
 పట్టణంలో ముఖ్యంగా 3, 4, 10, 12, 24 వార్డుల్లో నిల్చున్న అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. మూడవ వార్డులో టీడీపీ అభ్యర్థి ఊరడి ఆంజనేయులు, ఎంఐఎం నుంచి హమీరుద్దీన్, కాంగ్రెస్ నుంచి మేక చంద్రశేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి వర్కల నర్సింహులు బరిలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖపోరు నెలకొనే అవకాశం ఉంది. అదేవిధంగా 4వ వార్డులో టీఆర్‌ఎస్ నుంచి శుభప్రద్‌పటేల్, కాంగ్రెస్ నుంచి ఎల్.లక్ష్మీకాంత్‌రెడ్డి, సీపీఎం నుంచి మహీపాల్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా హెచ్.హరికృష్ణ బరిలో ఉన్నారు. అయితే వీరిలో కేవలం ఇద్దరి మధ్యనే గెలుపు కోసం పోటీ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అలాగే 10వార్డులో కాంగ్రెస్ నుంచి మధుకర్(సూర్య గ్యాస్), టీఆర్‌ఎస్ నుంచి ఎండీ జమీర్, టీడీపీ నుంచి సి.రామస్వామి, ఎంఐఎం నుంచి అతిక్‌పాషా బరిలో ఉండగా త్రిముఖ పోటీ ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. 12వ వార్డులో కాంగ్రెస్ నుంచి వి.సత్యనారాయణ, టీడీపీ నుంచి సి.అనంత్‌రెడ్డి, ఎంఐఎం నుంచి ఫైయాజ్‌ఖాన్, స్వతంత్ర అభ్యర్థిగా జాదవ్‌మోహన్ బరిలో ఉండగా ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉన్నట్లు స్థానికులు భావిస్తున్నారు. 24 వార్డులో టీఆర్‌ఎస్ నుంచి కె.విజయ్‌కుమార్, టీడీపీ నుంచి సి.రమేశ్‌కుమార్, కాంగ్రె స్ నుంచి సుధాకర్‌రెడ్డి, సీపీఎం అభ్యర్థిగా ఎన్. అంబిక, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ కూడా త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీరంతా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డుల్లోని ప్రతి ఒక్కరి ఇంటికి వెలుతూ తనకే ఓటు వేయాలని ప్రాధేయపడుతున్నారు. తనను గెలిపిస్తే 24 గంటలూ అందుబాటులో ఉంటూ, వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీల వర్షం గుప్పిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement