త్రిమూర్తీభవించిన జులుం

త్రిమూర్తీభవించిన  జులుం - Sakshi


* బీసీ, ఎస్సీలపై కక్ష కట్టిన మాజీ ఎమ్మెల్యే తోట

* చిరుద్యోగులను సైతం బదిలీ చేయించిన నిర్వాకం

* ఇందిరమ్మ రుణాలకు మోకాలడ్డిన అధికారమదం

* వెల్లలో 22 కుటుంబాల్ని రోడ్డు పాల్జేసిన దురాగతం


 

 రామచంద్రపురం, న్యూస్‌లైన్ : ఇప్పుడు మొట్టిన చేతులతోనే.. తర్వాత మొక్కినంత మాత్రాన- నొప్పీ, తలబొప్పీ దూరమవుతాయనుకుంటే అవివేకమే. ఇప్పుడు కన్నెర్రజేసి బెదిరించి.. ఆనక కంటిని రెప్పలా చూసుకుంటానన్నంత మాత్రాన.. తప్పిదాలన్నీ ఒప్పు అయిపోతాయనుకుంటే భ్రాంతి మాత్రమే. మనది ప్రజాస్వామ్యమన్న విషయాన్నే విస్మరించి, తనకు గులాం గిరీ చేయని వారందరిపై జులుం చలాయించడమే రివాజుగా మారిన నాయకుడు తాజా మాజీ ఎమ్మెల్యే,  రామచంద్రపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులు. ప్రస్తుతం ఎన్నికల పబ్బం గడుపుకొనేందుకు ఆయన వివిధ వర్గాలపై టన్నుల కొద్దీ అభిమానం ప్రదర్శిస్తున్నారు. గతంలో తాను కక్ష గట్టిన వారిపైనే ఎక్కడ లేని ఆపేక్ష ఒలకబోస్తున్నారు. అయితే ఇదంతా.. పులి తెల్లరంగు పులుముకుని ఆవులా నటించే చందమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

 

 తోట.. ఎన్నికలకు ముందు ఏ వర్గాలనైతే ఇబ్బందుల పాల్జేశారో ఆ వర్గాలన్నింటి పైనా ఇప్పుడు అమితమైన ప్రేమ ప్రదర్శిస్తున్నారు. వారితో సమావేశాలు నిర్వహిస్తూ ప్రలోభాల పాచిక విసురుతున్నారు. అయితే ఉప ఎన్నికలో గెలిచి, 23 నెలలుఅధికారంలో ఉండగా తోట శెట్టిబలిజలతోపాటు ఇతర బీసీలు, ఎస్సీలపై చేసిన కక్ష సాధింపులు మర్చిపోలేదని ఆ వర్గాల నాయకులు అంటున్నారు. ఉప ఎన్నికకు ముందు మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన ఎలక్ట్రీషియన్‌ను నూజివీడు, వర్క్ ఇన్‌స్పెక్టర్‌ను మచిలీపట్నం, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ను కృష్టా జిల్లాకు, చివరకు మంచినీటి సరఫరా విభాగంలో పనిచేసే వాటర్ బాయ్‌ను నూజివీడుకు కేవలం కక్షతోనే అడ్డగోలుగా బదిలీ చేయించడం వాస్తవం కాదా అని ప్రశ్నిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న ఒక ఉద్యోగిని బదిలీ చేయించగా.. ఆనక చికిత్స పొందుతూ మృతి చెందిన వైనాన్ని గుర్తు చేస్తున్నారు.కాగా తోట.. కేవలం తనకు అనుకూలంగా లేరనే ఏకైక కారణంతో నియోజకవర్గంలోని శెట్టిబలిజ గ్రామాల్లో పలువురు నిరుపేదలకు ఇందిరమ్మ ఇంటి రుణాలను ఇవ్వకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాక.. దంగేరు, భట్లపాలిక గ్రామాల్లో సంబంధిత సామాజికవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులు ఇళ్లు నిర్మించుకున్నా ఇప్పటివరకు బిల్లులు మంజూరు కానివ్వకుండా ఎమ్మెల్యే అనుచరులు కక్షసాధింపులకు పాల్పడ్డారని ఆ సంఘాల నేతలు చెబుతున్నారు. స్థానిక  ఏరియా ఆస్పత్రిలో  2007 నుంచి  వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న బీసీ, ఎస్సీ కాంట్రాక్టు ఉద్యోగులు గత ఏడాది నుంచి రోడ్డున పడ్డారు. ఎక్స్‌రే, ఫార్మసిస్టు, సెక్యూరిటీ, స్టాఫ్‌నర్సు, ల్యాబ్ అసిస్టెంట్, స్కానింగ్, అటెండర్ వంటి పోస్టుల్లో ఉన్న 14 మంది ఎస్సీ, బీసీ వర్గాల అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తొలగించారని అంటున్నారు.

 

 కపటప్రేమతో తప్పులు ఒప్పులు కావు..

 వెల్లలో బలహీనవర్గాలకు చెందిన వారి ఇళ్లను పోలీసులు, రెవెన్యూ అధికారులను వినియోగించి కూల్పించిన విషయం నిజం కాదా అని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి పోలీసు బలగాలను పంపించి పొక్లెయిన్‌తో ఇళ్లను కూల్చివేసి, 22 కుటుంబాలను రోడ్డు పాలు చేసిన విషయం ఎలా మరిచిపోగలమంటున్నారు. ద్రాక్షారామలో గతంలో బీసీ, ఎస్సీలకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయించటానికి ప్రయత్నించిన నిర్వాకమూ తోటదేనంటున్నారు. ద్రాక్షారామలో మండాలమ్మపేట వద్ద ఎస్సీలకు చెందిన భూములను వారికి తిరిగి అప్పగించాలని కోర్టు తీర్పు ఇచ్చినా.. తోట అధికారులను అడ్డం పెట్టుకుని అప్పగించలేదని జెడ్పీటీసీ  మాజీ సభ్యుడు ఇంత సంతోషం ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో శెట్టిబలిజలకు చెందిన రేషన్ డిపోలపై తోట.. అధికారులతో దాడులు చేయించి కేసుల్లో ఇరికించారని, వారిని తప్పించి తన అనుచరులకు ఇప్పించుకున్నారని, షాపులు కోల్పోయిన డీలర్లు  కోర్టుల్ని ఆశ్రయించినా.. తోట అధికారం అడ్డం పెట్టుకుని షాపులు రాకుండా చేశారని బీసీ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. తమ వర్గీయులను పుండులా సలిపే.. ఆ దురాగతాలను.. ఇప్పుడు కపటప్రేమ ఒలకబోసి కప్పిపుచ్చలేరని ఆక్షేపిస్తున్నారు. నియోజకవర్గంలో బీసీలందరూ తన వెంటే ఉన్నారని తోట.. తప్పుడు ప్రచారం చేసుకుంటున్నా.. తమ వర్గీయులు తగిన బుద్ధి చెప్పి తీరతారని స్పష్టం చేస్తున్నారు. 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top