బీహార్ ప్రగతి ప్రదాత

బీహార్ ప్రగతి ప్రదాత - Sakshi


 ప్రస్థానం



 పేరు    :    నితీశ్ కుమార్. ముద్దుపేరు మున్నా

 జననం    :    1951 మార్చి 1

 చదువు    :    బీటెక్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)

 నియోజకవర్గం    :    శాసనమండలి సభ్యునిగా కొనసాగుతున్నారు.

 నమ్మిన సిద్ధాంతం    :    ‘లౌకిక’వాదం. అభివృద్ధితోనే అన్నీ సాధ్యం

 ప్రస్తుత వైఖరి    :    ‘కర’, ‘కమలా’లకు సమదూరం

 రాజకీయ అరంగేట్రం    :    1974లో జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం ద్వారా

 రాజకీయాల్లో ఇమేజ్    :    బీహార్ పునరుజ్జీవన ప్రదాత

 రాజకీయాల్లోకి రాక ముందు    :    బీహార్ రాష్ట్ర విద్యుత్ మండలిలో ఇంజనీరుగా ఉద్యోగం

 

 ఎలక్షన్ సెల్: అరాచకానికి ఆలవాలమైన బీహార్‌ను అభివృద్ధి బాట పట్టించిన ఘనాపాఠీ నితీశ్‌కుమార్. ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని శరవేగంగా ఆర్థిక ప్రగతి బాటన పరుగులు తీయించా రు. ‘బీహార్ పునరుజ్జీవన ప్రదాత’గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఒకనాడు ‘బీమారు’ రాష్ట్రంగా అపఖ్యాతి పాలైన బీహార్, నితీశ్ సారథ్యంలో 2011-12లో 13.1 శాతం ఆర్థిక వృద్ధితో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. క్రిమినల్ కేసుల సత్వర విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, నేరగాళ్లపై ఉక్కుపాదం మోపడం వంటి చర్యలతో శాంతిభద్రతలను చక్కదిద్దారు.

 

 జేపీ స్కూలు!



 జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం స్ఫూర్తి తో సోషలిస్టు రాజకీయాల్లోకి ప్రవేశించిన నితీశ్, అంచెలంచెలుగా ఎదిగారు. జేపీ, రామ్‌మనోహర్ లోహియా వంటి దిగ్గజాల వద్ద రాజకీయ పాఠాలను నేర్చుకున్నారు. 1977, 1980లలో బీహార్ అసెంబ్లీకి పోటీచేసినా ఓటమి చవిచూశారు. స్వతంత్ర అభ్యర్థిగా 1985 అసెంబ్లీ ఎన్నికల్లో తొలి విజయం సాధించారు. 1989లో లోక్‌సభకు తొలిసారిగా ఎన్నికయ్యారు. చాలాకాలం లాలూతో కలసి మెలసి పనిచేసినా, 1994లో సమతా పార్టీ ఆవిర్భావంతో దారులు వేరయ్యాయి. వీపీ సింగ్ నేతృత్వంలోని నేషనల్ ఫ్రంట్ సర్కారులో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు.

 

 వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో రైల్వే మంత్రిగా పనిచేశారు. నితీశ్ రైల్వేమంత్రిగా ఉండగానే 2002లో గుజరాత్‌లో గోద్రా అల్లర్లు జరిగాయి. 2000లో బీహార్ సీఎం కాగలిగినా మెజారిటీ నిరూపించుకోలేక పోవడంతో వారం రోజుల్లోనే వైదొలగాల్సి వచ్చింది. ఐదేళ్ల నిరీక్షణ తర్వాత 2005లో ఎన్డీఏలో భాగంగా బీజేపీ పొత్తుతో జేడీ(యూ) విజయం సాధించడంతో నితీశ్ మళ్లీ సీఎం కాగలిగారు. 2010 ఎన్నికల్లోనూ ఆ కూటమి గెలుపొందడంతో రెండోసారి సీఎంగా కొనసాగుతున్నారు. నరేంద్ర మోడీకి ఎన్డీఏ ప్రచార సారథ్యం అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించి బీజేపీతో తెగతెంపులు చేసుకున్నారు.

 

 పునాదులు మరువని తత్వం



 ఎంత ఎదిగినా పునాదులు మరువని తత్వంతో నితీశ్ ప్రజలకు చేరువ కాగలిగారు. చిన్ననాటి అనుభవాలను గుర్తుంచుకుని మరీ చేపట్టిన పనులు ప్రజల మన్ననలు పొందాయి. మెట్రిక్‌లో గణితం పేపరు రాస్తుండగా, టైమైపోయిందంటూ ఇన్విజిలేటర్ క్షణమైనా ఆగకుండా సమాధాన పత్రం లాగేసుకున్నందుకే వందకు వంద మార్కులు రాలేదంటూ ఇప్పటికీ బాధపడతారు.

 

 అందుకే నిర్ణీత వ్యవధి ముగిసినా విద్యార్థులకు మరో 15 నిమిషాల గడువు కల్పిస్తూ తాను సీఎం కాగానే పరీక్షల నిబంధనలను సడలించారు. నితీశ్ చిన్నతనంలో బడికెజళ్లేందుకు తోవలో రైలు పట్టాలు దాటాల్సి వచ్చేది. ఒకసారి ఆగి ఉన్న గూడ్సును కింద నుంచి దాటుతూ అపాయం అంచుల దాకా వెళ్లి బయట పడ్డారు. అది గుర్తు పెట్టుకుని, రైల్వే మంత్రి కాగానే అక్కడ ఓవర్‌బ్రిడ్జి కట్టించారు!

 

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top