కన్నీటి గాథలు

కన్నీటి గాథలు - Sakshi


మా ఉసురు తగులుతుంది..

2013 అక్టోబర్ 17వ తేదీ టీవీలో వార్తలు చూసిన మానాన్న తలారి ఆండ్రూస్ (49) రాష్ట్రం విడిపోతే కేసీ కెనాల్ కింద మాకున్న రెండెకరాల పొలానికి నీళ్లు రావని ఆందోళనకు గురై పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అది తట్టుకోలేక మా అమ్మ ఆనందమ్మ అనారోగ్యంతో అస్పత్రిపాలయింది. అప్పటినుంచి మేము పంటలు సాగు చేసుకోలేక అప్పులపాలయ్యాం. కూలీ పనులతో వచ్చిన సొమ్ము తిండిగింజలకే సరిపోతుంది. అమ్మ ఆరోగ్యం బాగాలేదు. నాన్న ఉన్నప్పుడు అన్నీ తానే చూసుకునేవాడు.  ఆయన పోయినప్పటినుంచి ఇబ్బందులు పడుతున్నాం. పాత అప్పులకు తోడు కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోంది. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలకు మా ఉసురు తగలక మానదు. రాష్ట్రం విడిపోకపోతే మానాన్న మాతో ఉండే వాడు. మా కుటుంబం సంతోషంగా ఉండేది’

 

 రెండుగా చూడలేక.. పోయాడు

 బతుకు దెరువు కోసం మా ఆయన ఏపూరి రమణ మమ్మల్ని తీసుకుని ఐదేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లాడు. బాచుపల్లిలోని ఒక ప్రైవేటు ఏజెన్సీలో సూపర్‌వైజర్‌గా పనిచేసేవాడు. తెలంగాణ వస్తుందని.. ఇక్కడ పని చేస్తున్న సీమాంధ్ర ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు వెంటనే వెళ్లిపోవాలని కంపెనీ యాజమాన్యం పలుమార్లు ఒత్తిడి చేసింది. ఈ విషయంపై ఇంటికి వచ్చి నాతో చెప్పుకొని బాధపడేవాడు. గత జులై 9వ తేదీన రాష్ట్రం విడిపోకూడదని కోరుకుంటూ తిరుపతి వెంకటేశ్వరస్వామికి మొక్కుకునేందుకు నేనూ..నాభర్త ఇద్దరు పిల్లలను తీసుకొని తిరుపతి బయలుదేరాం. కాలినడకన తిరుమల మెట్లు ఎక్కుతుండగా మార్గమధ్యంలోనే గుండెపోటు వచ్చి మృతి చెందాడు. అప్పటినుంచి ఇంటి పెద్దదిక్కును కోల్పోయి మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. విభజనకు కారకులైనవారు మూల్యం చెల్లించుకుంటారు.

- రాధమ్మ, రామళ్లకోట(వెల్దుర్తి), కర్నూలు జిల్లా

 

 ఈ పాపం ఊరికే పోదు..

 కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయం మా కుటుంబానికి పెద్దదిక్కు లేకుండా చేసింది. నా భర్త రేగళ్ల శ్రీనివాసరావు విజయవాడ కార్పొరేషన్ ప్రజారోగ్య విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసేవారు. మొదటి నుంచి సమైక్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఉద్యమంలో తిరిగి అస్వస్థతకు గురైన ఆయన రోజూ ఇంటికొచ్చి రాష్ట్ర విభజన గురించి బాధపడేవారు. ఒకరోజు ఉద్యమంలో పాల్గొని ఇంటికొచ్చి టీవీలో రాష్ట్ర విభజనపై వస్తున్న కార్యక్రమాలను చూసి ఉద్వేగానికి గురయ్యారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించారు. నాకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ప్రస్తుతం చదువుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి మాకు ఇంతవరకు ఏ బెనిఫిట్స్ లభించలేదు. ఆయన మరణానంతరం ప్రభుత్వం నుంచి రావాల్సిన పీఎఫ్, గ్రాట్యూటీ కూడా కార్పొరేషన్ అధికారులు ఇవ్వలేదు. పిల్లల ఫీజులు కట్టలేక, ఇంటిపై ఉన్న బ్యాంకు రుణం తీర్చలేక ఎన్నో అవస్థలు పడుతున్నాను. విభజనకు కారణమైన కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీల  పాపం ఊరికే పోదు.                                 

- రేగళ్ల రాధ, విద్యాధరపురం (విజయవాడ)

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top