
‘జయ’ భేరి మోగించేదెవరు?
ఈసారి ఉగాది ఎన్నికల రుతువులో వస్తోంది. జయ నామ సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో ఫలితాలు తమకు ‘జయ’ప్రదంగా ఉండాలని బరిలోకి దిగిన నేతలంతా ఎవరికి వారే ఆశిస్తున్నారు.
ఈసారి ఉగాది ఎన్నికల రుతువులో వస్తోంది. జయ నామ సంవత్సరంలో జరిగే ఎన్నికల్లో ఫలితాలు తమకు ‘జయ’ప్రదంగా ఉండాలని బరిలోకి దిగిన నేతలంతా ఎవరికి వారే ఆశిస్తున్నారు. జయాపజయాలను నిర్ణయించేది ఓటరే అయినా, ఓటరు అభీష్టాన్ని నిర్ణయించడంలో గ్రహగతులూ పాత్ర పోషిస్తాయి. ఎన్నికల వేళ ద్వాదశ రాశులు, వాటి స్వభావాలు, జయ నామ సంవత్సరంలో వాటి సానుకూలతలు, ప్రతికూలతలు, ఆయా రాశుల్లో జన్మించిన ప్రముఖ నేతల గురించి విహంగ వీక్షణం...
మేషం
ఈ రాశి వారికి ఆలోచనలు స్థిరంగా ఉండవు. తర చూ నిర్ణయాలు మార్చుకునే స్వభావం కలిగి ఉంటారు. పట్టుదల, కోపం ఎక్కువ. ఎటువంటి కార్యాన్నైనా సాధించాలన్న దృఢచిత్తంతో ముందుకు సాగుతారు. పదవులు, ఉన్నత హోదాలు కలిగి ఉంటారు. సొంతంగా నిర్ణయాలు తీసుకునేందుకు తటపటాయిస్తారు. ప్రతి విషయంలోనూ దూరదృష్టి కలిగి ఉంటారు. ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉంటుంది. నాయకులుగా, అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులుగా రాణిస్తారు. బీజేపీ అగ్రనేత అద్వానీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ రాశిలోకి వస్తారు. ఈ ఏడాది వీరికి గురుబలం తక్కువే. రాశిపై శని, రాహువుల ప్రభావం వల్ల ప్రత్యర్థుల నుంచి విమర్శలు, ఒత్తిడులు. మానసిక సంఘర్షణకు లోనవుతారు. అందిన అవకాశాలు సంతృప్తినీయవు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి. జూలై నుంచి కొంత అనుకూలం.
వృషభం
వీరు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. విపత్కర సమయాల్లో కూడా భయపడక ఆత్మస్థైర్యం కలిగి ఉంటారు. మృదుస్వభావం, ఓర్పు, సహనం కలిగి ఉంటారు. ఇతరులకు సాయపడే తత్వం. ధనసంపదలకు లోటు ఉండదు. వృథా ఖర్చులకు అంగీకరించరు. హాస్య, అలంకారప్రియులై ఉంటారు. స్వచ్ఛమైన ఉచ్ఛారణ, వాక్చాతుర్యం కలిగి ఉంటారు. మంచి భవనాలు, వాహనాలు కలిగి ఉంటారు. సంగీత కళాకారులు, న్యాయవాదులు, అధ్యాపకులుగా రాణిస్తారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, బీజేపీ నేతలు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, ‘ఆప్’ అధినేత కేజ్రీవాల్ ఈ రాశికి చెందుతారు. వీరికి ప్రజాదరణ పెరుగుతుంది. కార్యజయం. గురుబలం వల్ల తలచిన పనుల్లో విజయం. ప్రత్యర్థులపై పట్టు సాధిస్తారు.
మిథునం
మృదుస్వభావం, నమ్రత , విధేయత కలిగి ఉంటారు. పెద్దలంటే గౌరవంతో పాటు, పిల్లలపై అపార ప్రేమ చూపుతారు. ప్రతి విషయంలోనూ సన్నిహితుల సూచనలు, సలహాలు పాటించడం అలవాటు. వ్యాపార దృక్పథంతో వ్యవహరిస్తారు. రాజకీయాలు, వ్యాపారాలలో రాణిస్తారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ సీఎం కిరణ్, బీజేపీ నేత కిషన్‌రెడ్డి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఈ రాశికి చెందుతారు. వీరికి ఈ ఏడాది అనుకూలం. ప్రత్యర్థులతో పోరులో విజయం సాధించగలరు. రాజకీయాల్లో చక్రం తిప్పుతారు.
కర్కాటకం
ఈ రాశి వారు పొగడ్తలంటే ఇష్టపడతారు. సున్నిత మనస్కులు. అలంకరణలపై ఎక్కువగా దృష్టి పెడతారు. మంచి రూపంతో పాటు, ఇతరులకు సహాయపడతారు. అయితే ఆలోచనలు స్థిరంగా ఉండవు. ప్రయాణాలంటే బహు ఇష్టం. చంద్రుడు అధిపతి అయిన ఈ రాశి వారు సౌమ్య గుణం కలిగి ఉంటారు. వీరు రాజకీయాలు, వ్యాపారాలు, న్యాయవాద, జలసంబంధమైన ఉద్యోగాలలో ఎక్కువగా రాణిస్తారు. అలాగే, ఆధ్యాత్మిక భావాలు సైతం ఎక్కువగా ఉంటాయి. ప్రధాని
మన్మోహన్ సింగ్ ఈ రాశిలోకి వస్తారు.
సింహం
ఆకట్టుకునే రూపంతో పాటు విచక్షణాజ్ఞానం కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇతరులకు సహాయపడడంలో ముందుంటారు. స్నేహానికి ప్రాణం ఇస్తారు. ఉష్ణ సంబంధిత రుగ్మతలతో బాధపడతారు. కఠిన నిర్ణయాలలో వెనుకడుగు వేయరు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమించే తత్వం. వీరు రాజకీయాలు, పరిశోధనలు, వ్యవసాయం, ఉద్యోగాలలో రాణిస్తారు. వ్యాపారాలలోనూ ప్రవేశం ఉంటుంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ఏఐఏడీఎంకే అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలిత ఈ రాశికి చెందినవారు. వీరికి విశేష కాలమనే చెప్పాలి. కార్యోన్ముఖులై అనుకున్న విజయాలు సొంతం చేసుకుంటారు. కీలక వ్యక్తులుగా మారే సూచనలు. అయితే ఇంటిపోరు తప్పదు.
కన్య
సౌమ్యగుణంతో పాటు, ప్రతివిషయాన్ని వ్యాపార దృక్ఫథంతో ఆలోచిస్తారు. నిర్ణయాలలో ఎటూ తేల్చుకోలేరు. ఇతరులపై ఆధారపడతారు. భూదేవికి ఉన్నంత ఓర్పు, సహనం కలిగి ఉండడం వీరి ముఖ్య లక్షణం. మంచి ఉచ్ఛారణతో పాటు, శత్రువులను సైతం ఆకట్టుకునే నైపుణ్యం ఉంటుంది. బుధుడు ఈ రాశికి అధిపతితో పాటు, ఈ రాశిలో ఉన్నప్పుడు ఆ గ్రహానికి ఉచ్ఛస్థితి కావడం వల్ల వ్యాపారాలలో బాగా రాణిస్తారు. అలాగే, శుభరాశి అయి ఉండి బుధుడు, రవి కలిసి ఉన్న జాతకులు రాజకీయాల్లో విశేషంగా రాణిస్తారు. సీపీఎం నేత ప్రకాశ్‌కారత్, యూఐడీఏఐ చైర్మన్ నందన్ నీలేకని, బీజేపీ నాయకురాలు సుష్మా స్వరాజ్, రామ్‌విలాస్ పాశ్వాన్ ఈ రాశిలోకి వస్తారు. శని, రాహు, కేతువుల ప్రభావం వల్ల సమస్యలు ఎదురైనా గురుబలం కారణంగా అధిగమిస్తారు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి. మిత్రులే శత్రువులుగా మారే అవకాశం లేకపోలేదు.
తుల
వీరికి ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. ఇతరులను నొప్పించకుండా కార్యాలలో విజయం సాధించడం వీరి ప్రత్యేకత. చిన్నపాటి విమర్శను కూడా తట్టుకోలేరు. ఒక విధంగా చెప్పాలంటే సున్నిత మనస్కులే. దీర్ఘకాలిక ప్రయోజనాలే లక్ష్యంగా వీరి ఆలోచనలు ఉంటాయి. శత్రువులను సైతం ఆకట్టుకునే నైపుణ్యం ఉంటుంది. తరచూ ప్రయాణాలంటే ఇష్టపడతారు. కళాకారులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు, సలహాదారులుగా బాగా రాణిస్తారు. రాజకీయ ప్రవేశం ఉన్నా చొరవ తక్కువ కావడం వల్ల అంతగా ప్రయోజనం పొంద డం కష్టం. కేంద్ర మంత్రి చిరంజీవి, సీపీఎం నేత బీవీ రాఘవులు ఈ రాశిలోకి వస్తారు. వీరికి ఎదురీత తప్పని పరిస్థితి. ప్రత్యర్థుల వ్యూహాలపై అప్రమత్తంగా ఉండాలి. ఇంటా బయటా వ్యతిరేకతతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. బాగా కష్టపడాల్సిన సమయం. శని, రాహువు, కుజుల ప్రభావం వల్ల ఒత్తిడులు పెరుగుతాయి.
వృశ్చికం
ఎంతటి పనినైనా సాధించాలన్న పట్టుదల కలిగి ఉంటారు. కోపస్వభావంతో పాటు, ధైర్యం ఎక్కువ. చెప్పదలచుకున్నది ముఖంమీదే చెప్పడం వీరి లక్షణం. చూడగానే ఆకట్టుకునే రూపంతో పాటు, ఎవరికీ తలవంచని మనస్తత్వం. వీటి వల్ల కొన్ని సందర్భాలలో చిక్కులు సైతం ఎదుర్కొంటారు. స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు. విశేష ధనసంపదలు కలిగి ఉంటారు. రాజకీయాలు, వ్యవసాయం, పరిశోధనలు, ఉన్నత ఉద్యోగాలలో రాణిస్తారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీహార్ సీఎం నితీశ్‌కుమార్, సీపీఐ నేత నారాయణ ఈ రాశికి చెందుతారు. శని, రాహువుల ప్రభావంతో పాటు, గురుబలం లేకపోవడం వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ప్రత్యర్థులు వీరిపై ఆరోపణలు గుప్పిస్తారు. విచిత్రంగా ఒక కీలక మలుపు వీరి నాయకత్వాన్ని పటిష్టం చేసే వీలుంది.
ధనుస్సు
వీరు మంచి భవనాల్లో నివసించడంతో పాటు, పరిపూర్ణమైన వాహన సౌఖ్యం కలిగి ఉంటారు. మంత్రులుగా, న్యాయవాదులుగా, పారిశ్రామికవేత్తలుగా, ఉన్నత ఉద్యోగులుగా ఎక్కువగా రాణిస్తారు. రాజకీయాల పట్ల మక్కువ చూపుతారు. ఎంతటి సమస్య ఎదురైనా చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. అయితే ఎప్పుడేం చేస్తారో తెలియని అనిశ్చిత ధోరణిలో ఉంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం, ప్రచారర్భాటం కలిగి ఉంటారు. త్వరగా అసహనానికి లోనవుతారు. జీవితంలో అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో శ్రమించడం వీరి లక్షణం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ ఈ రాశికి చెందుతారు.
(గమనిక... కొందరి జన్మ నక్షత్రాలు,
మరి కొందరి నామ నక్షత్రాల ఆధారంగా పరిశీలించడమైనది)
మకరం..
హడావిడి మనస్తత్వం. ఎదుటవారిని చూడగానే మంచిచెడ్డలు బేరీజు వేయగలరు. కోప స్వభావం ఉన్నా వెంటనే చల్లబడతారు. ఎక్కువగా శ్రమను నమ్ముకుని అభివృద్ధిలోకి వస్తారు. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తేగానీ నిర్ణయాలు తీసుకోరు. ప్రయాణాలంటే ఇష్టపడతారు. వాతతత్వ శరీరం వ ల్ల తరచూ జలుబు వంటి రుగ్మతలతో బాధపడతారు. క ర్షకులు, పారిశ్రామికులుగా ఎక్కువగా రాణిస్తారు. రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నా రాణించే అవకాశాలు తక్కువ. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి, పవన్ కళ్యాణ్, వరుణ్ గాంధీ ఈ రాశిలోకి వస్తారు. కొంత వ్యతిరేకత ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగితే విజయాలు సాధిస్తారు. అయితే ప్రత్యర్థులు ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల వీరు రాజీమార్గాన్ని అనుసరించక తప్పని పరిస్థితి ఉంటుంది.
కుంభం
స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఇతరులను నొప్పించకుండా పనులు చక్కదిద్దుకుంటారు. తరచూ ఉదర సంబంధిత, జలుబు వంటి రుగ్మతలతో బాధపడతారు. ఇతరుల ఆలోచనలు పసిగట్టడంలో దిట్ట. పొగడ్తలకు లొంగిపోవడం వీరి ప్రత్యేకత. తొందరపాటు మాటలతో కొన్ని సమస్యలు కొనితెచ్చుకుంటారు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. కార్మికులు, ఉద్యోగులు, పరిశోధకులుగా ఎక్కువగా రాణిస్తారు. కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్, బొత్స సత్యనారాయణ ఈ రాశికి చెందుతారు. గురుబలం కొంత వీరికి సహకరిస్తుంది. అయితే ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. అష్టమ కుజుని వల్ల మానసిక అశాంతి, వివాదాలు. ఇంటాబయటా వ్యతిరేకత ఎదుర్కొంటారు.
మీనం
మాటల చాతుర్యంతో ఎంతటివారినైనా ఆకర్షిస్తారు. రాగద్వేషాలకు దూరంగా ఉంటారు. హాని చేయాలనుకున్న వారికి కూడా సహాయపడడం వీరి ప్రత్యేకత. ఆధ్యాత్మిక భావాలు ఎక్కువగా ఉంటాయి.
సౌమ్యులుగా పేరుపొందుతారు. సమస్యలు ఎన్ని ఎదురైనా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి పరిష్కరించుకునే తత్వం కలిగి ఉంటారు. పండి తులు, కళాకారులు, రాజకీయ నాయకులుగా ఎక్కువగా రాణిస్తారు. టీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ఈ రాశికి చెందుతారు. అష్టమ శని, రాహు దోషాలు ఉన్నా గురు బలం వీరికి తోడ్పడుతుంది. అయితే కొన్ని సమస్యలు అనూహ్యంగా ఎదురై చికాకు పరుస్తాయి. కొన్ని సందర్భాల్లో ముఖ్యమైన నిర్ణయాలలో వెనుకంజ వేయాల్సిన పరిస్థితి ఉంటుంది.
బంగ్లా నంబర్ 18..
ఇదేమీ భూత్‌బంగ్లా కాదు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో మంత్రుల నివసించే సివిల్‌లైన్స్‌లో ఉన్న ఈ భవంతిలో అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. అయినా, దీని పేరు చెబితేనే రాజస్థాన్ మంత్రులు వణుకుతారు. గడచిన ఇరవయ్యేళ్లలో ఇందులో నివసించిన మంత్రులెవరూ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఎన్నిక కాలేదు. పైగా, నానా ఇక్కట్లు ఎదుర్కొన్నారు. తాజా ఉదాహరణ తీసుకుంటే... గత గెహ్లాట్ కేబినెట్‌లో పాడి, పశుపోషణ శాఖ మంత్రిగా పనిచేసిన బాబూలాల్ గౌర్ అత్యాచారం కేసులో అరెస్టయ్యారు. ఇందులో నివసించే మంత్రులకు పదవిలో ఉండగా చిక్కులు, ఆ తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తప్పదనే నమ్మకం ఏర్పడటంతో రాజస్థాన్ మంత్రులు ఈ బంగ్లా మొహం చూసేందుకైనా ఇష్టపడటం లేదు.