దేశంలో పూర్తి మెజారిటీతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారని, నరేంద్రమోడీ లాంటి బలమైన నాయకుడివల్లే ఇది సాధ్యమైందని ఎన్డీయే భాగస్వామ్యపక్షం శివసేన చెప్పింది.
దేశంలో పూర్తి మెజారిటీతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటం 30 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారని, నరేంద్రమోడీ లాంటి బలమైన నాయకుడివల్లే ఇది సాధ్యమైందని ఎన్డీయే భాగస్వామ్యపక్షం శివసేన చెప్పింది. భయంకరమైన పీడకల తర్వాత మంచి కల వచ్చి, అది నిజమైనట్లు ఉందని, భారతీయులు పూజిస్తున్న దేవుళ్లు, దేవతలు అంతా ఏకగ్రీవంగా దేశప్రజలను ఈ ఎన్నికల ఫలితాలతో దీవించినట్లు అయ్యిందని తమ అధికార పత్రిక 'సామ్నా'లో రాసిన సంపాదకీయంలో శివసేన పేర్కొంది. 1977లో జనతా పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సాధించిన విజయం కంటే ఇది పెద్దదని తెలిపింది.
దేశానికి స్వేచ్ఛ కల్పించేందుకు మోడీ వచ్చారని, ఆయన వెనక దేశమంతా బ్యాలట్ రూపంలో వెంటనిలిచిందని అన్నారు. ఆ ధాటికి మహావృక్షాలు సైతం కూకటివేళ్లతో పెకలించుకుపోయాయని, దాంతో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రస్తుతానికిది మన్మోహన్ సర్కారు ఓటమే అయినా.. గాంధీ కుటుంబానికి అతిపెద్ద నష్టమని, రాబోయే పరిణామాల నుంచి వాళ్లు తప్పించుకోవడం అంత సులభం కాదని ఆ సంపాదకీయంలో పేర్కొన్నారు.