ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్).. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకు ఇదొకటి ఉందని చాలామందికి తెలియదు.
* సీఎంఆర్‌ఎఫ్‌ను ఆపన్న హస్తంగా మార్చిన వైఎస్సార్
* వైఎస్ పాలనలో లక్షా ముప్పైవేల మందికి ఆర్థిక సాయం
* బాబు హయాంలో కేవలం 15వేల మందికే సాయం
(ఎల్. రఘురామిరెడ్డి): ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్‌ఎఫ్).. డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవరకు ఇదొకటి ఉందని చాలామందికి తెలియదు. తెలిసినా.. ఆ నిధి నుంచి సహాయం పొందడం కోసం ప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలన్న భయం. కానీ వైఎస్ సీఎం అయ్యాక ఆ పరిస్థితి మారింది. సిఫారసు లేఖలు లేకుండానే.. సీఎంఆర్‌ఎఫ్ నుంచి సాయం అందేలా చర్యలు తీసుకున్నారు. మద్యం విక్రయాల ద్వారా వచ్చే రాబడిపై రెండు శాతాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి జమయ్యేలా చట్టం చేశారు. ఫలితంగా అయిదేళ్ల వైఎస్ పాలన(2004-09)లో సీఎంఆర్‌ఎఫ్ నుంచి దాదాపు లక్షాముప్పై వేలమంది రూ. 441.41 కోట్ల ఆర్థిక సాయం పొందారు. దేశంలోనే అత్యధిక మొత్తంలో నిధులు సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ పేరుగాంచింది. చంద్రబాబు పాలనలోని చివరి అయిదేళ్లలో(1999-2004)లో కేవలం 15 వేల మందికి ఈ సాయం అందింది. వారికందిన సాయం రూ. 36 కోట్లు మాత్రమే.
అరకొరగా మంజూరు... అదీ సిఫారసులుంటేనే!
- చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఆర్థికసాయం కావాలంటే ప్రజాప్రతినిధుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. ఎమ్మెల్యేనో, ఎంపీనో, మంత్రినో బతిమలాడుకొని వారి ద్వారా వినతిపత్రం సమర్పించినా కచ్చితంగా సాయం వస్తుందనే భరోసా ఉండేది కాదు.
- ఒకవేళ ఈ సిఫార్సుల వల్ల మంజూరైనా అది అరకొర మొత్తమే. అప్పోసప్పో చేసి ఖరీదైన జబ్బులకు మూడు నాలుగు లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకున్న వారికి పాతికవేలు మంజూరు చేస్తే అదే గొప్ప అన్నట్లుండేది.
- కీలక భూమిక నిర్వహించే మంత్రులు, శాసనసభ్యులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సిఫారసు లేఖలున్నవారికే ఎక్కువ మొత్తం మంజూరయ్యేది.
- దరఖాస్తు చేశాక అది మం జూరు కావడానికి కూడా రెండు3 నెలలకు పైగా పట్టేది.
- అత్యవసర వైద్యం కావాలంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ (ఎల్‌ఓసీ) మాటే లేదు. అందువల్ల నిరుపేదలైనా అప్పు చేసి వైద్యం చేయించుకోవాల్సిందే. ఈ నిధి (ఎల్‌ఓసీ) కోసం ఎ దురుచూస్తే రోగుల ప్రాణాలకే ముప్పుగా ఉండేది.
- సిఫార్సులు లేని అభాగ్యులు చంద్రబాబు పాలనా కాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి మీద ఆశపెట్టుకోవడమన్నదే అత్యాశ అన్న పరిస్థితి ఉండేది. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి చంద్రబాబు నాయుడు తన చివరి అయిదేళ్ల పదవీ కాలం(1999 - 2004)లో 15 వేల మందికి 36 కోట్ల రూపాయలు మాత్రమే మంజూరు చేశారు.
సీఎంగా రికార్డు స్థాయిలో నిధుల మంజూరు
- వైఎస్సార్ సీఎంగా అధికార బాధ్యతలు చేపట్టిన స్వల్పకాలంలోనే ముఖ్యమంత్రి సహాయనిధిలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు.
- అప్పటి వరకూ పెద్దల సిఫార్సులున్న వారికే పరిమితమైన సీఎం సహాయనిధి ఒక్కసారిగా పేదల పాలిట పె‘న్నిధి’గా మారింది.
- దరఖాస్తు చేసుకున్న వారందరికీ నిధులు మంజూరు చేయడం ప్రారంభించారు.
- రాష్ట్ర సచివాలయంలోనే కాకుండా తన అధికార నివాసంలో కూడా దరఖాస్తులు స్వీకరించే విధానాన్ని తెచ్చారు.
- వైఎస్ రాజశేఖరరెడ్డి తన అయిదేళ్ల పదవీకాలంలో సీఎంఆర్‌ఎఫ్ నుంచి లక్షాముప్పై వేలమందికి పైగా రూ. 441.41 కోట్ల ఆర్థిక సాయం మంజూరు చేశారు. చంద్రబాబు తన పాలనలోని చివరి అయిదేళ్ల కాలంలో మంజూరుచేసిన మొత్తంతో పోల్చితే ఇది 12 రెట్లు ఎక్కువ.
- ప్రజాప్రతినిధులు (ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల) సిఫార్సుల ఆధారంగా వచ్చిన వినతులకు సంబంధించి 86,468 మందికి రూ. 279.50 కోట్ల రూపాయల ఆర్థికసాయం మంజూరు చేశారు.
- ఎవరి సిఫార్సులు లేకుండా నేరుగా తనను కలిసి ఆర్థికసాయం కోరిన 43,532 మందికి రూ. 156.50 కోట్ల రూపాయల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేశారు.
- పేదరికం కారణంగా వైద్యం చేయించుకోలేక అవస్థలు పడుతున్న ఎందరికో సీఎంఆర్‌ఎఫ్ కింద వైద్యసాయం లభించింది.
- హఠాత్తుగా కుటుంబ యజమానిని కోల్పోయి పూట గడవక కష్టాలు పడుతున్న ఎన్నో నిరుపేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి సాయం అందించారు.
- పేద రోగుల కష్టాలు తెలిసిన వైద్యునిగా, డాక్టరు ముఖ్యమంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణల వల్ల ఎందరో పేదలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం పొంది వైద్యం చేయించుకుని ఆరోగ్యవంతులయ్యారు.
- సీఎంఆర్‌ఎఫ్ నుంచి నిధుల మంజూరులో రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిన ఘనత వైఎస్‌కే దక్కింది. ఏ పార్టీవారు సిఫారసు చేసినా వినతి అందిన వెంటనే ఆర్థిక సాయం మంజూరు చేశారన్న ప్రశంసను వైఎస్ అందుకున్నారు.
జగన్‌దీ తండ్రి బాటే
తండ్రి రాజశేఖరరెడ్డి ఆదర్శంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి కూడా పేదల పక్షపాతిగా అమలుకు వీలైన అనేక సంక్షేమ పథకాలపై ఎంతో కసరత్తు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లో రైతులకు ఉచిత విద్యుత్తు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటి పలు సంక్షేమ కార్యక్రమాలు పక్కాగా అమలు చేయగా నేడు జగన్ అదే తరహాలో నిపుణులతో సమీక్షించి డ్వాక్రా మహిళల రుణాల రద్దు, విద్యార్థుల చదువుల కోసం అమ్మ ఒడి, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే రేషన్‌కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ లాంటివి కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించారు. ఆరోగ్యశ్రీని మళ్లీ వైఎస్ హయాంలోలా పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవడంతోపాటు తన తండ్రి చేపట్టిన ప్రతి పథకాన్ని పక్కాగా అమలు చేస్తానని హామీ ఇస్తున్నారు.
రోశయ్య, కిరణ్‌ల పాలనలో..
రోశయ్య హయాంలో సీఎంఆర్‌ఎఫ్ నిధుల మంజూరు మళ్లీ చంద్రబాబు పాలన తీరును తలపించింది. రోశయ్యతో పోలిస్తే కిరణ్‌కుమార్ రెడ్డి కాస్త నయమైనా.. వైఎస్ ప్రణాళికాబద్ధంగా నిధులు వచ్చేలా శాశ్వత ఏర్పాటు చేయడంవల్లే ఆయన నిధులు విడుదల చేయగలిగారు.
ఆరోగ్యశ్రీకి మూలమిదే..
సీఎంఆర్‌ఎఫ్‌పై విశ్లేషణే అల్పాదాయ వర్గాల వారికి ఉచిత వైద్యం అందించే ఆరోగ్యశ్రీ పథకం రూపకల్పనకు దారితీసింది. దీనిని చాలామంది వినియోగించుకోకపోవడం వైఎస్‌ను ఆలోచింపజేసింది. సీఎంఆర్‌ఎఫ్ కింద మంజూరు చేసిన నిధులు చాలక చాలామంది వైద్యం చేయించుకోలేకపోతున్నారని, అందువల్లే నిధులు వెనక్కు వచ్చాయని తెలుసుకున్నారు. మారుమూల ప్రాంతాల వారు ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవడం ఖర్చుతో, శ్రమతో కూడుకున్న పని అని అర్థం చేసుకున్నారు. దాంతో నిరుపేదలందరికీ ఉచితంగా వైద్యసేవలందించే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారు.
నిధుల కొరత రాకుండా ప్రణాళిక
వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో సీఎం సహాయనిధి నుంచి ఆపన్నులకు, ఖరీదైన వైద్యం అవసరమైన వారికి భారీగా ఆర్థికసాయం మంజూరు చేయడంతో సరిపెట్టలేదు. భవిష్యత్తులో ఎవరు ప్రభుత్వంలో ఉన్నా ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థికసాయం చేసేందుకు నిధుల కొరత లేకుండా మద్యం విక్రయాల ద్వారా వచ్చే రాబడిపై రెండు శాతాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి జమయ్యేలా చట్టం చేశారు. దీంతో ప్రస్తుతం నెలకు సగటున రూ. 46 కోట్ల లెక్కన ఏటా రూ. 552 కోట్లు ముఖ్యమంత్రి సహాయనిధికి సర్‌ఛార్జి రూపంలో వస్తోంది. అలాగే సేవాభావంతో సీఎం సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వాలంటూ వైఎస్ ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వచ్చింది.
ఆరోగ్యశ్రీకి ప్రతి మూడు నెలలకు రూ. 106 కోట్ల చొప్పున ఏటా రూ. 424 కోట్లు సీఎంఆర్‌ఎఫ్ నుంచి క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నారు. అయినప్పటికీ రూ. 370కోట్ల మేరకు సీఎంఆర్‌ఎఫ్ ఖాతాలో నిధులు ఉన్నాయి. సహాయం కోసం వచ్చిన దరఖాస్తులను మొత్తం పరిష్కరిస్తే సుమారు రూ. 40 కోట్లు విడుదల చేసే అవకాశం ఉంది. ఇదిపోను మిగిలే 330 కోట్లను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పంచేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదంతా వైఎస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చేసిన ఏర్పాటు ఫలితమే.
‘మాట’ ఇచ్చిన వైఎస్...
హుజూరాబాద్ పట్టణానికి చెందిన పోగు శ్రీనివాస్‌కు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు అంజలికి పుట్టుకతోనే వినికిడి లోపం తలెత్తింది. మాట కూడా రాలేదు. ఆస్పత్రుల చుట్టూ తిరిగితే.. ‘క్లాక్లియర్ ఇంప్లాంట్’గా వైద్యులు నిర్ధారించారు. వైద్యానికి రూ.6లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పగానే ఆయన కుప్పకూలిపోయాడు. సాధారణ దర్జీగా జీవనం సాగించే శ్రీనివాస్‌కు అది భరించలేని మొత్తమే. ఆసమయంలో శ్రీనివాస్‌కు వైఎస్ ప్రభుత్వం భరోసా ని చ్చింది. 2006లో శ్రీనివాస్ వైఎస్‌ను కలిసి తన కూతురు వ్యాధి గురించి చెప్పాడు. ఆ చిన్నారి తలపై చేయివేసి ఆదుకుంటానని వైఎస్ మాట ఇచ్చారు. ఏడాదిలోపే సీఎం కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. హైదరాబాద్‌లోని వాసవి ఈఎన్‌టీ ఆస్పత్రిలో 2007లోఅంజలికి శస్త్రచికిత్స చేసి ప్రత్యేక మిషన్ ను అమర్చారు. అప్పటి నుంచి అంజలి వినగలుగుతుంది... మాట్లాడుతుంది. ఆరోగ్యశ్రీ కింద సుమారు రూ.7లక్షలు ప్రభుత్వం ఆస్పత్రికి మంజూరు చేసింది. అంజలి ఇప్పుడు హుజూరాబాద్‌లోని మాంటిస్సోరి పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. తనకు కొత్త జీవితాన్నిచ్చిన వైఎస్ ఆకస్మిక మరణంతో ఆ కుటుంబ మంతా ఇంటిపెద్దను కోల్పోయినట్టు రోదించారు.
- న్యూస్‌లైన్, హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా.