సమరానికిసిద్ధం | CPM party announced candidates for municipality | Sakshi
Sakshi News home page

సమరానికిసిద్ధం

Mar 27 2014 1:49 AM | Updated on Jul 11 2019 9:08 PM

సార్వత్రిక ఎన్నికల వేడి రగులుకుంటోంది. పొత్తుల చర్చలు, అభ్యర్థుల ఎంపికలో రాజకీయపార్టీలు మునిగిపోయాయి.

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సార్వత్రిక ఎన్నికల వేడి రగులుకుంటోంది. పొత్తుల చర్చలు, అభ్యర్థుల ఎంపికలో రాజకీయపార్టీలు మునిగిపోయాయి. ఈనేపథ్యంలో సీపీఎం ఒకడుగుముందుకు వేసి ఆ పార్టీ తరఫున జిల్లాలోని అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు పోటీచేసే అభ్యర్థులను ప్రకటించింది. మొదటి నుంచీ అనుకుంటున్న విధంగానే.... గత ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయిన పాలేరు, మధిర, భద్రాచలం అసెంబ్లీ స్థానాల్లో పోటీలో ఉంటున్నట్టు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రకటించారు.

 పాలేరుకు పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, మధిరకు లింగాల కమల్‌రాజ్, భద్రాచలానికి సున్నం రాజయ్యలను
  అభ్యర్థులుగా ప్రకటించారు. ఖమ్మం పార్లమెంటు స్థానానికి మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ అఫ్రోజ్‌సమీనా పోటీలో ఉంటారని చెప్పారు. అయితే, ఇతర పార్టీలతో కుదిరే పొత్తులను బట్టి పోటీచేస్తున్న స్థానాల్లో మార్పులుండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అభ్యర్థులను ప్రకటించామే కానీ... ఇతర పార్టీలతో పొత్తులు కుదుర్చుకునే విషయంలో అవసరమైతే సర్దుకుపోవాల్సి వస్తుందని, ఆ విషయంలో పార్టీ అగ్రనాయకత్వంలో స్పష్టత ఉందని పార్టీ నేతలంటున్నారు.

 ప్రత్యక్ష పోరు నుంచి  తమ్మినేని రిటైర్మెంటేనా?
 జిల్లా రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఇక ప్రత్యక్ష పోరు నుంచి విరమించుకున్నట్టేననే చర్చ జరుగుతోంది. పార్టీ ప్రకటించిన మూడు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి పోటీకి దిగేవారి జాబితాలో ఆయన పేరు లేదు. గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన మూడు అసెంబ్లీ స్థానాల్లో రెండు చోట్ల పాత అభ్యర్థులకే మళ్లీ అవకాశం ఇచ్చారు. కానీ తమ్మినేని పోటీచేసిన పాలేరు నుంచి మాత్రం ఆయన పేరు ఖరారు చేయలేదు.

 పార్టీ జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ అక్కడి నుంచి బరిలో ఉంటారని ప్రకటించారు. దీంతో తమ్మినేని వీరభద్రం ఈసారికి ఎన్నికలలో పోటీచేయడం లేదని స్పష్టమయింది. అయితే, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న తమ్మినేని సేవలను ఇక పూర్తిగా పార్టీకే వినియోగించుకోవాలని కేంద్ర నాయకత్వం యోచిస్తోంది.  ఈ పరిస్థితుల్లో తమ్మినేని ఇక పార్టీకే పూర్తిగా అంకితమవుతారా... మళ్లీ ప్రత్యక్ష బరిలో దిగి సై అంటారా అన్నది వేచిచూడాల్సిందే!

 మిగిలిన పార్టీలు కూడా....
 సీపీఎం అభ్యర్థులను ప్రకటించడంతో ఇప్పుడు అందరి దృష్టీ మిగిలిన పార్టీలపై పడింది. వైఎస్సార్ సీపీ తరఫున ఇప్పటికే ఖమ్మం పార్లమెంటుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరును ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించేశారు. అసెంబ్లీ అభ్యర్థులను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.  సీపీఐ అయితే అభ్యర్థులను ఖరారు చేసినా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇక కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపులకు సంబంధించి చర్చలన్నీ ఢిల్లీ కేంద్రంగా సాగుతున్నాయి. పొత్తులుంటే ఏ స్థానాలుంటాయి... ఏ స్థానాలు పోతాయి అన్న దానిపై కూడా స్పష్టత లేదు.

 స్వయంగా డీసీసీ అధ్యక్షుడు వనమా వెంకటేశ్వరరావు కూడా గందరగోళంలో ఉన్నారు. సిట్టింగ్‌లందరికీ మళ్లీ అవకాశం వస్తుందా అన్న దానిపై కూడా స్పష్టత లేదు. టీ డీపీలో కూడా అధికారికంగా అభ్యర్థులను ప్రకటించకపోయినా... ఖమ్మం ఎంపీ స్థానం నుంచి మళ్లీ నామా నాగేశ్వరరావే బరిలో ఉంటారని పార్టీ శ్రేణులంటున్నాయి. ఇక, మరో ముఖ్య నాయకుడైన తుమ్మల నాగే శ్వరరావు ఈసారి పాలేరు వెళతారని అంటున్నారు. ఈ మేరకు తన ప్రతిపాదనను చంద్రబాబు వద్ద ఉంచినట్టు తుమ్మల వర్గీయులు చెపుతున్నారు. మిగిలిన స్థానాల్లో ఎవరనేది ఇంకా తేలాల్సి ఉంది. సత్తుపల్లి నుంచి సండ్ర, ఇల్లెందు నుంచి అబ్బయ్యలే ఉంటారని అంటున్నారు. న్యూడెమొక్రసీ విషయానికొస్తే ఇల్లెందు నుంచి గుమ్మడి నర్సయ్యకు రాయల వర్గం నుంచి అవకాశం వస్తుందనే చర్చ జరుగుతోంది. ఇక, బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఎస్‌పీ, ఇతర పార్టీలు కూడా తమ పార్టీ తరఫున అభ్యర్థులను ఖరారు చేయడంలో నిమగ్నమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement