బీజేపీకి చంద్రబాబు వెన్నుపోటు? | chandra babu naidu back stabbed bjp? | Sakshi
Sakshi News home page

బీజేపీకి చంద్రబాబు వెన్నుపోటు?

Apr 17 2014 9:14 AM | Updated on Aug 14 2018 4:21 PM

బీజేపీకి చంద్రబాబు వెన్నుపోటు? - Sakshi

బీజేపీకి చంద్రబాబు వెన్నుపోటు?

తన చెయ్య పట్టుకున్నవాళ్లను మసి చేసే అలవాటున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈసారి కూడా అలాగే వ్యవహరిస్తున్నారు.

తన చెయ్య పట్టుకున్నవాళ్లను మసి చేసే అలవాటున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈసారి కూడా అలాగే వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు మైండ్‌గేమ్‌తో బీజేపీ నేతలు ఖంగుతిన్నారు. ప్రధానంగా పురందేశ్వరికి టికెట్‌ ఇవ్వొద్దని బాబు కండిషన్‌ పెట్టినట్లు సమాచారం. అది కుదరకపోవడంతో బీజేపీకి కేటాయించిన 4 ఎంపీ స్థానాలు, 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ రెబెల్స్ను బాబు రంగంలోకి దించుతున్నారు. ఇప్పటికే తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ రెబెల్గా నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ మద్దతుతో నరసాపురం ఎంపీ స్థానానికి రఘురామ కృష్ణంరాజు గురువారం నామినేషన్ వేయనున్నారు. రాజంపేట స్థానాన్ని పురందేశ్వరికి కేటాయించడం, నరసాపురంలో గోకరాజు గంగరాజుకు అవకాశం ఇవ్వడాన్ని చంద్రబాబు ప్రశ్నించారని తెలిసింది. అయితే, తమకు కేటాయించిన స్థానాల్లో తమకు ఇష్టం వచ్చిన నాయకులకు అవకాశం ఇస్తామని, ఆ విషయంలో మీరు వేలుపెట్టడం ఎందుకని చంద్రబాబును బీజేపీ నాయకులు గట్టిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న అగ్రనేతలందరూ హైదరాబాద్లో సమావేశం కావాలని బీజేపీ నాయకులు సమాచారం అందించారు.

టీడీపీ నాయకుడి వైఖరిపై బీజేపీ నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఏలూరు ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు కోటగిరి శ్రీధర్ సిద్ధమవుతున్నారు. అలాగే, శ్రీకాకుళం జిల్లాలో అన్ని అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయనున్నట్లు ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పూడి తిరుపతిరావు స్పష్టం చేశారు. టీడీపీతో పొత్తు విషయమై పార్టీ అధిష్ఠానాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు సంప్రదిస్తున్నారు. చంద్రబాబు మోసపూరిత వైఖరి గ్రహించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నమ్మకం ఉంచాల్సిన వ్యక్తి కాదని, కేవలం తన మనుగడను కాపాడుకోడానికి బీజేపీని బలిపెట్టాలని ఆయన చూస్తున్నట్లు చెబుతున్నారు. గురువారం సాయంత్రానికి రెండు పార్టీల పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement