టీఆర్‌ఎస్‌లో ఆంధ్రోళ్ల పెత్తనం..! | andhra people damnation in trs | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌లో ఆంధ్రోళ్ల పెత్తనం..!

Apr 21 2014 2:17 AM | Updated on Sep 2 2017 6:17 AM

అశ్వారావుపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చిన నేతలు, వివిధ పార్టీల నుంచి బహిష్కృతులైన నేతలు దిక్కయ్యారు.

అశ్వారావుపేట, న్యూస్‌లైన్: అశ్వారావుపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చిన నేతలు, వివిధ పార్టీల నుంచి బహిష్కృతులైన నేతలు దిక్కయ్యారు. మరోపక్క స్థానికంగా ఉన్న ఆ పార్టీ నేత జలగం వెంకట్రావు అనుచరులు చాలా మంది ఇప్పటికే ఆయన ప్రచారంలో పాల్గొనేందుకు కొత్తగూడెం తరలివెళ్లారు. దీంతో స్థానిక అభ్యర్థి ప్రచారంలో పాల్గొనేందుకు కార్యకర్తలే కరువయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జలగం వెంకటరావు టీఆర్‌ఎస్‌లో చేరకముందే తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన వారిలో చాలా మంది టీఆర్‌ఎస్‌కు దూరమయ్యారు. ఆ తర్వాత వివిధ పార్టీల నుంచి బహిష్కృతులైన వారు, ఏ పార్టీలో స్థానం దక్కని వారు జలగం బాటలో టీఆర్‌ఎస్‌లో చేరారు. దీంతో అప్పటికే ఆ పార్టీలో ఉన్న కొద్ది మంది తెలంగాణ వాదులు మైనార్టీలో పడిపోయారు. వారంతా చేసేదేమీ లేక ఆంధ్రా వలస నేతల పెత్తనంలో కొనసాగుతున్నారు.  
   
 అన్ని చోట్లా వారిదే పెత్తనం..
 అశ్వారావుపేట మండలంలో ‘ ఆ నలుగురు’గా చెప్పుకునే ‘దేశం’ బహిష్కృత నేతలు, ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారే ప్రస్తుతం టీఆర్‌ఎస్‌కు ప్రధాన నాయకులయ్యారు. జలగం వెంట ఆయన అనుచరుడైన ఓ యువ నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరినప్పటికీ ఉనికి కోల్పోతాననే ఆందోళన వ్యక్తం చేయడంతో మిగిలిన నాయకులు వెనుకడుగులు వేసే పనిలో ఉన్నారు. దీంతో దమ్మపేట మండలంలో జలగం అనుచరులుగా పేరున్న పలువురు చివరకు పాత పార్టీల్లోనే కొనసాగుతుండగా మరికొందరు కొత్తగూడెంలో జలగంకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నట్లు సమాచారం.

 ములకలపల్లి మండలానికి సంబంధించి ప్రచారం, ఇతర ఆర్థికలావాదేవీలు జలగం అనుచరుడిగా పేరున్న దమ్మపేట మండలం పట్వారీగూడేనికి చెందిన మద్యం వ్యాపారి ఒకరు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అలాగే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో కూడా బహిష్కృత నేతలే ఈ పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తూ తెరవెనుక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయా మండలాల్లో మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారంతా చివరకు డమ్మీలుగా మిగిలారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేరుకు తెలంగాణ పార్టీ, పెత్తనం మాత్రం అంతా ఆంధ్రా వాళ్లదేనంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారు, టీఆర్‌ఎస్ సానుభూతిపరులు చివరకు ఆ పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement