breaking news
Aswarao peta constituency
-
నేనున్నా..
అశ్వారావుపేట నియోజకవర్గం కుక్కునూరు మండలం తొండిపాక పంచాయతీ బంజరగూడెం భవిత అంధకారంగా మారింది. పోలవరం ముంపులో లేనప్పటికీ ఈ గ్రామాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. అంతే ఇక్కడి పరిహారం, పునరావాసం అంతా అయోమయంగా మారింది..స్కాలర్షిప్, ఉన్నత విద్య అందని ద్రాక్షే అయ్యాయి. కాంట్రాక్టు, తాత్కాలిక ఉద్యోగ భద్రత గాలిలో దీపంలా దర్శనమిస్తోంది.. ఆరుగాలం కష్టం, అప్పుచేసి సాగు చేసిన పంట అంతా ఊడ్చిపెట్టుకుపోగా.. రుణమాఫీ వర్తించకపోతుందా..? అనే నమ్మకం వమ్మైయింది. అప్పుచేసి కట్టుకున్న ఇంటికి బిల్లురాలేదు..కొత్త ఇల్లు కట్టిస్తామని ఉన్న ఇల్లు పీకించిన అధికారులు పత్తా లేకుండా పోయారు. రేషన్‌కార్డుతో పాటు బియ్యమూ పోయాయి. వైకల్యం ఉన్నా పింఛన్ రావట్లేదు..తాటాకుల గుడిసెలో ఉంటున్నా ఇల్లు మంజూరుకావట్లేదు.. అటువంటి ఈ గ్రామాన్ని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఆదివారం సాయంత్రం సందర్శించారు. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా గ్రామస్తులను పలుకరించారు. ‘మీ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం’ అని భరోసా ఇచ్చారు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన మీ కోసం.. నాతోటి ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాలైనా ఇస్తా. మీకు సేవ చేస్తానని, అభివృద్ధిపథంలో తీసుకెళ్తానని నమ్మి ఓట్లేశారు. ముంపు సాకుతో మిమ్మల్ని ఆంధ్రలో కలిపారు. ఆంధ్ర అసెంబ్లీలో అవకాశం కల్పిస్తే తప్పక మీకు న్యాయం చేస్తా. - తాటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు: ఓ సర్పంచ్ అక్కా..ఎట్టాగుంది మనూరు? సమస్యలేమైనా ఉన్నాయా? పర్సిక సీతమ్మ (సర్పంచ్): ఊళ్లో నీళ్లు లేవు. మంచినీరు, విద్యుత్ సమస్యలున్నాయి. అభివృద్ధి చేద్దామన్నా నిధులు రావట్లేదు. మీరు తెలంగాణ ఎమ్మెల్యే అయిపోయారు..మమ్మల్ని ఆంధ్రలో కలిపిండ్రు. ఇప్పుడేంది పరిస్థితి. తాటి: పెద్దాయనా బాగున్నారా? ఏమి సమస్యలున్నాయి..? నరుకుళ్ల కొర్రయ్య: రాష్ట్ర విభజన తర్వాత మళ్లీ రజాకార్ల నాటి పరిస్థితి వచ్చింది. ఏ సమస్య ఎవరికి చెప్పుకోవాలో..ఎవర్ని అడగాలో తెలవట్లేదు. ఎవరూ పట్టించుకోవట్లేదు. తాటి: పెద్దమ్మ ఇదేనా నీ ఇల్లు.. దీంట్లో ఎట్లుంటున్నవ్? హసీనా బేగం: నాకున్న ఆస్తి ఈ ఇల్లేనయ్యా. ఇల్లు కాలిపోయిన తర్వాత నాలుగు కర్రలు అడ్డంపెట్టుకొని బతుకుతున్నా. నా గురించి పట్టించుకునేటోళ్లు లేరయ్యా. ఆంధ్ర అధికారులు ఒక్కళ్లు కూడా రాలేదు..మా గతేమవుతుందో నాయనా.. తాటి: అక్కా చెప్పు నీ సమస్య ఏమిటి..? ఎలాగున్నారు..? కీసర బుల్లెమ్మ: అయ్యా ఇల్లు క ట్టుకున్నాక బిల్లు ఇస్తమన్నరు. దొరికిన చోటల్లా అప్పుజేసి మధ్యవర్తులకిచ్చి ఇల్లు కట్టుకున్న. తీరా బిల్లు ఇయ్యట్లేదు. మా ఇళ్ల బిల్లులు తెలంగాణ అధికారులిస్తరో..ఆంధ్ర అధికారులిస్తరో తెలవట్లే. అప్పులిచ్చినోళ్లు ఒకటే అడుగుతున్నరు. తాటి: బాబూ నీకు పింఛన్ ఇస్తున్నారా? ఎండీ సాదిక్‌అలీ: నాకు పింఛన్ ఎవరిచ్చారు సారు. అన్ని సర్టిఫికెట్లూ ఉన్నాయి. పింఛన్ మాత్రం రావట్లేదు. తాటి: రైతులుగా మీ సమస్యలేంటో చెప్పండి? యడవల్లి సతీష్ : సార్, నా వ్యవసాయ ఖాతా సారపాక బ్యాంకులో ఉంది. నా పొలం కుక్కునూరు మండలంలో ఉంది. నాపొలం, ఇల్లూ అన్నీ ఆంధ్రప్రదేశ్‌లో కలిపేశారు. బ్యాంకు ఖాతా తెలంగాణలో ఉంది. బ్యాంకుకు వెళ్లి రుణమాఫీ వచ్చిందా అని అడిగితే.. వచ్చిందీ, రానిదీ చెప్పకుండా ‘మీ తహశీల్దార్‌కు జాబితా పంపించాం చూసుకోండంటున్నారు.’ ఇక్కడికొస్తే తెలంగాణ బ్యాంకులతో మాకు సంబంధం లేదంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు సారు. తాటి: ఏం తాతా నీ సమస్యేమిటి.. ఆరోగ్యం బాగుంటుందా..? సడియం వెంకయ్య: పింఛన్ రావట్లేదు. చాలాసార్లు దరఖాస్తు చేశాను. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అన్ని చాలా సార్లు ఇచ్చాను. అయినా పింఛన్ ఇయ్యట్లే. తాటి: ఏమ్మా.. పిల్లను తీసుకొచ్చావు.. ఏంటి సమస్య? వేదమ్మ: అయ్యా ఈ బిడ్డ నామనుమరాలు. పేరు భద్రమ్మ.. మాటలురావు. తన పనులు తను చేసుకోలేదు. అన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలి. ఈ పిల్లకు పింఛన్ రావట్లేదు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇయ్యట్లేదు. మీరే ఇప్పించాలయ్యా. తాటి: ఏం తల్లీ నీ సమస్యేంటి? వంకా సూరమ్మ: నాకు బియ్యం కార్డు ఇచ్చి 9 నెలలయింది. కానీ ఒక్క నెలయినా బియ్యం ఇయ్యలేదు. ఆధార్ కార్డు ఇవ్వమంటే ఇచ్చాను. అయినా బియ్యం రాట్లేదు. తాటి: ఓ అవ్వా.. నువ్వు కూడా ఇంతమందిలో నిల్చున్నావ్..నీకేమి సమస్య? నాగమ్మ : నాకు రెండు కళ్లు కానరావయ్యా.. నాభర్త చనిపోయి 11 ఏళ్లయింది. నాకు పింఛన్ ఇచ్చినోళ్లు లేరు. ఏమేమో కాయితాలు కావలంటున్నరు. నాకు పింఛన్ ఇస్తరో..ఇవ్వరో..ఎట్ల బతికేదయ్యా. తాటి: సుశీల..నీ సమస్యేమిటో చెప్పమ్మ? వంకా సుశీల: మరుగుదొడ్లు లేని ఇళ్లు సర్వే చేసుకున్నోళ్లు మళ్లీ ఇంటింటికీ వచ్చిండ్రు. మరుగుదొడ్డి కట్టుకున్నాక బిల్లు ఇస్తమన్నరు. తీరా అప్పులు చేసుకుని కట్టుకున్నాక అధికారులు మొహం చాటేసిండ్రు. అప్పులిచ్చినోళ్లు కట్టమంటుండ్రు. తాటి: బాబు చదువుకున్నవాడిలా ఉన్నావ్? నీ ప్రాబ్లమేంటి? వెలకం బాలకృష్ణ: సారూ నేను డిగ్రీ చేశా. ముల్కలపల్లి మండలంలో ఫారెస్టు బేస్‌క్యాంపు లో పనిచేస్తున్నా. మా ఊరు ఆంధ్రలో పోయిం ది. నేను ఉద్యోగం చేసే ప్రాంతం తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తే నేను అర్హున్నా.. కాదా? తెలియడం లేదు. తాటి: తమ్ముడూ నువ్వు చెప్పు సమస్యేంటి? మెద్దినేని శ్రీనివాసులు: సార్ నేను భద్రాచలంలో చదువుతున్నాను. మా ఊరు ఆంధ్రలో ఉంది.. కాలేజీ తెలంగాణలో ఉంది. మా కాలేజీలో చదువుకునే ముంపు మండలాల విద్యార్థులందరికీ ఒకటే సమస్య. తెలంగాణలో చదివే ముంపు మండలాల విద్యార్థులకు స్కాలర్షిప్, ఫీజురీయింబర్స్‌మెంట్ వస్తుందా? రాదా?. తాటి: ఏమ్మా వార్డు మెంబర్..నీకేంటి ప్రాబ్లమ్? మడకం చిట్టెమ్మ: డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారు. కానీ ఏ ప్రభుత్వం చేయడం లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పిన మాటలు మాకు వర్తిస్తయో... లేదో తెలవట్లేదు. తాటి: నీ సమస్యేమిటమ్మా? వంకా లక్ష్మి: మరుగుదొడ్లు కట్టకపోతే రేషన్‌బియ్యం ఆపుతమన్నరు. భయంతో కట్టినం. ఇప్పుడు బిల్లులురాలేదు. అప్పులపాలైనం. -
టీఆర్ఎస్లో ఆంధ్రోళ్ల పెత్తనం..!
అశ్వారావుపేట, న్యూస్‌లైన్: అశ్వారావుపేట నియోజకవర్గంలో టీఆర్ఎస్కు ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చిన నేతలు, వివిధ పార్టీల నుంచి బహిష్కృతులైన నేతలు దిక్కయ్యారు. మరోపక్క స్థానికంగా ఉన్న ఆ పార్టీ నేత జలగం వెంకట్రావు అనుచరులు చాలా మంది ఇప్పటికే ఆయన ప్రచారంలో పాల్గొనేందుకు కొత్తగూడెం తరలివెళ్లారు. దీంతో స్థానిక అభ్యర్థి ప్రచారంలో పాల్గొనేందుకు కార్యకర్తలే కరువయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జలగం వెంకటరావు టీఆర్ఎస్లో చేరకముందే తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించిన వారిలో చాలా మంది టీఆర్ఎస్కు దూరమయ్యారు. ఆ తర్వాత వివిధ పార్టీల నుంచి బహిష్కృతులైన వారు, ఏ పార్టీలో స్థానం దక్కని వారు జలగం బాటలో టీఆర్ఎస్లో చేరారు. దీంతో అప్పటికే ఆ పార్టీలో ఉన్న కొద్ది మంది తెలంగాణ వాదులు మైనార్టీలో పడిపోయారు. వారంతా చేసేదేమీ లేక ఆంధ్రా వలస నేతల పెత్తనంలో కొనసాగుతున్నారు. అన్ని చోట్లా వారిదే పెత్తనం.. అశ్వారావుపేట మండలంలో ‘ ఆ నలుగురు’గా చెప్పుకునే ‘దేశం’ బహిష్కృత నేతలు, ఆంధ్రా ప్రాంతం నుంచి వలస వచ్చి ఇక్కడ స్థిరపడిన వారే ప్రస్తుతం టీఆర్ఎస్కు ప్రధాన నాయకులయ్యారు. జలగం వెంట ఆయన అనుచరుడైన ఓ యువ నాయకులు టీఆర్ఎస్లో చేరినప్పటికీ ఉనికి కోల్పోతాననే ఆందోళన వ్యక్తం చేయడంతో మిగిలిన నాయకులు వెనుకడుగులు వేసే పనిలో ఉన్నారు. దీంతో దమ్మపేట మండలంలో జలగం అనుచరులుగా పేరున్న పలువురు చివరకు పాత పార్టీల్లోనే కొనసాగుతుండగా మరికొందరు కొత్తగూడెంలో జలగంకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నట్లు సమాచారం. ములకలపల్లి మండలానికి సంబంధించి ప్రచారం, ఇతర ఆర్థికలావాదేవీలు జలగం అనుచరుడిగా పేరున్న దమ్మపేట మండలం పట్వారీగూడేనికి చెందిన మద్యం వ్యాపారి ఒకరు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అలాగే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో కూడా బహిష్కృత నేతలే ఈ పార్టీకి సానుకూలంగా వ్యవహరిస్తూ తెరవెనుక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో ఆయా మండలాల్లో మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వారంతా చివరకు డమ్మీలుగా మిగిలారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పేరుకు తెలంగాణ పార్టీ, పెత్తనం మాత్రం అంతా ఆంధ్రా వాళ్లదేనంటూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారు, టీఆర్ఎస్ సానుభూతిపరులు చివరకు ఆ పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.