భేషైన నిర్ణయం!

Sakshi Editorial On Regional Comprehensive Economic Partnership

చైనా సరుకులు మన మార్కెట్లను వెల్లువలా ముంచెత్తడానికి దోహదపడే ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం(ఆర్‌సీఈపీ–ఆర్‌సెప్‌)నుంచి బయటకు రావాలని మన దేశం సోమవారం తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గది. ఏడేళ్లక్రితం ఆ ఒప్పందంపై జరిగే చర్చల్లో పాలుపంచుకోవడానికి మన దేశం అంగీకరించినప్పుడు సర్వత్రా ఆందోళన వ్యక్తమైంది. దేశాల మధ్య కుదిరే వాణిజ్య ఒప్పం దాలు సమష్టి ప్రయోజనాలకు తోడ్పడాలి. ఒకరికొకరు సహకరించుకుంటూ అందరూ ఎదిగేందుకు దోహదపడాలి. ముఖ్యంగా ఒప్పందం కోసం జరిగే చర్చల్లో పారదర్శకత ఉండాలి. అప్పుడు మాత్రమే అన్ని దేశాల పౌరులకూ తమ ప్రభుత్వాలు చేసుకోబోయే ఒప్పందాలు ఎలాంటివో తెలు స్తుంది. దురదృష్టకరమేమంటే ఇలాంటి ఒప్పందాల కోసం జరిగే చర్చలన్నీ రహస్యంగా సాగుతాయి. వాటి అంశాలు లీకై, ఆందోళనలు వెల్లువెత్తినా ప్రభుత్వాలు నోరు మెదపవు. గతంలో విశాల పసిఫిక్‌ భాగస్వామ్య ఒప్పందం(టీపీపీ)పై జరిగిన చర్చలూ ఇలాగే రహస్యంగా సాగాయి. తన చొరవతో మొలకెత్తిన ఆ ఒప్పందం ప్రతిపాదనను అమెరికాయే విరమించుకోవడంతో అది నిలిచిపోయింది. ఇందుకు డోనాల్డ్‌ ట్రంప్‌కు అందరూ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. 

వాస్తవానికి తనకు భాగస్వామ్యం దక్కని టీపీపీ వల్ల భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని ఆందోళనపడిన చైనా 2012లో ఎంతో ముందుచూపుతో ఆర్‌సెప్‌ను రంగం మీదికి తెచ్చింది. టీపీపీలో వచ్చే రాయితీ ఆకర్షణలో పడి అన్ని దేశాలూ ద్వైపాక్షిక ఒప్పందాల నుంచి తప్పు కుని దాని పరిధిలోకి వెళ్లే ప్రమాదమున్నదని చైనాతోపాటు జపాన్, దక్షిణ కొరియా వంటివి కూడా భయపడ్డాయి. పర్యవసానంగా ఆర్‌సెప్‌పైనా, దాని  నిబంధనలపైనా 30 దఫాలు చర్చలు జరి గాయి. ఆ చర్చల్లో మన దేశంతోసహా 16 దేశాలు పాల్గొన్నాయి. ఇందులో పది ఆసియాన్‌ సంస్థ భాగస్వామ్య దేశాలు–బ్రూనీ, కంబోడియా, ఇండొనేసియా, లావోస్, మలేసియా, మయన్మార్, ఫిలి ప్పీన్స్, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాంలతోపాటు ఆస్ట్రేలియా, చైనా, జపాన్, దక్షిణకొరియా, న్యూజిలాండ్‌లు కూడా ఉన్నాయి. ఇందులో ఇప్పుడు భారత్‌ మినహా మిగిలిన దేశాలన్నీ కొన సాగాలని నిర్ణయించాయి. ఈ 16 దేశాల జనాభా ప్రపంచ జనాభాలో 45 శాతం. ఇంత పెద్ద మార్కెట్‌కు వెలుపల ఉండిపోతే మన దేశం తీవ్రంగా నష్టపోతుందని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి పాతికేళ్లు దాటుతున్నా వాణిజ్యపరమైన రక్షణలకు ప్రాధాన్యమిచ్చి స్వేచ్ఛా వాణిజ్యం వల్ల కలిగే లాభాలను మన దేశం చేజేతులా వదులుకుంటున్నదని వారు వాపోతున్నారు. మన సరుకులను అమ్ముకోవడానికి లభించే అవకాశాన్ని ఎందుకు కాల దన్నాలన్నది వారి ప్రశ్న. పైపైన చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. కానీ ఈ ఒప్పందాల్లో ఉండే సవాలక్ష నిబంధనలు దేశ ప్రయోజనాలను గుల్ల చేస్తాయి. పలు రంగాలను దెబ్బతీస్తాయి. ఆర్‌సెప్‌ ఒప్పందంలో మన దేశం భాగస్వామిగా మారితే ఆరోగ్యరంగం, వ్యవసాయం, పాడిపరిశ్రమ, తయారీ రంగం వంటివన్నీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఈ ఒప్పందంలో చేరొద్దని రైతు సంఘాలు మాత్రమే కాదు... పారిశ్రామిక రంగ సంస్థలు కూడా  కేంద్రాన్ని కోరాయి. వీట న్నిటితోపాటు సంఘ్‌ పరివార్‌ సంస్థ స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ గత నెలలో పదిరోజులపాటు నిర్వహించిన జాతీయ స్థాయి ఆందోళన కేంద్రాన్ని పునరాలోచనలో పడేసిందని చెప్పాలి. 

ఆర్‌సెప్‌ ఒప్పందంలో చేరితే అవసరం లేకున్నా ఇతర భాగస్వామ్య దేశాల ఉత్పత్తులకు వెసులు బాట్లు కల్పించాలి. ఆ ఉత్పత్తులపై విధించే సుంకాలు నిర్దిష్ట పరిమితికి మించరాదన్న నిబంధన వల్ల అవి దేశీయ మార్కెట్లో ఉత్పత్తయ్యే సరుకులతో పోలిస్తే చవగ్గా లభ్యమవుతాయి. ఉదాహరణకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల నుంచి పాల ఉత్పత్తులు ఒక్కసారిగా మన మార్కెట్లను ముంచెత్తితే ఇక్కడి పాడి పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుంది. ఆ రెండు దేశాల పాల ఉత్పత్తులు మన ఉత్పత్తులతో పోలిస్తే కిలోకు కనీసం రూ. 10 వరకూ చవగ్గా లభిస్తాయి గనుక జనం అటువైపే మొగ్గుతారు. అంతిమంగా ఇదంతా దేశంలో 15 కోట్లమంది జీవికను దెబ్బతీస్తుంది. ఇదే పరిస్థితి వ్యవసాయం, విద్యుత్‌ యంత్రాల తయారీ, అల్యూమినియం, ఉక్కు, ఇనుము, ప్లాస్టిక్, ఫర్నీచర్‌ తదితరాలకు కూడా ఏర్పడుతుంది. ఆరోగ్యరంగానిది మరో సమస్య. వివిధ ఔషధాలపై ఉండే పేటెంట్‌ హక్కుల నిడివి గతంతో పోలిస్తే పెరుగుతుంది. వాటి తయారీపై గుత్తాధిపత్యం ఏర్పడి ఆ ఔషధాలను చవగ్గా ఉత్పత్తి చేద్దామనుకున్నా అసాధ్యమవుతుంది.

ఉదాహరణకు కొన్ని ఔషధాల తయారీపై ఆర్‌సెప్‌ ప్రకారం ఇరవైయ్యేళ్లపాటు పేటెంట్‌ అమల్లో ఉంటుంది. వేరే సంస్థలు చవగ్గా తయారు చేయగల స్తోమత ఉన్నా అవి నిస్సహాయంగా ఉండిపోవాల్సిందే. నిరుపేద రోగులు భారీ మొత్తం చెల్లించి ఆ ఔషధాలను కొనుక్కోవాలి లేదా చావడానికి సిద్ధపడాలి. ప్రపంచంలోని కేన్సర్‌ మరణాల్లో 70 శాతం వర్థమాన దేశాల్లోనే సంభవిస్తున్నాయని చాన్నాళ్లక్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది.  ఔషధాలు చవగ్గా లభ్యమైతే ఇందులో చాలామంది తమ ఆయుర్దాయాన్ని పెంచుకోగలిగేవారు. కనీసం బతికిన న్నాళ్లూ నొప్పి లేకుండా కాలం వెళ్లదీసేవారు. కానీ బహుళజాతి సంస్థల దుర్మార్గం వల్ల ఔషధాల ధరలు అందుబాటులో లేక, వాటిని వినియోగించుకోలేక కేన్సర్‌ రోగులు కన్నుమూస్తున్నారు. ఆర్‌సెప్‌ ఈ పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. మొత్తంగా చైనాతో మన దేశానికి ఇప్పటికే ఉన్న వాణిజ్యపరమైన లోటును మరిన్ని రెట్లు పెంచుతుంది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ హయాంలో తీసుకున్న చొరవ మన దేశాన్ని ఆర్‌సెప్‌ చక్రబంధానికి దాదాపు చేరువ చేసింది. ఎన్‌డీఏ ప్రభుత్వం మొదట్లో దీనివైపు మొగ్గుచూపినా చివరి నిమిషంలో వైఖరి మార్చుకోవడంతో దేశానికి పెనుముప్పు తప్పిందనే చెప్పాలి. దీంతోపాటు ఇతరేతర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను సైతం పునఃపరిశీలించడం అవసరం. 

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top