మంచంపట్టిన ప్రజారోగ్యం

State Governments Ignoring Publice Health Says NITI Aayog Health Index - Sakshi

‘దండిగా ఉండే బంగారం, వెండి నిల్వల కంటే మించిన నిజమైన సామాజిక సంపద ప్రజారోగ్యమే’ అన్నారు మహాత్మా గాంధీ. ఇంత అపురూపమైన సంపదను ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని తాజా నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ఆరోగ్య సూచీ వెల్లడించింది. ఈ గణాంకాలు 2017–18కి సంబంధించినవి. ఆరోగ్యరంగంలో మెరుగైన పనితీరును ప్రదర్శించిన రాష్ట్రాల్లో ఎప్పటిలాగే కేరళ 74.01 స్కోర్‌తో అగ్ర భాగాన ఉంది. తదనంతర స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌(65.13), మహారాష్ట్ర(63.99), గుజరాత్‌(63.52), పంజాబ్‌(63.01), హిమాచల్‌ప్రదేశ్‌(62.41), జమ్మూ–కశ్మీర్‌(62.37), కర్ణాటక (61.14), తమిళనాడు(60.41) వగైరాలున్నాయి. 

ఈమధ్యకాలంలో మెదడువాపు వ్యాధితో 170 మందికిపైగా పసిపిల్లలు మరణించిన బిహార్‌ 32.11తో, ఆ మాదిరి నాసిరకం వైద్య సేవలతో ఉత్తర ప్రదేశ్‌ 28.61తో అట్టడుగున ఉన్నాయి. రెండేళ్లక్రితం ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 600మంది పిల్లలు మెదడువాపు వ్యాధి బారినపడి కన్నుమూశారు. నీతి ఆయోగ్‌ మంచి పనితీరును ప్రదర్శించా యంటున్న రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నమాట వాస్తవమే అయినా వాటి స్కోరు కనీసం 80 వరకూ వెళ్తేనే అవి ఆరోగ్యరంగంలో అన్నివిధాలా పటిష్టంగా ఉన్నట్టు లెక్క. ఆ సంగతలా ఉంచి ఆరోగ్య సేవల కల్పనలో రాష్ట్రాల మధ్య ఇంతగా వ్యత్యాసం ఉండటం ఆందోళన కలిగించే అంశం. రాష్ట్రాలమధ్యే కాదు– దాదాపు అన్ని రాష్ట్రాల్లోని నగరాలకూ, పట్టణాలకూ... పట్టణాలకూ, గ్రామాలకూ మధ్య కూడా ఇలాంటి వ్యత్యాసాలే ఉన్నాయి. మైదాన ప్రాంతాలకూ, ఆదివాసీ ప్రాంతాల మధ్యా ఇదే వరస. 

మరో దశాబ్దకాలంలో...అంటే 2030నాటికి ప్రపంచంలోని ప్రతి దేశమూ సుస్థిరాభివృద్ధి లక్ష్యా లను(ఎస్‌డీజీ) సాధించాలని ఐక్యరాజ్యసమితి నిర్దేశించింది. ఆ లక్ష్యాల్లో ‘అందరికీ, అన్నిచోట్లా’ సార్వత్రిక ఆరోగ్య సదుపాయం’ లభించడం కూడా ఒకటి. ఎంతటి అనారోగ్య సమస్య ఎదురైనా ఆర్థికపరమైన చిక్కుల్లో పడకుండా దాన్నుంచి పౌరులు బయటపడగలిగే స్థితి ఏర్పరచాలన్నదే ‘సార్వత్రిక ఆరోగ్య సదుపాయం’ సారాంశం. కానీ నీతిఆయోగ్‌ ఆరోగ్య సూచీని చూస్తే మన దేశంలో ఆ దిశగా బుడిబుడి అడుగులైనా పడుతున్నాయా అన్న సందేహం కలుగుతుంది. నీతిఆయోగ్‌ 2015 నుంచి ఏటా ఈ ఆరోగ్య సూచీని విడుదల చేస్తోంది. విషాదమేమంటే వీటిని గమనించుకుని సరి చేసుకోవాలని, ఇకపై మరింత మెరుగైన పనితీరును ప్రదర్శించాలని రాష్ట్రాలు ప్రయత్నిస్తున్న దాఖ లాలు లేవు.  

అత్యధిక రాష్ట్రాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కనీస పారిశుద్ధ్యం కొరవడి వైరస్‌లతో, బాక్టీరియాతో నిండి ఉంటున్నాయి. ఎక్కడా కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండటం లేదు. మందులు లేక, వైద్యులు లేక ఆసుపత్రులన్నీ అల్లాడుతున్నాయి. మొన్న అనేకమంది పసిపిల్లల ప్రాణాలు తీసిన ముజఫర్‌పూర్‌ ఆసుపత్రి దుస్థితి ఇదే. అక్కడ వెంటనే పిల్లలకు గ్లూకోజ్‌ అందిం చగలిగి ఉంటే వారిలో చాలామంది ప్రాణాలు నిలబడేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. నీతి ఆయోగ్‌ ఆరోగ్య సూచీలు మాత్రమే కాదు... ఏటా విడుదలయ్యే జాతీయ శాంపిల్‌ సర్వే వంటివి కూడా ఎన్నో అంశాలను వెలుగులోకి తెస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, లాన్‌సెట్‌ కూడా అడపా దడపా హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ ఎక్కడా కదలిక ఉండటం లేదు. ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్‌ తదితర ఉత్తరాది రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో మెజారిటీ జనం ఆరోగ్యానికి పెట్టే ఖర్చులు తడిసి మోపెడై అప్పుల బారినపడుతున్నారని ఒక సర్వే వెల్లడించింది. కొన్ని కుటుంబాల్లో తలసరి వినిమయం కన్నా ఆరోగ్య వ్యయమే అధికంగా ఉంటున్నదని తేల్చిచెప్పింది. జమైకా, బొలీవియా, వియత్నాం వంటి దేశాల పౌరులతో పోలిస్తే భారతీయులు చికిత్స కోసం చేసే వ్యయం బాగా ఎక్కువ.

ఆర్థిక సంస్కరణల తర్వాత మన ఆర్థిక వ్యవస్థ శరవేగంతో అభివృద్ధి చెందింది. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) పుంజుకుంటోంది. కానీ దానికి దీటుగా ప్రామాణికమైన వైద్య సేవలు అందు బాటులోకి రావడం లేదు. సంపన్నులకు మాత్రమే అవి దక్కుతున్నాయి. ఇప్పుడు 23 అంశాలను ప్రాతిపదికగా తీసుకుని నీతిఆయోగ్‌ ఆరోగ్య సూచీని రూపొందించింది. అందులో నవజాత శిశు మరణాలు, శిశు మరణాలు, సంతాన సాఫల్యత రేటు, తక్కువ బరువుతో పుట్టే శిశువుల సంఖ్య, వ్యాధి నిరోధకత, క్షయవ్యాధి, మౌలిక సదుపాయాలు, హెచ్‌ఐవీ వంటివి అరికట్టడంలో సాధిస్తున్న పురోగతి, మౌలిక సదుపాయాల కల్పనలో సాధిస్తున్న ప్రగతి వగైరా అంశాలు అందులో ఉన్నాయి. 

నిరుటితో పోలిస్తే యూపీ, జార్ఖండ్‌ వంటివి స్వల్పంగా మెరుగైతే, తమిళనాడు స్థితి దిగజారింది. నిజానికి రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాసుపత్రుల్లో ఎన్ని దారుణాలు చోటు చేసుకున్నాయో లెక్కలేదు. బ్యాటరీ లైట్ల వెలుగులో శస్త్రచికిత్సలు, నవజాత శిశువులు ఎలుకలు కొరకడం వల్ల, చీమలు కుట్టడంవల్ల మరణించిన ఉదంతాలు బాబు పాలనలో జరిగి అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఆరోగ్యశ్రీ, 108 వంటి ప్రాణప్రదమైన సేవలు నామమాత్రంగా మారాయి. నీతిఆయోగ్‌ ప్రాతిపదికల్లో ఇంకా అంటురోగాలు, మానసిక అనారోగ్యం, భయంకర వ్యాధులు వగైరాలను చేరిస్తే వాస్తవ చిత్రం మరింత స్పష్టంగా వెల్లడవుతుంది. సకాలంలో వైద్య సదుపాయం అందించగలిగితే జాతీయ స్థాయిలో సంభవించే మరణాల్లో కనీసం మూడోవంతు నిరోధించడం సాధ్యమేనని నిరుడు జాతీయ శాంపిల్‌ సర్వే వెల్లడించింది. 

మనతో సమానమైన తలసరి ఆదాయం గల దేశాలూ, తక్కువగా ఉన్న దేశాలు కూడా ఆరోగ్య రంగంలో మనకంటే ఎంతో మెరుగ్గా ఉంటు న్నాయి. మన దేశం ప్రజారోగ్యానికి కేటాయించే మొత్తం జీడీపీలో 1.02శాతం మించడం లేదు. దాన్ని 2.5 శాతానికి తీసుకెళ్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. చాలా దేశాలు ప్రజారోగ్యానికి 9.2 మొదలుకొని అయిదు శాతం వరకూ ఖర్చు చేస్తున్నాయి. కనుక కేటాయింపుల్ని మరింత పెంచి దేశంలో ప్రజారోగ్యరంగాన్ని పటిష్టం చేయడం తక్షణ కర్తవ్యమని పాలకులు గుర్తించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top