నియంతలకు గుణపాఠం


దేశదేశాల నియంతలనూ భయపెట్టే పరిణామాలు ప్రపంచంలో చాలా అరుదుగా సంభవిస్తాయి. ఉద్యమ పుత్రికగా, మయన్మార్ స్వేచ్ఛా ప్రతీకగా అందరి మన్ననలూ అందుకుంటున్న ఆంగ్‌సాన్ సూచీ ఆ దేశ పార్లమెంటు ఎన్నికల్లో సాధించిన ఘన విజయం అలాంటి అరుదైన సందర్భమే. ఆమె నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ(ఎన్‌ఎల్‌డీ) ఈ నెల 8న జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. అయిదురోజులుగా సాగుతున్న ఓట్ల లెక్కింపులో 440 స్థానాలున్న దిగువ సభలో శుక్రవారంనాటికి ఆమె పార్టీ 238 స్థానాలను గెల్చుకుందని...224 సభ్యులుండే ఎగువసభలో ఇంతవరకూ ఆ పార్టీకి 110 లభించాయని యూనియన్ ఎన్నికల కమిషన్(యూఈసీ) ప్రకటించింది.


 


మొత్తంగా అక్కడి పార్లమెంటులో ఎన్‌ఎల్‌డీకి ఇంతవరకూ 348 స్థానాలు వచ్చాయి. అంతేకాదు...అక్కడున్న ఏడు రాష్ట్రాల్లోనూ, ఏడు ప్రాంతీయ సభల్లోనూ, ఆరు స్వయంపాలిత జోన్‌లలోనూ, ఒక స్వయంపాలిత డివిజన్‌లోనూ ఆ పార్టీదే ఆధిక్యం. వీటిలో ఇంతవరకూ 522 స్థానాల ఫలితాలు ప్రకటించగా 401 స్థానాలు ఎన్‌ఎల్‌డీ గెల్చుకుంది. సైన్యం ప్రాపకంతో ఏర్పడిన యూనియన్ సాలిడారిటీ అండ్ డెవలప్‌మెంట్ పార్టీ(యూఎస్‌డీపీ) ఘోర పరాజయాన్ని చవిచూస్తోంది. పార్లమెంటు మొదలుకొని కింది స్థాయి చట్టసభల వరకూ 75 శాతం స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరిగాయి. మిగిలిన 25 శాతం స్థానాల్లో సైన్యం నామినేట్ చేసినవారే సభ్యులవుతారు. ఆ స్థానాలకు ఎన్నికలుండవు.


బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి ఇంచుమించు మనతోపాటే స్వాతంత్య్రాన్ని సాధించుకున్న మయన్మార్(అప్పటి పేరు బర్మా) దురదృష్టవశాత్తూ స్వల్పకాలంలోనే సైనిక శాసనంలోకి వెళ్లిపోయింది. అక్రమ నిర్బంధాలు, దారుణ చిత్రహింసలు నిత్యకృత్యమైనా... అడుగడుగునా నిఘాతో ఇబ్బందులపాలు చేసినా మయన్మార్ ప్రజల్లోని స్వేచ్ఛా పిపాసను సైనిక నియంతలు చల్లార్చలేకపోయారు. బ్రిటిష్ జాతీయుణ్ణి పెళ్లాడి బ్రిటన్‌లో స్థిరపడిన సూచీ... అస్వస్థురాలైన తల్లిని చూసేందుకు 1988లో మయన్మార్ వెళ్లినప్పుడు సామాన్య పౌరుల్లో పెల్లుబుకుతున్న ఈ ఆగ్రహజ్వాలలను పసిగట్టారు. వారికి నాయకత్వంవహించి తీరాలని సంకల్పించారు.


 


ఆమె నేతృత్వంలో సాగిన మహోద్యమానికి తలొగ్గి రెండేళ్ల తర్వాత...అంటే 1990లో సైనిక పాలకులు ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ఎన్‌ఎల్‌డీ అపూర్వమైన విజయం సాధించింది. ఊహించని ఈ ఫలితాలతో ఖంగుతిన్న సైనిక పాలకులు ఎన్నికలను రద్దు చేసి సూచీని బంధించారు. అయిదేళ్ల జైలు జీవితం, పదిహేనేళ్ల గృహ నిర్బంధం ఆమెలోని పోరాట స్ఫూర్తిని దెబ్బతీయలేకపోయాయి. అంతర్జాతీయంగా ఏకాకిగా మారడం, నానాటికీ క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థను మెరుగుపర్చడానికి ఇతర దేశాల సహకారం తప్పనిసరికావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సైనిక నియంతలు అయిదేళ్లక్రితం ఆమెను విడుదల చేశారు.


 


ఎన్నికలు నిర్వహిస్తామని కూడా వాగ్దానం చేశారు. అయితే దీన్నెవరూ నమ్మలేదు. 2010లో ఒకసారి ‘పోటీ’లేని ఎన్నికలు జరిపించి 80 శాతం ఓట్లు తెచ్చుకున్నామని ప్రకటించిన చరిత్రగల సైన్యంపై ఎవరికీ నమ్మకం కుదరలేదు. సైనిక పాలకులు తెలివితక్కువగా ఏమీ లేరు. సూచీ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించకుండా...తమకున్న అధికారాలు చెక్కుచెదరకుండా రాజ్యాంగంలో అన్ని ఏర్పాట్లూ చేసుకునే ఈ ఎన్నికలకు సిద్ధపడ్డారు. విదేశీయుల్ని పెళ్లాడినా, విదేశాల్లో పుట్టిన పిల్లలున్నా అలాంటివారు అధ్యక్ష పీఠానికి అనర్హులవుతారంటూ అందులో నిబంధన పెట్టారు. అలాగే అన్ని చట్టసభల్లోనూ 25 శాతం సీట్లు దఖలుపరుచుకున్నారు. రాజ్యాంగ సవరణకు పూనుకుంటే వీటో చేసే అధికారాన్ని కూడా అట్టేబెట్టుకున్నారు.  

 


మయన్మార్‌లో నాలుగు నెలల తర్వాతగానీ కొత్త ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదు. ఈలోగా సైనిక పాలకులు మరెన్ని కుట్రలు రచిస్తారో తెలియదుగానీ...ఇప్పటికైతే ప్రజాతీర్పును గౌరవిస్తున్నట్టు ప్రకటించారు. అయితే వచ్చే మార్చిలో తప్ప ఎన్‌ఎల్‌డీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటానికి అవకాశం లేదు. అధ్యక్ష పీఠానికి సూచీ ఎవరి పేరును ప్రతిపాదిస్తారో, కొత్త ప్రభుత్వానికి ఎలాంటి ఎజెండాను నిర్దేశిస్తారో అప్పటికిగానీ తేలదు. అయితే ఆమె పార్టీ ప్రభుత్వం చాలా సమస్యలనే ఎదుర్కొనవలసి ఉంటుంది. ముఖ్యంగా దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా బతుకీడుస్తున్న రోహింగ్యా ముస్లింల సమస్యకు సూచీ ఏం పరిష్కారం వెదుకుతారో, వారికి మెరుగైన భవిష్యత్తును అందించడానికి ఎలాంటి కార్యక్రమాన్ని ప్రకటిస్తారోనని ప్రపంచమంతా ఎదురుచూస్తున్నది.


 


రోహింగ్యాల్లో అత్యధికులు ముస్లింలు. గుర్తింపు పొందిన జాతుల్లో లేరన్న నెపంతో రోహింగ్యాలకు ఓటు హక్కును రద్దు చేయడంతోపాటు ఇతర ముస్లింలను సైతం అనేకవిధాల వేధించారు. వీటిపై సూచీ మాట్లాడలేదు సరిగదా...తమ పార్టీ తరఫున ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా ఎంపిక చేయలేదు. అలా చేస్తే బౌద్ధ తీవ్రవాదుల ఆగ్రహాన్ని చవిచూడాల్సివస్తుందని, పర్యవసానంగా తమకు అధికారం చేజారవచ్చునని ఆమె భావించారు.

 


ఈ ఎన్నికల ద్వారా మయన్మార్ ప్రజలు తిరుగులేని తీర్పునిచ్చారు. జనాభిప్రాయాన్ని గౌరవించి ప్రస్తుత అధ్యక్షుడు థీన్ సీన్, ఆర్మీ చీఫ్ ఆంగ్ హ్లెయింగ్ ఎటూ ఆమె పార్టీకి అధికారాన్ని బదలాయిస్తారు. అయితే సూచీ అధ్యక్ష పీఠం ఎక్కకుండా నిరోధిస్తున్న రాజ్యాంగ నిబంధనను సవరించడానికి వారు ముందుకు రావాలి. కొత్త ప్రభుత్వానికి ఆటంకాలు కల్పించే కుట్ర బుద్ధులను వదులుకోవాలి. సూచీ సైతం మైనారిటీ జాతులు గౌరవప్రదంగా, నిర్భయంగా జీవించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే మయన్మార్ నిజమైన ప్రజాస్వామ్య దేశంగా వర్థిల్లుతుంది!

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top