మహారాష్ట్రలో పాఠ్యాంశంగా బూర రాజేశ్వరి జీవితం | Differently abled poetess Boora Rajeshwari life as a lesson in Maharashtra | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో పాఠ్యాంశంగా బూర రాజేశ్వరి జీవితం

Aug 18 2025 10:56 AM | Updated on Aug 18 2025 11:35 AM

Differently abled poetess Boora Rajeshwari life as a lesson in Maharashtra

2021లో పాఠ్యాంశంగా చేర్చిన అక్కడి ప్రభుత్వం

2022లో చనిపోయిన కవయిత్రి

 

తన పరిస్థితిపై..
మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు.. 
ఎదురీత రాశాడు నా జన్మకు.. 
రూపం లేని దేవుడు నా రూపాన్ని         ఎందుకిలా మలిచాడు.. 
నన్ను అనుక్షణం వెంటాడి వేధిస్తున్నాడు..

తెలంగాణ ఉద్యమంపై..
భగభగమని మండే సూర్యునివలె.. 
గలగలమని పారే సెలయేరువలె.. 
సాగుతోంది సాగుతోంది తెలంగాణ ఉద్యమం..

ఇవీ బూర రాజేశ్వరీ కవితలు. ఒక్కో సందర్భంలో తన స్పందనను కవితల రూపంలో పదిలం చేసింది. ప్రస్తుతం జీవించి లేకున్నా.. ఆమె జ్ఞాపకాలు అక్షరాల రూపంలో కనిపిస్తుంది. మహారాష్ట్ర  ప్రభుత్వం ఆమె జీవితాన్ని 2023లో పాఠ్యాంశంగా చేర్చింది. ఈ సందర్భంగా రాజేశ్వరీ జీవితం.. కవిత్వంపై కథనం.

సిరిసిల్ల:  సిరిసిల్లకు చెందిన బూర అనసూర్య, సాంబయ్య దంపతులకు 1980లో రాజేశ్వరీ జన్మించింది. దివ్యాంగురాలు కావడంతో తల్లి అనసూర్య తోడుగా బడికి వెళ్లింది. అందరిలా చేతులతో కాకుండా కాళ్లతో అక్షరాలు దిద్దింది. స్థానిక నెహ్రూనగర్‌ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివింది. తరువాత పదో తరగతి, ఇంటర్‌ ప్రైవేటుగా పూర్తి చేసింది. రాజేశ్వరీ వైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో అధిగవిుస్తూ తన వేదనను అక్షరీకరించింది. తాను నిలబడి చేయలేని పనులను, చెప్పలేని భావాలను కాళ్లతో వందలాది కవితల్ని రాసి వ్యక్తపరిచింది.

వికసించిన రాజేశ్వరీ కవిత్వం
రాజేశ్వరీ మాటలు సరిగా రాకపోయినా, కవిత్వాన్ని వారధిగా చేసుకొని సమాజంతో సంభాషించింది. సామాజిక సమస్యలపై తనదైన కోణంలో స్పందించింది. అమ్మే ఆమెకు ప్రపంచం కాబట్టి ‘ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. చిరునవ్వుకు చిరురూపం అమ్మ.. అనురాగానికి అపురూపం అమ్మ’ అంటూ సున్నితంగా అమ్మ మనసును చెప్పింది. ప్రపంచాన్ని తిరిగి చూడకున్నా ప్రపంచీకరణ వికృతరూపాన్ని తన మనసుతో చూసింది. మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న సందర్భాన్ని పట్టి చూపిస్తూ ‘అంతా సెల్‌మయం.. చివరికి మనుషులు మాయం’ అంటూ సెల్‌ఫోన్‌ మీద అద్భుతమైన కవిత్వాన్ని రాసింది. తెలుగులోనే కాదు.. ఇంగ్లిష్‌లో కూడా కవిత్వాన్ని రాసింది. 2022 డిసెంబరు 28న ఆమె ఊపిరి ఆగిపోయింది.

వెతుక్కుంటూ వచ్చిన సుద్దాల అశోక్‌ తేజబూర రాజేశ్వరీ కవిత్వాన్ని ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ తన సొంత ఖర్చులతో ‘సిరిసిల్ల రాజేశ్వరీ’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. తన తల్లిదండ్రుల పేరిట స్థాపించిన సుద్దాల హన్మంతు జానకమ్మ అవార్డును 2014లో అందించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షలు అందించింది. 2016 మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా అప్పటి ఉమ్మడి కరీంనగర్‌ కలెక్టర్‌ నీతూ ప్రసాద్‌ ల్యాప్‌టాప్‌ అందించి ప్రోత్సహించింది. కాలుతోనే ల్యాప్‌టాప్‌ను ఆపరేట్‌ చేసింది. రాజేశ్వరీ కవితలతో పుస్తకం వచ్చింది. 1999 నుంచి రాజేశ్వరీ వరుసగా కవిత్వం రాసింది. తాను చనిపోయే వరకు 550కిపైగా కవితలు రాసింది. దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రతోపాటు మూడు జీవిత చరిత్రలనూ రాయడం విశేషం.

మహారాష్ట్రలో పాఠ్యాంశం
రాజేశ్వరీ సాహిత్యం, జీవనశైలిని గుర్తించిన మహారాష్ట్ర పాఠ్యపుస్తక నిర్మితి, పాఠ్యప్రణాళిక పరిశోధన సంస్థ ‘తెలుగు యువ భారతి’లో సిరిసిల్ల రాజేశ్వరీ గురించి ప్రచురించారు. 2021లో స్ఫూర్తిదాయకమైన ఆమె జీవితాన్ని పాఠ్యాంశాన్ని చేశారు. ఆమె గురించి పుస్తకాన్ని ప్రచురించిన సుద్దాల అశోక్‌తేజ వద్ద సమాచారం సేకరించిన మహారాష్ట్ర అధికారులు పాఠ్యప్రణాళిక కమిటీ సభ్యులు డాక్టర్‌ తులసీ భారత్‌ భూషణ్, భమిడిపాటి శారద, టి.సుశీల, బి.విజయభాస్కర్‌రెడ్డి, కె.అనురాధ, ఎం.విద్యాబెనర్జీ, చలసాని లక్ష్మీప్రసాద్, కె.వై.కొండన్న, సీతా మహాలక్ష్మీ, మల్లేశం బేతి, శ్రీధర్‌ పెంబట్ల బృందం రాజేశ్వరీ జీవితం మొత్తాన్ని ఓ పాఠంగా రూపొందించారు. 12వ తరగతి తెలుగు విభాగంలో పాఠ్యాంశంగా ప్రచురించారు. ఇప్పుడు ఆమె లేకున్నా.. సాహిత్యం.. జీవితం మహారాష్ట్రలో పాఠ్యాంశంగా ఉండడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement