breaking news
boora rajeshwari
-
మహారాష్ట్రలో పాఠ్యాంశంగా బూర రాజేశ్వరి జీవితం
తన పరిస్థితిపై..మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు.. ఎదురీత రాశాడు నా జన్మకు.. రూపం లేని దేవుడు నా రూపాన్ని ఎందుకిలా మలిచాడు.. నన్ను అనుక్షణం వెంటాడి వేధిస్తున్నాడు..తెలంగాణ ఉద్యమంపై..భగభగమని మండే సూర్యునివలె.. గలగలమని పారే సెలయేరువలె.. సాగుతోంది సాగుతోంది తెలంగాణ ఉద్యమం..ఇవీ బూర రాజేశ్వరీ కవితలు. ఒక్కో సందర్భంలో తన స్పందనను కవితల రూపంలో పదిలం చేసింది. ప్రస్తుతం జీవించి లేకున్నా.. ఆమె జ్ఞాపకాలు అక్షరాల రూపంలో కనిపిస్తుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఆమె జీవితాన్ని 2023లో పాఠ్యాంశంగా చేర్చింది. ఈ సందర్భంగా రాజేశ్వరీ జీవితం.. కవిత్వంపై కథనం.సిరిసిల్ల: సిరిసిల్లకు చెందిన బూర అనసూర్య, సాంబయ్య దంపతులకు 1980లో రాజేశ్వరీ జన్మించింది. దివ్యాంగురాలు కావడంతో తల్లి అనసూర్య తోడుగా బడికి వెళ్లింది. అందరిలా చేతులతో కాకుండా కాళ్లతో అక్షరాలు దిద్దింది. స్థానిక నెహ్రూనగర్ పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివింది. తరువాత పదో తరగతి, ఇంటర్ ప్రైవేటుగా పూర్తి చేసింది. రాజేశ్వరీ వైకల్యాన్ని ఆత్మవిశ్వాసంతో అధిగవిుస్తూ తన వేదనను అక్షరీకరించింది. తాను నిలబడి చేయలేని పనులను, చెప్పలేని భావాలను కాళ్లతో వందలాది కవితల్ని రాసి వ్యక్తపరిచింది.వికసించిన రాజేశ్వరీ కవిత్వంరాజేశ్వరీ మాటలు సరిగా రాకపోయినా, కవిత్వాన్ని వారధిగా చేసుకొని సమాజంతో సంభాషించింది. సామాజిక సమస్యలపై తనదైన కోణంలో స్పందించింది. అమ్మే ఆమెకు ప్రపంచం కాబట్టి ‘ప్రేమకు ప్రతిరూపం అమ్మ.. చిరునవ్వుకు చిరురూపం అమ్మ.. అనురాగానికి అపురూపం అమ్మ’ అంటూ సున్నితంగా అమ్మ మనసును చెప్పింది. ప్రపంచాన్ని తిరిగి చూడకున్నా ప్రపంచీకరణ వికృతరూపాన్ని తన మనసుతో చూసింది. మనుషులు మనుషులుగా కాకుండా పోతున్న సందర్భాన్ని పట్టి చూపిస్తూ ‘అంతా సెల్‌మయం.. చివరికి మనుషులు మాయం’ అంటూ సెల్‌ఫోన్ మీద అద్భుతమైన కవిత్వాన్ని రాసింది. తెలుగులోనే కాదు.. ఇంగ్లిష్‌లో కూడా కవిత్వాన్ని రాసింది. 2022 డిసెంబరు 28న ఆమె ఊపిరి ఆగిపోయింది.వెతుక్కుంటూ వచ్చిన సుద్దాల అశోక్ తేజబూర రాజేశ్వరీ కవిత్వాన్ని ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ తన సొంత ఖర్చులతో ‘సిరిసిల్ల రాజేశ్వరీ’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించారు. తన తల్లిదండ్రుల పేరిట స్థాపించిన సుద్దాల హన్మంతు జానకమ్మ అవార్డును 2014లో అందించారు. తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షలు అందించింది. 2016 మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా అప్పటి ఉమ్మడి కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ ల్యాప్‌టాప్ అందించి ప్రోత్సహించింది. కాలుతోనే ల్యాప్‌టాప్‌ను ఆపరేట్ చేసింది. రాజేశ్వరీ కవితలతో పుస్తకం వచ్చింది. 1999 నుంచి రాజేశ్వరీ వరుసగా కవిత్వం రాసింది. తాను చనిపోయే వరకు 550కిపైగా కవితలు రాసింది. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవిత చరిత్రతోపాటు మూడు జీవిత చరిత్రలనూ రాయడం విశేషం.మహారాష్ట్రలో పాఠ్యాంశంరాజేశ్వరీ సాహిత్యం, జీవనశైలిని గుర్తించిన మహారాష్ట్ర పాఠ్యపుస్తక నిర్మితి, పాఠ్యప్రణాళిక పరిశోధన సంస్థ ‘తెలుగు యువ భారతి’లో సిరిసిల్ల రాజేశ్వరీ గురించి ప్రచురించారు. 2021లో స్ఫూర్తిదాయకమైన ఆమె జీవితాన్ని పాఠ్యాంశాన్ని చేశారు. ఆమె గురించి పుస్తకాన్ని ప్రచురించిన సుద్దాల అశోక్‌తేజ వద్ద సమాచారం సేకరించిన మహారాష్ట్ర అధికారులు పాఠ్యప్రణాళిక కమిటీ సభ్యులు డాక్టర్ తులసీ భారత్ భూషణ్, భమిడిపాటి శారద, టి.సుశీల, బి.విజయభాస్కర్‌రెడ్డి, కె.అనురాధ, ఎం.విద్యాబెనర్జీ, చలసాని లక్ష్మీప్రసాద్, కె.వై.కొండన్న, సీతా మహాలక్ష్మీ, మల్లేశం బేతి, శ్రీధర్ పెంబట్ల బృందం రాజేశ్వరీ జీవితం మొత్తాన్ని ఓ పాఠంగా రూపొందించారు. 12వ తరగతి తెలుగు విభాగంలో పాఠ్యాంశంగా ప్రచురించారు. ఇప్పుడు ఆమె లేకున్నా.. సాహిత్యం.. జీవితం మహారాష్ట్రలో పాఠ్యాంశంగా ఉండడం విశేషం. -
కాలుతో కవిత్వం.. మాతృత్వపు పరిమళం
సిరిసిల్ల : చెట్టుకు కాయ భారం కాదు.. తల్లికి బిడ్డ భారం కాదు.. కానీ పుట్టుకతనే వైకల్యంతో బాధపడుతున్న చంటి బిడ్డకు అన్నీ తానై సాకింది ఆ అమ్మ. చంటిపాప అందరిలా నడువలేకపోయినా.. మాట్లాడలేక పోయినా గుండె నిండా ధైర్యాన్ని నింపుకుని అన్నీ తానైంది. ఆ కంటిపాప పెరుగుతున్న కొద్ది నడువలేని స్థితిని గమనించి నేనున్నానమ్మా అంటూ అండగా నిలిచింది. సిరిసిల్లలోని సాయినగర్‌కు చెందిన బూర రాజేశ్వరి(36) పుట్టుకతోనే దివ్యాంగురాలు. ఆమె తల్లి అనసూర్య రాజేశ్వరిని ఏడో తరగతి వరకు చదివించింది. సరిగా నడువలేని, మాట్లాడలేని రాజేశ్వరికి కవిత్వంపు అక్షరాలు జాలువారాయి. దివ్యాంగురాలైన ఆమె మొక్కవోని ధైర్యంతో అద్భుతమైన కవిత్వాన్ని అక్షీకరిస్తుంది. రాజేశ్వరి రాష్ట్ర స్థాయిలో కవయిత్రిగా గుర్తింపు సాధించేందుకు తల్లి అనసూర్య ప్రేరణ అయింది. అమ్మపై రాజేశ్వరి ‘అవనిపై ఆ దేవుని అద్భుత సృష్టి అమ్మ... అమృతం కన్న మధురం అమ్మ స్వచ్ఛమైన ప్రేమకు ప్రతి రూపం..అమ్మ‘.. అంటూ కాలుతోనే కవిత్వాన్ని, తన మనసులోని భావాలను పంచుతుంది. రాష్ట్ర స్థాయి అవార్డులు.. రాజేశ్వరి కవిత్వాన్ని చదివిన ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ తన తల్లిదండ్రుల పేరిట ప్రతిఏటా అందించే సుద్దాల హన్మంతు జానకమ్మ స్మారక అవార్డును 2016లో అందించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షల నగదు పురస్కారాన్ని రాజేశ్వరికి అందించింది. రాజేశ్వరి ఇప్పటి వరకు 350 కవితలు, మూడు కథలు రాశారు. అమ్మపై ఆమె ఇరవై కవిత్వాలు రాశారు. రాజేశ్వరి వైకల్యంతో బాధపడుతున్నా... అమ్మపై ఆమెకున్న ప్రేమను అక్షీకరించారు. రాజేశ్వరికి బాధకలిగిన.. ఆనందం కలిగినా అమ్మతో పంచుకుంటుంది. కాలుతో కష్టతరమైన కవిత్వాన్ని రాస్తుంది. రాజేశ్వరి సాహిత్యసృజనను రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు పలు సందర్భాల్లో అభినందించారు. ఆమెతోనే నాకు గుర్తింపు వచ్చింది.. నా బిడ్డ రాజేశ్వరి నరాల బలహీనతతో బాధపడుతుంది. అందరిలాగా నడువలేదు.. అందరిలా మాట్లాడలేదు. కానీ కవిత్వం రాస్తుంది. సుద్దాల అశోక్‌తేజ సార్ నా బిడ్డను గుర్తించడంతో నాకు గుర్తింపు వచ్చింది. ఇన్నేళ్లు నేను పడిన కష్టం.. ఇబ్బందులు మా రాజేశ్వరి కవిత్వాన్ని చూసి అందరూ మెచ్చుకున్నప్పుడు ఎంతో సంతోషం కలిగింది. నేను బతికుండగా... నా బిడ్డకు ఏ కష్టం రానివ్వ. ఎప్పుడు ఏదో ఒక్కటి చదువుతూ.. రాస్తూ.. ఉంటుంది. ఆమెకున్న అక్షర జ్ఞానమే రాజేశ్వరిని ఈ స్థాయికి తెచ్చింది. – బూర అనసూర్య అమ్మతోనే నా లోకం.. నాకు అమ్మే లోకం.. మా నాన్న సాంబయ్య ఐదేళ్ల కిందట చనిపోయాడు. మా నాన్న దూరం కావడం ఎంతో బాధించింది. కానీ నాకు మాత్రం అన్నీ అమ్మే చేసింది. చిన్నప్పుడు బడికి వెళ్లినప్పటి నుంచి ఇప్పుడు నేను రాస్తున్న కవిత్వపు అక్షరాలన్నీ అమ్మ చేతి చలువే. ఆమెకు చదువు రాకపోయినా.. చదువు గొప్పదనాన్ని గుర్తించి నన్ను బడికి పంపింది. ఆ బడి బాటనే ఇప్పుడు కవిత్వాన్ని రాసేందుకు తోడయింది. ‘చెట్టుకు పువ్వు అందం... నుదుటికి బొట్టు అందం, ఇంటికి ఇల్లాలు అందం, నా కంటికి మా అమ్మ నవ్వు అందం’. అంటుంది. – కవయిత్రి, బూర రాజేశ్వరి