ఆ అరెస్టులే అసలైన కుట్ర

Government Targets Maoist Supports - Sakshi

కొత్త కోణం

ఈ దేశంలో ఆదివాసీలను ఎన్‌కౌంటర్ల పేరుతో మట్టుబెట్టినప్పుడు, వారి హక్కులను కాలరాసినప్పుడు, వరవరరావు, గౌతం నవ్‌లఖా, ఆయనతో పాటు అరెస్టయిన వారు ఆదివాసీలకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు కూడగట్టారు. నరేంద్రమోదీ హత్యకు సంబంధించి బయటపడిందంటున్న మావోయిస్టుల ఉత్తరం నిజమైంది కాదనీ, మానవహక్కుల, ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేయడానికి సృష్టించిన ఉత్తరమని పలువురు న్యాయకోవిదులూ, మేధావులూ ప్రకటించారు. అలాంటప్పుడు ఈ అరెస్టులకు కారణం ఉండాలి. మావోయిస్టులకు మద్దతునిచ్చేవారికి ఇలా హెచ్చరిక జారీచేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఇదెంతమాత్రం వాంఛనీయం కాదు.

హత్యలు, అత్యాచా రాలూ, అవమానాలూ భరిస్తూ ఉన్నంతకాలం ఏ విధమైన ఘర్షణ లేదు.  సరిగ్గా ఇదే మహారాష్ట్రలో భీమా కోరేగావ్‌ స్ఫూర్తియాత్ర సందర్భంగా జరిగిన ఘటనలకు వర్తిస్తుంది. పీష్వాల అకృత్యాలు సహిం చిన మహార్, చమార్‌ లాంటి నాటి అంటరాని కులాలు 1818 జనవరి 1న ప్రతిఘటనా దాడికి పూనుకున్నాయి. కేవలం అయిదు వందల మంది కొన్నివేల మంది పీష్వా సైన్యాన్ని మట్టుబెట్టారు. ఇది చరిత్ర. అలాంటి విజయగాథను మననం చేసుకొని, స్ఫూర్తి పొందడానికి లక్షలాది మంది దళితులు దేశం నలుమూలల నుంచి కోరేగావ్‌ జైత్రయాత్రకు బయలుదేరారు.

భీమా నదికి దక్షిణం వైపున ఉన్న భీమాకోరేగావ్‌ స్తూపం వద్ద దళితులు ఎంతో ప్రశాంతంగా పది కిలోమీటర్లకు పైగా నడిచివెళ్లి నివాళులర్పించారు. భీమా నదికి రెండోవైపు అంటే ఉత్తరం వైపు భీమాకోరేగావ్‌ యాత్రకు కదలివస్తోన్న దళితులపై దాడి జరిగింది. వధూబద్రుకా గ్రామంలో కొంత మంది ఆధిపత్య కులాలు కాషాయజెండా లతో, ఇనుపరాడ్లు, రాళ్లతో పొలాల్లో దాగి దాడికి దిగారు. ఊహించని ఈ దాడికి తట్టుకోలేని దళితులు చెల్లాచెదురయ్యారు. అక్కడ ఉన్న వాహనాలను తగు లబెట్టారు. ఈ గ్రామాల అగ్రకులాలకు తోడుగా పొరుగున ఉన్న సన్నావాడి, శిఖరాపూర్‌ గ్రామాల ఆధిపత్య కులాలు దాడిలో భాగమయ్యాయి. ఈ దాడిలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాహుల్‌ పతంగే ఆసుపత్రిలో మరణించారు.

ఈ దాడి హఠాత్తుగా జరిగింది కాదని, ముందస్తు పథకం ప్రకారమే జరిగిందని స్థానికులు చెప్పారు. రెండు రోజుల ముందే డిసెంబర్‌ 29న వధూబద్రుకా గ్రామంలో అక్కడి దళితులు నిర్మిం చుకున్న ఒక అమరవీరుని సమాధిని ఆధిపత్య కులాలు కూల్చివేశాయి. అంతకు ముందు మూడు నెలలుగా భీమాకోరేగావ్‌ విజయయాత్రపై చర్చ జరుగుతోంది. భీమాకోరేగావ్‌ దళితులు తలెత్తుకొని నిలబడటం ఆధిపత్య కులాలకు కంటగింపుగా తయారైంది. అదే ఈ దాడికి కారణం. దీనికిపై  దేశంలోని అనేక ప్రాంతాలు నిరసనలతో భగ్గుమ న్నాయి. మహారాష్ట్రలోని అన్ని జిల్లాల్లోని దళితులు, ఆదివాసీలు రాష్ట్రం మొత్తాన్ని దిగ్బంధనం చేశారు. ముంబైని స్తంభింపజేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వేలాది మంది దళిత యువకులు భీమా కోరేగావ్‌ జైత్రయాత్ర సందర్భంగా జరిగిన దాడిని ప్రతిఘటించడం మనకు కనిపిస్తుంది.

పూనా– ముంబై ప్రాంతమే కాకుండా మరాఠ్వాడా, విదర్భ లాంటి ప్రాంతాలు కూడా అట్టుడికిపోయాయి. ఈ ప్రతిఘటనను అణచడానికి వేలాది మంది పోలీ సులను రంగంలోకి దింపారు. కానీ రాహుల్‌ పతం గేని హత్య చేసిన సంభాజీ భీడే, మిలింద్‌ ఎగ్బోటేను మాత్రం అరెస్టు చేయలేదు. ఈ విషయమై పార్ల మెంటులో సైతం చర్చ జరిగింది. తర్వాత కేవలం మిలింద్‌ ఎగ్బోటేను మాత్రమే అదుపులోకి తీసుకొని బెయిల్‌పై విడిచిపెట్టారు. హిందూ సంఘ నాయ కుడు సంభాజీ భీడేను ఇప్పటి వరకు అరెస్టు చేయ లేదు. విచారించనూ లేదు. ఈయన ప్రధాని నరేంద్ర మోదీ గురువు అంటారు. మరో విచిత్రం ఏమిటంటే జనవరి ఒకటవ తేదీన హత్యకు గురైన దళిత యువ కుడు రాహుల్‌ని చంపింది హిందూ సంఘ కార్య కర్తలు కాదని, దళిత యువకులే హత్యచేశారని పోలీ సులు మరో కథ అల్లారు.

సుప్రీం ఆదేశంతో దళితుల్లో ఆందోళన
మహారాష్ట్రలో ఈ ఉద్యమ జ్వాలలు చల్లారకముందే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద ప్రభు త్వోద్యోగులనూ, ఇతరులనూ ముందస్తుగా అరెస్టు చేయకూడదని మార్చిలో సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ పరిణామం దేశంలోని మొత్తం దళితులను ఆందో ళనకు గురిచేసింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, బిహార్, ఢిల్లీ, పంజాబ్‌ వంటి రాష్ట్రాల్లో దళితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఏప్రిల్‌ రెండున దళిత సంఘాలు ఇచ్చిన భారత్‌ బంద్‌ దళిత ఉద్యమ శక్తిని నిరూపించింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ఏకకంఠంతో దళితులు సుప్రీంకోర్టు తీర్పుని నిరసించారు. భారత్‌ బంద్‌ సందర్భంగా ఉత్తరప్రదేశ్, మ«ధ్యప్రదేశ్, రాజస్తాన్‌ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వందలాది యువకులు అరెస్టయ్యారు. రోడ్ల మీదకు వచ్చిన యువతీయువ కులను వారి కులం పేరు అడిగి మరీ వ్యాన్లలోకి ఎక్కించి జైళ్ళలోకి తోశారు.

ఈ రెండు సంఘటనలతో ఖంగుతిన్న కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఈ∙ఉద్య మాన్ని అణచివేయాలని ఆలోచించింది. నేరుగా దళి తులను లక్ష్యంగా చేసుకుని నిర్బంధం ప్రయోగిస్తే ఎన్నికల్లో తమకు వ్యతిరేక ఫలితాలు వస్తాయని భావించిన పాలకులు దానికి మరో మార్గం అన్వే షించారు. అందుకు భీమాకోరేగావ్‌ హింసాకాండ అనే పదం సృష్టించారు. మీడియా ద్వారా దీన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఎల్గార్‌పరిషత్‌ జరిపిన సమా వేశాన్ని దానికి మద్దతుగా చూపించారు. భీమా కోరే గావ్‌ ద్విశత వార్షికోత్సవ స్ఫూర్తియాత్ర సందర్భంగా కొన్ని ప్రజాసంఘాలు కలిసి డిసెంబర్‌ 31న పుణే లోని శనివార్‌వాడలో సభ ఏర్పాటు చేశాయి. కోరే గావ్‌ స్ఫూర్తి కొనసాగించాలనే లక్ష్యంతో ఈ సభను ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు ముందే చెప్పారు.

గుజరాత్‌ దళిత నాయకుడు జిగ్నేష్‌ మేవానీ, జేఎ న్‌యూ విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖాలిద్, రోహిత్‌ వేముల తల్లి రాధిక సహా కొంత మంది దళిత నాయకులు ఈ సభకు హాజరయ్యారు. జనవరి ఒక టిన దళితులపై దాడి తర్వాత జరిగిన దళితుల నిరసన ప్రదర్శనలకు ఈ సభకు సంబంధం ఉందని, ఎల్గార్‌ పరిషత్‌ సభలో చేసిన ఉపన్యాసాలే హింసా కాండకు కారణమయ్యాయని పోలీసులు ముందుగా ప్రకటించారు. ఈ ఎల్గార్‌ పరిషత్‌ సభలకు ఆర్థిక సహకారాన్నీ మావోయిస్టు్టలు అందించారని ప్రచా రం చేసిన పోలీసులు జూన్‌ నెలలో ఐదుగురు కార్య కర్తలను మావోయిస్టుల పేరుతో అరెస్టు చేశారు.

దాడి చేసింది దళితులు కాదు!
భీమాకోరేగావ్‌ జైత్రయాత్ర సందర్భంగా భీమా నదికి ఉత్తర భాగంలో దాడి చేసింది దళితులు కాదు. కాషాయజెండాలతో, ఇనుపరాడ్లు, రాళ్లతో దాడిచే సిన వారు స్థానిక ఆధిపత్య కులాల వ్యక్తులేనని పత్రికలూ, మీడియా ఘోషించాయి. ఒకవేళ ఎల్గార్‌ పరిషత్‌ ఉపన్యాసాలే హింసాకాండకు కారణమైతే భీమా నదికి దక్షిణ భాగంలో వెల్లువెత్తిన జనసంద్రం మొత్తం పుణేనే భస్మీపటలం చేయగలిగేది. కోరేగావ్‌ భీమా నదికి దక్షిణభాగంలో దళిత యువకుడు రాహుల్‌ హత్యానంతరం కూడా దళితులు హింసకు పాల్పడలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ నిరసన తెలిపారు. లక్షలాది మంది దళితుల స్ఫూర్తికార్య క్రమాన్ని నిర్వహించింది అఖిల భారత సమతాసైనిక్‌ దళ్‌. ఎల్గార్‌ పరిషత్‌కు, భీమా కోరేగావ్‌ స్ఫూర్తి కార్యక్రమానికీ ఎలాంటి సంబంధమూ లేదు. ఎల్గార్‌ పరిషత్‌ సమావేశం జరిగింది డిసెంబర్‌ 31 సాయం త్రం. దళిత యువకుడు రాహుల్‌ హత్య జరిగిన గ్రామంలో డిసెంబర్‌ 29వ తేదీన దళితులు నిర్మిం చిన స్మారక చిహ్నాన్ని ఆధిపత్య కులాలు ధ్వంసం చేశాయి. అంటే ఆ సమావేశానికి ముందే దళితులపై పరోక్ష దాడులు ప్రారంభమయ్యాయి.
 
ఎలాంటి ఆధారంలేని ఎల్గార్‌ పరిషత్‌ కార్య క్రమాన్ని ఆసరా చేసుకొని మానవ హక్కుల సంఘాలు, పౌరహక్కుల సంఘాల నాయకులపైన పోలీసులు దాడులు చేశారు. ఆ దాడుల్లో ప్రధాని మోదీని హత్యచేయడానికి కుట్ర పన్నుతున్నారన డానికి ఆధారం లభ్యమైందని పోలీసులు ఢిల్లీలోని రోమా విల్సన్‌ గది నుంచి ఒక ఉత్తరం దొరికినట్టు ప్రకటించారు. ఇదే సందర్భంగా ముంబైలో సుధీర్‌ ధవలేను, నాగ్‌పూర్‌లో సోమాసేన్, మహేష్‌ రావత్, సురేంద్ర గాడ్లింగ్‌ను ఏప్రిల్‌ 17న అరెస్టు చేశారు. హైదరాబాద్‌లో విరసం నేతlవరవరరావు, ఢిల్లీలో న్యాయవాది, పౌర హక్కుల నాయకుడూ, జర్నలిస్టు, రచయిత గౌతం నవ్‌లఖా, ఫరీదాబాద్‌లో సుధా భరద్వాజ్, రాంచీ నుంచి ఆదివాసీ హక్కుల నాయ కుడు స్టాన్‌ స్వామి, ముంబై నుంచి అరుణ్‌ ఫెరీరాను అరెస్టు చేశారు. ఏప్రిల్‌ 2న భారత్‌ బంద్‌ తర్వాత ఈ అరెస్టులు జరగడం, దానికి భీమాకోరే గావ్‌ను ముడి పెట్టడం చూస్తే ఈ చర్యల వెనుక దాగి ఉన్న కుట్ర బహిర్గతమవుతోంది.

విప్లవకవి వరవరరావు అరవై ఏళ్లుగా విప్లవో ద్యమంలో ఉంటూ ప్రజాఉద్యమాల్లో మమేకమ య్యారు. ఆదివాసీల పక్షాన పోరాడుతున్నారు.  ధిక్కారస్వరమైన వరవరరావుని బయటలేకుండా చేయడమే లక్ష్యంగా ఈ అరెస్టుల తతంగం జరిగిం దన్నది వాస్తవం. ఈ దేశంలో ఆదివాసీలను ఎన్‌ కౌంటర్ల పేరుతో మట్టుబెట్టినప్పుడు, వారి హక్కు లను కాలరాసినప్పుడు, వారిపై అత్యాచారాలు చేసి నప్పుడు వరవరరావు, గౌతం నవ్‌లాఖా, ఆయనతో పాటు అరెస్టయిన వారు ఆదివాసీలకు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు కూడగట్టారు.

నరేంద్రమోదీ హత్యకు సంబంధించి బయట పడిందంటున్న మావోయిస్టుల ఉత్తరం నిజమైంది కాదనీ, మానవహక్కులు, ప్రజాసంఘాల నాయ కులనూ అరెస్టు చేయడానికి సృష్టించిన ఉత్తరమని పలువురు న్యాయకోవిదులూ, మేధావులూ ప్రకటిం చారు. అలాంటప్పుడు ఈ అరెస్టులకు కారణం ఉండాలి. మావోయిస్టులకు సమాజంలో మద్దతు నిచ్చేవారికి ఇలా హెచ్చరిక జారీచేయడమే ప్రభుత్వ లక్ష్యం. ఇంకా దళితులు, ఆదివాసీలు పోరాడుతోంటే వారికి మావోయిస్టులతో సంబంధాలను అంటగట్టి అణచివేయడం కూడా రెండో ప్రయోజనంగా భావి స్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో భీం ఆర్మీ ఉద్యమానికి మావోయిస్టుల అండ ఉందనే నెపంతో ఆ సంస్థ నాయకుడు చంద్రశేఖర్‌ ఆజాద్‌ని ఏడాదికి పైగా జైల్లో పెట్టారు. దళితులు, ఆదివాసీలు ఎదురు తిరిగినప్పుడల్లా వారిని ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా ముద్ర వేస్తున్నారు. ఇదెంత మాత్రం వాంఛనీయం కాదు.


వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 97055 66213  
మల్లెపల్లి లక్ష్మయ్య

 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top