ఇరాన్‌ ప్రతీకారం | Editorial On Iran Attack At Iraq Based American Military | Sakshi
Sakshi News home page

ఇరాన్‌ ప్రతీకారం

Jan 9 2020 12:09 AM | Updated on Jan 9 2020 12:11 AM

Editorial On Iran Attack At Iraq Based American Military - Sakshi

ఇరాన్‌ సైనిక జనరల్‌ కాసిం సులేమానిని ద్రోన్‌ దాడిలో హతమార్చడం ద్వారా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పెట్టిన చిచ్చు ఇరాన్‌ ప్రతీకార దాడితో కొత్త మలుపు తిరిగింది. బుధవారం వేకువజామున ఇరాక్‌లోని అమెరికాకు చెందిన రెండు సైనిక స్థావరాలపై ఇరాన్‌ డజనుకుపైగా క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో స్వల్ప నష్టం మాత్రమే జరిగిందని ట్రంప్‌ ప్రకటించగా, తాము 80మంది ‘అమెరికా ఉగ్రవాదులను’ హతమార్చామని అంతక్రితం ఇరాన్‌ తెలిపింది. చానెళ్లలో చూస్తే నష్టం ఎక్కువగానే కలిగివుండొచ్చన్న అభిప్రాయం కలుగుతుంది. అధి కారంలోకొచ్చింది మొదలు ట్రంప్‌ ఇరాన్‌పై కయ్యానికి కాలుదువ్వుతున్నారు. ఆ దేశంపై ఒబామా హయాంలో కుదిరిన అణు ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆయన ప్రయత్నించినప్పుడు అమెరికా ఇంటెలిజెన్స్‌ విభాగం సీఐఏ అందుకు అభ్యంతరం తెలిపింది. అణు ఒప్పందంలోని ఏ అంశాన్నీ ఇరాన్‌ ఉల్లంఘించలేదని అది నివేదిక ఇచ్చింది. అటు తర్వాత 2018 మే లో ఆ ఒప్పందంనుంచి ఏకపక్షంగా బయటకు రావడంతోపాటు కొత్త ఒప్పందానికి సిద్ధపడకపోతే ఆంక్షలు అమలు చేస్తామంటూ హుకుం జారీ చేశారు.

దీన్ని ఇరాన్‌ ఖాతరు చేయకపోవడంతో ఆ ఏడాది డిసెంబర్‌లో ఆంక్షలు మొదలుపెట్టారు. ఆ దేశం నుంచి ఎవరూ ముడి చమురు కొనరాదని ప్రపంచ దేశాలకు ఆదేశాలిచ్చారు. తర్వాత చర్యగా ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌(ఐఆర్‌జీసీ) దళాలను ఉగ్రవాద బృందంగా పరిగణిస్తున్నట్టు ప్రకటించారు. దాని ప్రకారం సులేమాని అమెరికా దృష్టిలో ‘ఉగ్రవాది’ అయ్యారు. హఠాత్తుగా ఆయనపై ద్రోన్‌ దాడికి దిగి సంక్షోభానికి అంకురార్పణ చేశారు. ఇరాన్‌ లక్ష్యంగా చేసుకున్న అమెరికా స్థావరాలు రెండూ వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైనవి. ముఖ్యంగా అల్‌ అసాద్‌ స్థావరానికి 2018 డిసెంబర్‌లో ట్రంప్‌ వెళ్లారు. ఇది అమెరికాకు అత్యంత ప్రధాన మైనదని ఆ సందర్భంగా ఆయన చెప్పారంటే దాని ప్రాముఖ్యత తెలుస్తుంది. అమెరికా యుద్ధ విమానాలతోపాటు హెలికాప్టర్లు, ద్రోన్‌లు అక్కడ నిరంతరం సిద్ధంగావుంటాయి. తమ సైనిక జన రల్‌ సులేమానిని హతమార్చిన ద్రోన్‌ ఇక్కడినుంచే బయల్దేరివుంటుందన్న అనుమానం ఉండ టంవల్లే ఇరాన్‌ ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుందంటున్నారు. రెండో స్థావరం ఎర్బిల్‌ ఇరాక్‌లో కుర్దుల ప్రాబల్యంవున్న ప్రాంతంలో వుంది. ఐఎస్‌ ఉగ్రవాదులపై బాంబుల వర్షం కురిపించడంలో ఈ రెండు స్థావరాలు ప్రధాన పాత్ర పోషించాయి. 

సులేమాని ఉగ్రవాదని చెబుతున్న అమెరికాకు ఆయన నాయకత్వంలోని కుద్స్‌ ఫోర్స్‌ వల్లే ఉగ్ర వాద సంస్థలు అల్‌–కాయిదా, ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌)లు తుడిచిపెట్టుకుపోయాయని తెలియంది కాదు. కానీ పశ్చిమాసియాలో తన మిత్ర దేశాలైన ఇజ్రాయెల్, సౌదీ అరేబియాల ప్రయోజనాలను పరిరక్షించడానికి, ప్రస్తుతం తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ నుంచి ప్రజల దృష్టి మళ్లించ డానికి ట్రంప్‌ ఈ వృధా ఘర్షణను నెత్తికెత్తుకున్నారు. అపారమైన చమురు నిల్వలతోపాటు తమ భూభాగంలో ముస్లింలు అత్యంత పవిత్రమని భావించే మక్కా, మదీనాలున్నాయి కనుక ముస్లిం ప్రపంచానికి తానే తిరుగులేని సారథినని సౌదీ భావిస్తుంటుంది. 1979లో ఇరాన్‌ షా మహ్మద్‌ రేజా పెహ్లవీని కూలదోసిన ఇస్లామిక్‌ విప్లవం దీన్నంతటిని మార్చింది. అంతవరకూ సౌదీ అరేబియా తోడ్పాటుతో పశ్చిమాసియాపై పెత్తనం చేస్తున్న అమెరికా ఆధిపత్యాన్ని ఆ విప్లవం దెబ్బతీసింది. దాంతోపాటు సౌదీ నాయకత్వానికి కూడా సవాలు విసిరింది. ఇరాన్‌ షియాల ఆధిపత్యంలో ఉండ టం, సౌదీ సున్నీల ప్రాబల్యంలో ఉండటం ఈ విభేదాలను పెంచింది. 2003లో అమెరికా దురా క్రమణ, సద్దాం హుస్సేన్‌ పతనం అనంతరం ఇరాక్‌లో మెజారిటీగావున్న షియాలకు బ్యాలెట్‌ ద్వారా అధికారం చిక్కింది.

మరోపక్క సిరియాలో సున్నీలదే మెజారిటీ అయినా అక్కడ అలేవీ తెగకు చెందిన బషర్‌ అల్‌ అసద్‌ గత 20 ఏళ్లుగా అధికారంలోవున్నారు. ఇరాక్‌లో తమ వర్గంవాడైన సద్దాంను కూలదోసిన అమెరికాకు బుద్ధి చెప్పి, అక్కడ ఆధిపత్యం సంపాదించడంతోపాటు తమ వర్గం మెజారిటీగావున్న సిరియాను కూడా చేజిక్కించుకోవాలని చూసిన ఐఎస్‌ను సులేమాని నాయకత్వంలోని కుద్స్‌ ఫోర్స్‌ ధ్వంసం చేయగలిగింది. తమకు సాధ్యంకాని పనిని సులేమాని సునాయాసంగా చేసినప్పటినుంచీ అమెరికాకు ఆయనపైనా, ఇరాన్‌పైనా శంక పట్టుకుంది. భవి ష్యత్తులో ఈ ప్రాంతంపై ఇరాన్‌ పట్టుపెంచుకుంటే ఇజ్రాయెల్, సౌదీలకు పెను నష్టం వాటిల్లుతుం దని భావించబట్టే ఏదో వంకన ఇరాన్‌ను ఊపిరాడనీయకుండాచేసి చక్ర బంధంలో బిగించాలని ట్రంప్‌ భావిస్తున్నారు. పనిలో పనిగా తనపై వచ్చిన అభిశంసనపై అమెరికన్‌ ప్రజల దృష్టి పడకుండా ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో తన విజయానికి తోడ్పడుతుందని ఆయన అంచనా వేసుకున్నారు.  

ప్రతీకార దాడుల ద్వారా అమెరికాను ఇరాన్‌ రెచ్చగొట్టిందని, దాన్ని యుద్ధం చేయక తప్పని స్థితికి నెట్టిందని కొందరు చేస్తున్న వాదన సరికాదు. తనకు ఇష్టమున్నా లేకున్నా ఆ దేశం 80వ దశకం నుంచి ఘర్షణలమధ్యే మనుగడ సాగిస్తోంది. దాని పర్యవసానాలు అనుభవిస్తూనేవుంది. తనంత తాను కయ్యానికి కాలుదువ్విన చరిత్ర మాత్రం ఇరాన్‌కు లేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పెత్తనం చేజారుతోందని గ్రహించిన అమెరికా ప్రపంచంపై ఏదో రకమైన సంక్షోభం రుద్దడానికి ప్రయత్నిస్తోంది. కానీ ఈ క్రమంలో మన దేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాల ఆర్థిక వ్యవ స్థలు తలకిందులవుతాయి. పశ్చిమాసియాలో యుద్ధం బయల్దేరితే ఆ ప్రాంతంనుంచి చమురు సరఫరా నిలిచిపోతుంది. అలాగే ఇరాన్, సౌదీ అరేబియాతోసహా పలు దేశాలతో మనకున్న వాణిజ్యం ఆగిపోతుంది. ట్రంప్‌ తాజా ప్రకటన గమనిస్తే వెంటనే యుద్ధం వచ్చే అవకాశాలు లేవన్న అభిప్రాయం కలుగుతుంది. అయితే ఉద్రిక్తతలు మాత్రం ఇప్పట్లో సమసిపోయే అవకాశం లేదు. ఈ దశలోనైనా ఆ ప్రాంతంలో ప్రశాంత పరిస్థితులు నెలకొనేలా ప్రపంచ దేశాలన్నీ చిత్త శుద్ధితో కృషి చేయాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement