భద్రత సాకుతో నిఘా! | Central Government In Talks To Make Amendments To Section 79 Of IT Act | Sakshi
Sakshi News home page

Dec 25 2018 2:05 AM | Updated on Dec 25 2018 2:05 AM

Central Government In Talks To Make Amendments To Section 79 Of IT Act - Sakshi

‘పాలకులు ప్రజా సేవకులు గనుక వారి గురించి మనకు ప్రతీదీ తెలియాల్సిందే. మనం ప్రైవేటు వ్యక్తులం గనుక మన గురించి వారికి తెలియకూడదు. వారు తెలుసుకోకూడదు’ అని పులిట్జర్‌ గ్రహీత, పాత్రికేయుడు గ్లెన్‌ గ్రీన్‌వాల్డ్‌ ఒక సందర్భంలో అన్నారు. అమెరికా, బ్రిటన్‌లు స్వదేశాల్లోని పౌరులపైనేగాక ప్రపంచవ్యాపితంగా ఎన్నో దేశాల్లో సాగించిన నిఘా వ్యవహారాలను స్నోడెన్‌తో పాటు ఆయన బట్టబయలు చేశారు. గ్రీన్‌వాల్డ్‌ ఏం చెప్పినా జనంపై నిఘా పెట్టడం పాలకులకు నిత్యకృత్యంమవుతోంది.

సాంకేతికత పెరిగే కొద్దీ ఇది మరింత సులభంగా మారుతోంది. వ్యక్తిగత గోప్యత అనేది పౌరుల ప్రాథమిక హక్కని సుప్రీంకోర్టు నిరుడు తీర్పునిచ్చింది. దాన్ని మూణ్ణెల్ల క్రితం ఇచ్చిన ఆధార్‌ తీర్పులో సైతం ధ్రువీకరించింది. కానీ కేంద్రం మాత్రం తన దోవన తాను పౌరులపై నిఘాకు వీలుకల్పించే నోటిఫికేషన్‌ను గురువారం అర్థరాత్రి విడుదల చేసింది. ఆ విష యంలో విమర్శలు వెల్లువెత్తుతుండగానే కొత్తగా ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(ఐటీ) చట్టంలోని సెక్షన్‌ 79ని సవరించాలని సంకల్పించింది. అందుకు సంబంధించిన ప్రతిపాదనల్ని వివిధ సామాజిక మాధ్యమాలకు పంపింది. వాటిపై వచ్చే నెల 7లోగా స్పందించాలని కోరింది.

నోటిఫికేషన్‌ అయినా, ఆ తర్వాత ప్రతిపాదించిన ఐటీ చట్ట ముసాయిదా సవరణలైనా ఆశ్చర్యం కలిగిస్తాయి. దేశ భద్రతకూ, సార్వభౌమాధికారానికి ముప్పు కలిగే పరిస్థితులపై బహి రంగ చర్చ జరిపితే, వివరాలన్నీ వెల్లడిస్తే ప్రజలు సంతోషిస్తారు. దేశ భద్రతకు తమ వంతు సహ కారం అందిస్తారు. కానీ హఠాత్తుగా ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసి, ఐటీ చట్టానికి సవరణ ప్రతిపా దించి ఇదంతా దేశం కోసమే అంటే ఎవరూ విశ్వసించలేరు. లోగడ ఇందిరాగాంధీ కూడా ఇలాంటి కారణాలే చెప్పి అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ప్రస్తుత బీజేపీ నేతలు అనేకులు జైళ్లకు వెళ్లాల్సి వచ్చింది. దానికి వ్యతిరేకంగా పోరాడినవారే ఇప్పుడు అధికారంలోకొచ్చి ఆ ధోరణుల్నే ప్రదర్శిం చడం విస్మయం కలిగిస్తుంది. 

ఇంటెలిజెన్స్‌ బ్యూరో మొదలుకొని మొత్తం పది సంస్థలు ఎవరి కంప్యూటర్లలో భద్రపరిచిన సమాచారాన్నయినా రాబట్టడానికి... పౌరులు ఒకరికొకరు పంపుకునే అన్ని రకాల సమాచారాన్ని అడ్డగించి డీక్రిప్ట్‌ చేయడానికి గురువారం అర్ధరాత్రి వెలువడిన నోటిఫికేషన్‌ అవకాశమిస్తోంది. ఈ అధికారాలను వినియోగించుకోవడానికి ముందు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతి తీసుకోవా లన్న నిబంధనొకటి విధించారు. ఆ ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి నేతృత్వంలోని కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందట. నిఘా అధికారాలు దుర్వినియోగం కాకుండా చేసిన ఏర్పా ట్లలో ఇవన్నీ భాగమని ప్రభుత్వం చేస్తున్న వాదన నిలబడదు.

అధికారంలో ఉన్నవారు ఎవరిపైన అయినా చర్య తీసుకోదల్చుకుంటే అధికారులు దానికి అడ్డు చెబుతారని ఎవరూ అనుకోరు. సీబీఐ మొదలుకొని అనేక సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని స్వయానా బీజేపీయే విపక్షంలో ఉండగా ఆరోపణలు చేసింది. ఆఖరికి సర్వోన్నత న్యాయస్థానమే పాలకులు చెప్పినట్టల్లా ఆడుతు న్నారని సీబీఐని విమర్శించింది. ఇక అవి స్వతంత్రంగా వ్యవహరించగలవని నమ్మేదెవరు? ఏదో ఒక సాకుతో ఇలా విశేషాధికారాలు సంక్రమింపజేసుకోవడం ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టించడమే అవుతుంది.

నోటిఫికేషన్‌ పర్యవసానంగా గూగుల్, ఫేస్‌బుక్, వాట్సాప్, అమెజాన్, ట్వీటర్, షేర్‌ చాట్‌ తదితర సామాజిక మాధ్యమాలన్నీ ప్రభుత్వ సంస్థలు అడిగిన ఎలాంటి సమాచారాన్నయినా 72 గంటల్లో అందజేయాలి. ఆఖరికి ఎన్‌క్రిప్షన్‌(సంకేత భాష) సదుపాయం ఉన్న వాట్సాప్‌వంటివి కూడా వారడిగే సమాచారం మూలాలెక్కడివో చెప్పడానికి దాన్ని డీక్రిప్ట్‌ చేయాల్సిందే. వాట్సాప్‌లో ఒకరినుంచి ఒకరికెళ్లే సమాచారం ఇవ్వాలని ఆమధ్య కేంద్రం కోరినప్పుడు అది తమకు సైతం తెలియదని ఆ సంస్థ నిర్వాహకులు జవాబిచ్చారు. ఇప్పుడు దాన్ని దారికి తెచ్చుకోవడమే ధ్యేయంగా నోటిఫికేషన్‌ విడుదలచేసినట్టు కనబడుతోంది. 

ఆవుల్ని కబేళాలకు తరలిస్తున్నారని, గోమాంసం తింటున్నారని ఆరోపణలుచేస్తూ గత మూడు న్నరేళ్లుగా పలు ముఠాలు చెలరేగి ఎందరినో కొట్టి చంపాయి. పిల్లల్ని అపహరించుకుపోతున్నారని వదంతులు సృష్టించి హత్యలు చేసిన సందర్భాలున్నాయి. వీటిని అరికట్టేందుకు సమగ్రమైన చట్టం తీసుకురావాలని చాలామంది కోరారు. మూక దాడులకు వర్తింపజేయగల అనేక సెక్షన్లు మన భార తీయ శిక్షాస్మృతిలో ఇప్పటికే ఉన్నాయని కూడా చెప్పారు. దీని గురించి కేంద్రం ఏం ఆలోచిస్తున్నదో ఎవరికీ తెలియదు. కానీ వదంతుల వ్యాప్తికి వాట్సాప్‌ తదితర సామాజిక మాధ్యమాలు కారణ మంటూ వాటిని అదుపు చేయడానికి మాత్రం చర్యలు మొదలయ్యాయి.

అసలు నోటిఫికేషన్‌ 2009లో యూపీఏ ప్రభుత్వం విడుదల చేసిందని, తాము చేసిందల్లా దాన్ని పొడిగించడమేనని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ అంటున్నమాట నిజమే కావొచ్చు. కాంగ్రెస్‌ పాలనలోని అవకతవ కలను నిశితంగా విమర్శిస్తున్న బీజేపీ నేతలకు ఈ నోటిఫికేషన్‌ తప్పుగా కనబడకపోవడం విచిత్రం. ఎవరెవరి ఫోన్‌ సంభాషణలు ప్రభుత్వం వింటున్నదో వివరాలివ్వాలని కొన్నేళ్లకిత్రం ఆర్టీఐ చట్టం కింద అడిగినప్పుడు నెలకు 10,000 కాల్స్‌పై నిఘాకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనుమతిచ్చారని వెల్లడైంది. అంటే రోజూ దాదాపు కొత్తగా 300మంది అదనంగా నిఘా పరిధిలో కొస్తున్నట్టు లెక్క.

ఇంత విచక్షణారహితంగా నిఘా అమలవుతున్న తీరును గుర్తించి సరిచేయా ల్సింది పోగా, తాజాగా సామాజిక మాధ్యమాలను కూడా అందులో చేర్చాలనుకోవడంలోని ఔచిత్యం ఏమిటో అర్ధంకాదు. దేశ భద్రత విషయంలో రాజీ పడాలని ఎవరూ చెప్పరు. కానీ తమ కిచ్చిన అధికారాలను దుర్వినియోగపరిచే అధికారులపై బాధిత పౌరులు ఎలాంటి చర్యలు తీసుకో వచ్చునో కూడా నోటిఫికేషన్‌ చెప్పాలి. చట్టంలో సైతం దానికి సంబంధించిన నిబంధనలుండాలి. అంతేతప్ప ఏదో ఒక సాకుతో ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement