బీజేపీకి గుణపాఠం!

BJP Unhappy With Bypoll Results - Sakshi

గత నాలుగేళ్ల నుంచి తనను తాను అజేయశక్తిగా భావించుకుంటూ దూకుడుగా వెళ్తున్న బీజేపీని దేశవ్యాప్తంగా పదకొండు రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ఫలితాలు ఖంగు తినిపించాయి. కలిసి కదిలితే వచ్చే ఏడాది జరగాల్సిన సార్వత్రిక సమరంలో తమకు ‘అచ్ఛే దిన్‌’ రావడం పెద్ద కష్టం కాదన్న భరోసాను విపక్షాలకిచ్చాయి. ఎన్నికలు జరిగిన నాలుగు లోక్‌సభ స్థానాల్లో రెండింటినీ, 10 అసెంబ్లీ స్థానాల్లో తొమ్మిదింటిని విపక్షాలు సొంతం చేసుకున్నాయి. నాలుగు లోక్‌సభ స్థానాల్లో బీజేపీకి దక్కింది ఒకే ఒక్కటి! మరో స్థానంలో దాని మిత్ర పక్షం విజయం సాధించింది. అలాగే అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఖాతాలో ఒక్కటంటే ఒక్కటే పడింది. ఈ ఉప ఎన్నికల్లో అసాధ్యమ నుకున్న విపక్ష ఐక్యతను అవలీలగా సాధించినవారు ముగ్గురు యువ నేతలు–ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్, రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వియాదవ్, రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్‌డీ) అధినేత అజిత్‌సింగ్‌ కుమారుడు జయంత్‌ చౌధరిలు. 

గత సార్వత్రిక ఎన్నికల్లోనూ, అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన ఆర్‌ఎల్‌డీకి ప్రాణప్రతిష్ట చేసిన ఘనత జయంత్‌ చౌధరికి దక్కుతుంది. అఖిలేష్‌ రాష్ట్ర రాజకీయాలతోపాటు పార్టీలో కూడా తన స్థానాన్ని పటిష్టం చేసు కున్నారు. పదునైన రాజకీయ చతురతను ప్రదర్శిస్తే బరిలో ఉన్న బలమైన ప్రత్యర్థిని చిత్తుచేయడం పెద్ద కష్టమేమీ కాదని ఈ ముగ్గురూ నిరూపించారు. రాగల సార్వత్రిక సమరానికి కొత్త ఉపకర ణాలు వెదుక్కోక తప్పదేమోనన్న సంశయాన్ని బీజేపీ అగ్రనేతలకు కలిగించారు. 2014 ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమితో బరిలోకి దిగిన బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పర్చుకోగల స్థాయిలో 282 స్థానాలు గెల్చుకుంది. వెనక్కు తిరిగి చూసుకుంటే ఈ నాలుగేళ్లలోనూ జరిగిన ఉప ఎన్నికల్లో 9 స్థానాలను చేజార్చుకుంది. చివరికిప్పుడు ఆ పార్టీకి నికరంగా మిగిలినవి 273! అంటే సాధారణ మెజారిటీ కన్నా ఒకే ఒక్క స్థానం ఎక్కువ!!

ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రల్లో బీజేపీకి తగిలిన ఎదురుదెబ్బలు సామాన్యమైనవి కాదు. గత సార్వత్రిక ఎన్నికల్లో కావొచ్చు... అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కావొచ్చు... ఈ రెండుచోట్లా బీజేపీ విజయఢంకా మోగించింది.  80 లోక్‌సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అప్పట్లో 71 కైవసం చేసుకుంది. ఇక మహారాష్ట్రలోని 48 స్థానాల్లో ఆ పార్టీకి 23 రాగా, దాని మిత్రపక్షమైన శివ సేనకు 18 లభించాయి. అంటే 41 స్థానాలు ఆ కూటమివే. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఆ రెండూ రాష్ట్రాలూ బీజేపీకి తిరుగులేని మెజారిటీతో పట్టం కట్టాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 288 స్థానాలకూ బీజేపీ 122 గెల్చుకోగా, విడిగా పోటీచేసిన దాని మిత్ర పక్షం 63 గెల్చుకుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.

నిరుడు జరిగిన ఎన్నికల్లో యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకూ బీజేపీ 325 సాధించింది. అలాంటిచోట ఇప్పుడు వెలువడిన ఫలితాలు బీజేపీకి తీవ్ర నిరాశనే మిగిల్చాయి. యూపీలోని కైరానా లోక్‌సభ స్థానం ఆ పార్టీకి అత్యంత కీలకమైనది. ఇక్కడ గత సార్వత్రిక ఎన్నికల్లో గుజ్జర్‌ సామాజిక వర్గానికి చెందిన హుకుంసింగ్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి 2 లక్షల పైచిలుకు మెజారిటీతో నెగ్గారు. ఆయన మరణం కారణంగా ఉప ఎన్నిక జరిగి, హుకుం కుమార్తె పోటీ చేసినా ఈసారి ఫలితం దక్కలేదు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి అయిన ఆర్‌ఎల్‌డీకి చెందిన తబుస్సమ్‌ 44,618 ఓట్ల మెజారిటీతో విజయం సాధిం చారు. 

2013లో మతఘర్షణలతో అట్టుడికిన ముజఫర్‌నగర్‌ కైరానా పరిధిలోనిదే. ఇక్కడి గెలుపు కోసమే అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో బీజేపీ మహమ్మదాలీ జిన్నా చిత్రపటం వివాదాన్ని రాజేసిందన్న ఆరోపణలున్నాయి. సానుభూతిగానీ, మతపరమైన చీలికగానీ, జిన్నా వివాదంగానీ బీజేపీని కాపాడలేకపోయాయి. ఇందుకు కారణముంది. చెరుకుపండించే ప్రాంతమైన కైరానాలో చెరకు రైతులకు సర్కారు రూ. 13,000 కోట్లు బకాయిపడింది. అందుకే ఉప ఎన్నికలో ‘జిన్నా సరే.. గన్నా(చెరకు) మాటేమిట’న్న నినాదం హోరెత్తింది. చివరకు ‘గన్నా’యే పైచేయి సాధించింది. యూపీలోని నూర్పూర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక కూడా ప్రతిష్టాత్మకమైనదే. వరసగా రెండు దఫాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న అక్కడ విపక్షమైన సమాజ్‌వాదీ గెలిచింది.

మహారాష్ట్రలోని పాల్ఘర్‌ లోక్‌ సభ స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకున్నా మెజారిటీ గణనీయంగా పడిపోయింది. ఇక విదర్భ ప్రాంతంలో ఉన్న భండారా–గోండియా స్థానంలో క్రితంసారి బీజేపీ అభ్యర్థిగా లక్షన్నర మెజారిటీతో నెగ్గిన నానా పటోల్‌ రైతు సమస్యల విషయంలో ప్రధానిపై నేరుగా విమర్శనాస్త్రాలు సంధించి వార్తల్లోకెక్కి ఆ తర్వాత ఆ పార్టీకీ, లోక్‌సభ సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఇప్పుడక్కడ ఎన్‌సీపీ అభ్యర్థి 48,097 ఓట్ల మెజారిటీతో నెగ్గారు. ఇక బీహార్‌లో జేడీ(యూ) అధినేత, ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ సగం కేబినెట్‌ను జోకియాత్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో మోహరిం చినా ఆయన పార్టీకి ఓటమి తప్పలేదు. ఇక్కడ ఆర్జేడీ గెలుపు లాలూ కుమారుడి ఘనతగా చెప్పు కోవాలి. 

ఈ నాలుగేళ్లలో బీజేపీకి ఉప ఎన్నికల్లో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో రాజస్థాన్‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా గెల్చుకోని కాంగ్రెస్‌ నిరుడు ఆళ్వార్, అజ్మీర్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. యూపీలోని ఫూల్పూర్, గోరఖ్‌ పూర్‌లలోనూ సమాజ్‌వాదీ అభ్యర్థులు బీజేపీని ఓడించారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో బీజేపీ ఎంపీ వినోద్‌ ఖన్నా మరణించాక ఉప ఎన్నిక జరిగితే అక్కడా బీజేపీకి ఓటమే ఎదురైంది. 2015లో మధ్యప్రదేశ్‌లోని రట్లాం లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీకి చేదు అనుభవం తప్పలేదు. మొత్తానికి ఈ ఉప ఎన్నికల ఫలితాలు బీజేపీని పునరాలోచనలో పడేస్తాయి. జనం ఎందుకు ఓట్లేశారో మరిచి, ఇతరేతర అజెండాలతో ఊరేగితే... దూకుడుతో, దబాయింపుతో నెట్టు కొద్దామనుకుంటే ప్రజాస్వామ్యంలో చెల్లదని ఆ పార్టీ గ్రహించాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top