
కాంక్రీటు పనులు నిర్వహించే ఎయిర్ పోర్టురోడ్డు (అంతరచిత్రం) ఈనెల 24వతేదీన శంకుస్థాపన చేసిన ఎయిర్‌పోర్టు రోడ్డు కాంక్రీటు పేవర్స్, కెర్బ్‌రాయి శిలాఫలకం
ఆయనో ఎమ్మెల్యే.. తన నియోజకవర్గంలో జరిగిన ఓ ప్రారంభోత్సవానికి ఆయనకు ఆహ్వానం అందింది. అయితే ‘‘ఆ కార్యక్రమం ఎవరిని అడిగి ఏర్పాటు చేశారు. తనను ఎందుకు సంప్రదించలేదు’’ అంటూ అలిగారు. ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఇక అనుచరులు కూడా తమ ఎమ్మెల్యేకు ఎందుకు ప్రాధాన్యం ఇవ్వలేదని నానారచ్చ చేశారు. దెబ్బకు దిగొచ్చిన అధినాయకత్వం ఆయన ఆగ్రహ జ్వాలలను చల్లబరిచేందుకు అభివృద్ధి నిధులు రూ.రెండు కోట్లు కేటాయించేసింది. అయితే ఈ నిధులను ప్రజలకు ఉపయోగపడే పనులకు కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేకు ప్రయోజనం కలిగేలా నిధులు ఇవ్వడమేంటని? పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఇది ఏ నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే? తెలుసుకోవాలని ఆసక్తిగా ఉందా? అయితే చదవండి మరి.
మధురపూడి(రాజానగరం) : ఇటీవల మధురపూడిలోని రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఇండిగో విమానయాన సంస్థకు చెందిన సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, ఎయిర్‌పోర్టు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇండిగో నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమ విషయమై తనతో ఎందుకు చర్చించలేదని స్థానిక ఎమ్మెల్యే అలిగారు. ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. అప్పట్లో అది చర్చనీయాంశమైంది. ఆయన అనుయాయులు ఎయిర్‌పోర్టు మెయిన్ గేటు వద్ద ధర్నాకు ఉపక్రమించారు. తమ నాయకుడికి ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపించారు. దీనికి ప్రతిగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నిధులను ఎయిర్‌పోర్టు రోడ్డుకు ఇరువైపులా కాంక్రీటు పేవర్స్, కెర్బ్‌రాయి ఏర్పాటుకు చర్యలు చేపట్టారు.
అభివృద్ధి పేరిట
సుమారు రూ.రెండు కోట్లు..
అధికారపార్టీ అధినాయకత్వం అలిగిన వారిని బుజ్జిగించడానికి వడ్డింపులు వడ్డిస్తోంది. అభివృద్ధి పేరుతో నిధుల కేటాయింపు జరుగుతోంది. దానిలో భాగంగానే ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌కు ఎయిర్‌పోర్టు రోడ్డు అభివృద్ధి పేరిట సుమారు రూ.రెండు కోట్ల నిధులు కాంక్రీటు పేవర్స్, కెర్బ్‌రాయి ఏర్పాటు పనుల నిమిత్తం కేటాయించారు. ఈ మేరకు శంకుస్థాపన, శిలాఫలకం ఏర్పాటు చేశారు. దీనికి రాజమహేంద్రవరం మేయర్ పంతం రజనీశేషసాయి, ఎంపీ మాగంటి మురళీమోహన్, గుడా చైర్మన్ గన్ని కృష్ణ హాజరయ్యారు. ఈ పనులు 14 కిలోమీటర్ల విస్తీర్ణంలో జరుగుతాయి. ఎయిర్‌పోర్టు నుంచి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ వరకు పనులు జరగాల్సి ఉంది. అయితే ఎయిర్‌పోర్టు రోడ్డుకిరువైపులా కాంక్రీటు పేవర్స్, కెర్బ్‌రాయి ఏర్పాటు పనులు తక్షణ అవసరం కాదని పలువురు చెబుతున్నారు. నిధులను కైంకర్యం చేయడానికే ఈ పనులని పలువురు వాపోతున్నారు. రాజకీయ లబ్ధికోసం నీరు–చెట్టు తరహా పనులు జరిపిస్తూ ఉంటారని, ఎయిర్‌పోర్టు రోడ్డులో నిర్వహించే పనులు ఈ కోవకే చెందుతాయని స్థానికులు విమర్శిస్తున్నారు.
