
తుంగపాడు వద్ద స్థానికులు ఆక్రమించిన కందుకూరి వీరేశలింగం పంతులు భూమిఅరుస్తాడు.. ఏడుస్తాడు.. తిరగబడతాడు అని తెలిసినా పక్కవాడి ఆస్తులు కొట్టేసే మానుష రూపంలో ఉన్న రాబందులకు ఉలకని, పలకని దేవుడి ఆస్తులు ఒక లెక్కా? హుండీలో డబ్బులు నొక్కేసినా అడగడు.. ఆయన నిత్య ధూప, దీప, నైవేద్యాల కోసం ధార్మికులు రాసిచ్చిన మాన్యాలు కొల్లగొడుతున్నా అడగడు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రసిద్ధ దేవాలయాల ఆస్తులు ఎన్నో అన్యాక్రాంతమవుతున్నాయి.
సాక్షి, తూర్పుగోదావరి , రాజమహేంద్రవరం: సమాజ హితం కోసం యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం పంతులు ఇచ్చిన ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయి. వితంతు వివాహాలు, స్త్రీ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన కందుకూరి 1906 డిసెంబర్ 15న ‘హితకారిణి’ సమాజాన్ని ఏర్పాటు చేసి, నిర్వహణకు తన యావదాస్తిని బదలాయించారు. రాజమహేంద్రవరం నగరంలో 30.37 ఏకరాల్లో కందుకూరి వీరేశలింగం ఆస్తిక స్కూల్, డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, కందుకూరి రాజ్యలక్ష్మి పేరుతో మహిళా కళాశాలలు ఉన్నాయి. ఇందులో మహిళా కళాశాల ప్రాంగణంలో రాజేంద్రనగర్ వైపు సర్వే నంబర్ 255లో 400 గజాలు ఆక్రమణకు గురైంది. కళాశాలలో అటెండర్‌గా పని చేసిన వ్యక్తే ఆ స్థలాన్ని ఆక్రమించారు. దీనిపై హితకారిణి సమాజం దేవాదాయ శాఖ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడంతో ఆ స్థలం హితకారిణికే చెందుతుందని తీర్పునిచ్చింది. అయితే సదరు వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడంతో కేసు విచారణలో ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో గజం సుమారు రూ.40 వేలు పలుకుతోంది.
రాజానగరంలో 4.70 ఎకరాల ఆక్రమణ
కందుకూరి తన 20.60 ఎకరాల వ్యవసాయ భూములనూ హితకారిణికి బదలాయించారు. తాళ్లరేవు మండలం ఉప్పంగల గ్రామంలో సర్వే నంబర్ 93/2లో 4.30 ఎకరాలు, ఇంజవరం గ్రామం సర్వే నంబర్ 42/3లో 3.20 ఎకరాలు, రాజానగరం మండలం పాత తుంగపాడు గ్రామం సర్వే నంబర్ 850లో 4.70 ఎకరాలు, అదే గ్రామంలోని సర్వే నంబర్ 866లో 2.52 ఎకరాలు, ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో సర్వే నంబర్ 84/3లో 3.08 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం మాధవయ్యపాలెంలో సర్వే నంబర్ 3/1బిలో 2.52 ఎకరాలను కందుకూరి వీరేశలింగం పంతులు హితకారిణి సమాజానికి బదలాయించారు. అయితే రాజానగరం మండలం తుంగపాడు వద్ద సర్వే నంబర్ 850లో ఉన్న 4.70 ఎకరాలు ఆక్రమణలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూమి ఎకరం విలువ దాదాపు రూ.30 లక్షలు ఉంది. స్థానికులు కొందరు ఆ పొలాన్ని ఆక్రమించడంపై హితకారిణి సమాజం అధికారులు కోర్టుల్లో వేసిన కేసులు విచారణలో ఉన్నాయి. మిగతా పొలాలు అన్నీ లీజుకు ఇచ్చారు. ఇప్పటికే రాజమహేంద్రవరం నగరంలో ఉన్న అత్యంత విలువైన భూములు కొన్ని గతంలో అతి తక్కువ ధరకే పెద్దలకు కేటాయించారని, ఇక మిగిలి ఉన్న భూములనైనా దేవాదాయశాఖ అధికారులు కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.