బైక్‌పై మృతదేహం తరలింపు

Dead body transport on bike in east godavari district - Sakshi

డీజిల్‌ లేక కదలని పీహెచ్‌సీ అంబులెన్సు

ప్రైవేట్‌ వాహనం ఏర్పాటుకు పేదరికం అడ్డు

ఆవేదన వ్యక్తం చేసిన ప్రజలు

తూర్పుగోదావరి, రాజవొమ్మంగి (రంపచోడవరం): మృత దేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు వాహన సదుపాయం లేక మృతుని బంధువులు నానా అగచాట్లు పడ్డారు. ప్రభుత్వ అంబులెన్సు సమకూరక, పెద్ద మొత్తంలో సొమ్ము చెల్లించి ప్రైవేట్‌ వాహనం ఏర్పాటు చేసుకోలేక తీవ్ర ఆందోళన చెందారు. చివరికి బైక్‌పైనే మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఈ హృదయ విదారక సంఘటన  మండల ప్రధాన కేంద్రం రాజవొమ్మంగిలో మంగళవారం చోటు చేసుకుంది.

వివరాలివి... అనారోగ్యంతో అపస్మారక స్థితిలో ఉన్న వట్టిగెడ్డ గ్రామానికి చెందిన గవిరెడ్డి తాతయ్యలు (58) అనే రైతును కుటుంబ సభ్యులు పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. వైద్యుడు వంశీ పరీక్షించి అప్పటికే అతడు మృతి చెందినట్టు చెప్పారు. దీనితో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు పీహెచ్‌సీ అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలని వైద్యులను కోరారు. ఆ వాహనంలో డీజిల్‌ లేదని చెప్పారు. దీంతో వారికి ప్రైవేటు వాహనాన్ని ఏర్పాటు చేసుకొనే స్తోమత లేక, మరో గత్యంతరం లేక మృతదేహాన్ని మోటారు సైకిల్‌పై మధ్యన కూర్చోబెట్టుకుని తరలించడం స్థానికులను కలచివేసింది. డీజిల్‌ లేకుండా అంబులెన్సును పీహెచ్‌సీలో ఉంచడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి ఎవరికీ రాకుండా పీహెచ్‌సీకి, అంబులెన్సు నిర్వహణకు తగిన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.  

Read latest East Godavari News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top