ప్రత్యేక హోదా కోసం ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 26న గుంటూరు జిల్లాలో తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా ముఖ్య నేత జ్యోతుల నెహ్రూ తెలిపారు.
శుక్రవారం కాకినాడలో వైఎస్సార్ సీపీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు సహా పలువురు ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను నెహ్రూ మీడియాకు వెల్లడించారు. వైఎస్ జగన్ దీక్షపై ఈ నెల 20, 21 తేదీల్లో నియోజకవర్గాల్లో, 22, 23, 24 తేదీల్లో మండల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రత్యేక హోదా సాధించేవరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. 26న జిల్లా నేతలందరూ కలిసి రావులపాలెం నుంచి గుంటూరు జిల్లాలోని జగన్ దీక్షా స్థలికి బయలుదేరి వెళతామన్నారు.


