భర్త వేధింపులకు బలి
మద్యం మత్తులో నిత్యం భర్త పెట్టే వేధింపులను భరించలేని ఓ మహిళ చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. తన చిన్నారి కొడుకుకు అమ్మ ప్రేమను దూరం చేసింది.
– మహిళ ఆత్మహత్య
– చాగలమర్రిలో ఘటన
చాగలమర్రి: మద్యం మత్తులో నిత్యం భర్త పెట్టే వేధింపులను భరించలేని ఓ మహిళ చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. తన చిన్నారి కొడుకుకు అమ్మ ప్రేమను దూరం చేసింది. ఈ ఘటన చాగలమర్రి గుంతపాలెం కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామంలోని బుగ్గరస్తా కాలనీకి చెందిన చాంద్‌బాషా తొమ్మిదేళ్ల క్రితం గుంతపాలెం కాలనీకి చెందిన ఖైరూన్‌బీని వివాహం చేసుకున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడున్నాడు. సిమెంటు పని చేస్తూ జీవనం సాగిస్తున్న చాంద్‌బాషా రెండేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. జులాయిగా తీరుగుతూ మద్యం మత్తులో భార్యను వేధింపులకు గురిచేసేవాడు. మంగళవారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నాడు. మాటామాట పెరిగి భార్యను చితకబాదాడు. దీంతో ఆమె భరించలేక అర్ధరాత్రి సమయంలో ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెల్లారిన తర్వాత ఇరుగుపొరుగు వారు గమనించి భర్త చాంద్‌బాషాను చితకబాదారు. ఎస్‌ఐ మోహన్‌రెడ్డి వెళ్లి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తన కూతురు మతికి ఆమె భర్తే కారణమని షరీఫా పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ చెప్పారు.