జిల్లాను ప్రగతి పథంలో నడిపిద్దాం

జిల్లాను ప్రగతి పథంలో నడిపిద్దాం - Sakshi

బాధ్యతలు చేపట్టిన కొత్త కలెక్టర్‌

- కుటుంబ పెద్దగా వ్యవహరిస్తానని స్పష్టం

- సూచనలు, సలహాలు అందజేయాలని పిలుపు

- అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉపాధి హామీ పథకం

- శాఖల వారీగా అధికారులతో సమీక్ష

 

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లా నూతన కలెక్టర్‌గా ఎస్‌.సత్యనారాయణ శనివారం సాయంత్రం 4.41 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పురోహితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. పట్టు వస్త్రం, పూలమాల, పండ్లు సమర్పించారు. బదిలీ అయిన కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ 1997లో పెద్దాపురం ఆర్‌డీఓగా పనిచేసి జూన్‌ 22న బదిలీపై వెళ్తూ ప్రస్తుత కలెక్టర్‌ అయిన ఎస్‌.సత్యనారాయణకు ఆర్‌డీఓగా బాధ్యతలు అప్పగించారు. యాదృశ్చికంగా ఇప్పుడు కూడా సీహెచ్‌ విజయమోహన్‌ నుంచే కలెక్టర్‌గా సత్యనారాయణ చార్జి తీసుకోవడం విశేషం. కొత్త కలెక్టర్‌ను బదిలీ అయిన కలెక్టర్‌ విజయమోహన్‌ అభినందించారు. బాధ్యతలు తీసుకున్న కలెక్టర్‌ను దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ గాయత్రీదేవి, అసిస్టెంట్‌ కమిషనర్‌లు బొకేలు సమర్పించి అభినందనలు తెలిపారు. అనంతరం కలెక్టర్‌ విలేకర్లతో మాట్లాడుతూ.. చారిత్రక గుర్తింపు పొందిన జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. గతంలో చేపట్టిన మంచి కార్యక్రమాలను కొనసాగిస్తూ జిల్లాను మరింత ప్రగతి పథంలోకి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వం, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులను పరిగణలోకి తీసుకొని ప్రాధాన్యత అంశాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. గతంలో చేపట్టిన ఫాంపాండ్స్‌ తవ్వకాలతో పాటు సాగునీరు, విద్య, వైద్యం తదితరాలకు ప్రాధాన్యతనిస్తామన్నారు. జిల్లా అభివృద్ధిలో మీడియా కూడా సహకరించాలని కోరారు.

 

తిట్టడం నా స్వభావం కాదు.. కటుంబ పెద్దగా వ్యవహరిస్తా: కలెక్టర్‌

కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. తనను తాను పరిచయం చేసుకున్నారు. ‘‘తిట్టడం నా స్వభావం కాదు.. నేను సుపీరియర్, మీరు సబార్డినేట్స్‌ అనే భావన ఉండదు. అభివృద్ధి ఒక్కరితో సాద్యం కాదు. అందరం టీమ్‌గా పనిచేసి జిల్లాను అభివృద్ధిలో మొదటి స్థానానికి తీసుకెళ్దాం.’’ అని కలెక్టర్‌ పిలుపు నిచ్చారు. నేను కుటుంబ పెద్దగా వ్యవహరిస్తా.. జిల్లా అభివృద్ధిలో ఏవైనా ఐడియాలు, సూచనలు ఉంటే నా దృష్టికి తీసురండి.. వాటిపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుందామని కలెక్టర్‌ పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ ఉఫాధి హామీ పథకాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా అమలు చేద్దామని, తర్వాత నీటిపారుదల,  ఫాంపాండ్స్, రెవెన్యూ, అంగన్‌వాడీ,  గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, విద్య, వైద్యం తదితరాలకు ప్రాధాన్యతనిద్దామని అన్నారు.

 

శాఖల వారీగా గ్యాప్‌లను గుర్తించిన కలెక్టర్‌

అన్ని శాఖల అధికారులు పరిచయం చేసుకుంటూ తామ శాఖల్లోని ప్రాధాన్యత అంశాలను కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల్లోని గ్యాప్‌లను గుర్తించారు. గ్యాప్‌లు లేకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌లో గ్యాప్‌లు ఉన్నాయని వీటిని సరిచేసుకోవాలని వివరించారు. ఎన్‌ఆర్‌ఇజీఎస్‌లో కర్నూలు జిల్లా రాష్ట్రంలో ఎన్నో స్థానంలో ఉందని పీడీని ప్రశ్నించారు. ప్రస్తుతం 6వ స్థానంలో ఉందని పీడీ తెలుపగా మొదటి స్థానానికి తీసుకరావడానికి కృషి చేయాలని తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, పరిశ్రమలు, అంగన్‌వాడీ కేంద్రాలు తదితరాలకు ఉన్న భూసేకరణ సమస్యలను సత్వరం పరిష్కరిస్తామన్నారు. రూ.500, 1000 నోట్ల రద్దు నేపథ్యంలో జిల్లాలో ఉన్న నగదు కొరత, పింఛన్ల పంపిణీ తదితరాలను సమీక్షించారు. ఉద్యాన ప్రగతిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, సీపీఓ ఆనంద్‌నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ, శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్‌ వెంకటసుబ్బారెడ్డి, ఆర్‌డీఓలు హుసేన్‌సాహెబ్, ఓబులేసు, రాంసుందర్‌రెడ్డి, డిప్యూటి కల్టెకర్‌లు తిప్పేనాయక్, మల్లికార్జున ఇతర అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top