
ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు కీలక అప్డేట్ వచ్చింది. వచ్చే నవంబర్ 1 నుండి ఎస్బీఐ కార్డ్ అనేక సర్వీస్ ఛార్జీలు, ఫీజులను సవరించనుంది. ఈ మార్పులు విద్యా చెల్లింపులు, డిజిటల్ వాలెట్ లోడ్లు, కార్డు మార్పిడి వంటి లావాదేవీలను నేరుగా ప్రభావితం చేస్తాయి.
థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఎడ్యుకేషన్ పేమెంట్లపై 1% ఫీజు
ఇకముందు పేటీఎం (Paytm), ఫోన్పే (PhonePe), గూగుల్ పే (Google Pay) వంటి థర్డ్ పార్టీ పేమెంట్ యాప్స్ ద్వారా చేసే విద్యా సంబంధిత లావాదేవీలపై 1% ఫీజు వర్తిస్తుంది. అయితే నేరుగా పాఠశాల, కళాశాల లేదా విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ ద్వారా లేదా పీవోఎస్ యంత్రాల ద్వారా చేసే చెల్లింపులపై మాత్రం ఎటువంటి ఫీజు ఉండదు.
వాలెట్ లోడ్ ఛార్జీలు
మీరు తరచుగా ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ద్వారా పేటీఎం, ఫోన్పే, అమెజాన్ పే వంటి డిజిటల్ వాలెట్‌లలో డబ్బు లోడ్ చేస్తే, ఇప్పుడు కొత్త ఫీజు వర్తిస్తుంది. రూ.1,000 కంటే ఎక్కువ మొత్తంలో వాలెట్ టాప్-అప్ చేసినప్పుడు 1% ఛార్జీ విధిస్తారు.
కొనసాగుతున్న ప్రస్తుత సర్వీస్ ఛార్జీలు
కొన్ని ఛార్జీలు కొత్తగా ప్రవేశపెట్టినా, ఇప్పటికే ఉన్న అనేక ఫీజులు యథాతథంగా కొనసాగుతాయి. ప్రధానంగా గమనించాల్సినవి..
క్యాష్ పేమెంట్ ఫీజు: రూ.250
పేమెంట్ డిస్ హానర్ ఫీజు: పేమెంట్ మొత్తంలో 2% (కనీసం రూ.500)
చెక్కు చెల్లింపు రుసుము: రూ.200
క్యాష్ అడ్వాన్స్ ఫీజు: లావాదేవీలో 2.5% (కనీసం రూ.500)
కార్డు రీప్లేస్ మెంట్ ఫీజు: రూ.100–రూ.250 (ఆరం కార్డులకు రూ.1,500)
విదేశాలలో అత్యవసర కార్డు మార్పిడి: వీసా కార్డుల కోసం 175 డాలర్లు, మాస్టర్ కార్డ్ కోసం 148 డాలర్లు
సవరించిన ఆలస్య చెల్లింపు ఛార్జీలు
సకాలంలో చెల్లింపులు చేయడాన్ని ప్రోత్సహించేందుకు, ఎస్బీఐ కార్డ్ ఆలస్య చెల్లింపు ఫీజులను సవరించింది. మీరు కనీస బకాయి మొత్తాన్ని (MAD) సకాలంలో చెల్లించకపోతే, కింది రుసుములు వర్తిస్తాయి..
బకాయి మొత్తం | ఆలస్య చెల్లింపు రుసుము |
---|---|
రూ.0 – రూ.500 | ఫీజు లేదు |
రూ.500 – రూ.1,000 | రూ.400 |
రూ.1,000 – రూ.10,000 | రూ.750 |
రూ.10,000 – రూ.25,000 | రూ.950 |
రూ.25,000 – రూ.50,000 | రూ.1,100 |
రూ.50,000 పైగా | రూ.1,300 |
అదనంగా, వరుసగా రెండు బిల్లింగ్ సైకిల్స్కు కనీస బకాయి మొత్తాన్ని చెల్లించకపోతే, అదనంగా మరో రూ.100 పెనాల్టీ విధిస్తారు.
ఎస్బీఐ కార్డ్ తీసుకువస్తున్న ఈ ఫీజు మార్పులు చిన్నగా కనిపించినా, తరచుగా వాలెట్ టాప్-అప్‌లు లేదా విద్యా చెల్లింపులు చేసే వినియోగదారులపై కొంత ప్రభావం చూపవచ్చు. వినియోగదారులు తమ లావాదేవీ అలవాట్లను సమీక్షించి, సరికొత్త ఫీజు నిర్మాణాన్ని అనుసరించడం ద్వారా అనవసర వ్యయాలను నివారించవచ్చు.