
భారత తపాలా శాఖ సేవల్లో సాంకేతికత
ఓటీపీ ఆధారంగా సురక్షితమైన డెలివరీ
ఆన్‌లైన్ పేమెంట్, ఆన్‌లైన్ బుకింగ్ సర్వీసులు
రియల్ టైమ్‌లో డెలివరీ అప్‌డేట్స్
ఇన్‌లాండ్ స్పీడ్‌పోస్ట్ చార్జీల్లో సవరణ
అక్టోబర్1 నుంచి అమల్లోకి కొత్త చార్జీలు
సాక్షి, అమరావతి: వేగంగా.. సురక్షితంగా తపాలా సేవలు అందించేందుకు భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనుంది. వినియోగదారులకు మెరుగైన సేవలదించే నిమిత్తం డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉన్న రిజిస్టర్ పోస్టును ఇక నుంచి స్పీడ్ పోస్టులోకి విలీనం చేసింది. పోస్టు పంపించిన వ్యక్తి సురక్షితంగా చేరిందని తెలుసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. అదనంగా రూ.5 రుసుమును వసూలు చేస్తుంది. అదేవిధంగా వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ఆధారిత డెలివరీ విధానాన్ని కూడా స్పీడ్ పోస్టు అందుబాటులోకి తీసుకొచ్చింది.
డెలివరీ బాయ్‌కు ఓటీపీ చెప్పిన తర్వాతనే బట్వాడా చేయనుంది. ఓటీపీ ఆధారిత డెలివరీకి కూడా రూ.5 అదనపు రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా స్పీడ్ పోస్టు చార్జీలను కూడా సవరించింది. సవరించిన ధరలు, కొత్త ఫీచర్లు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు ఇండియా పోస్ట్ ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. ఇన్‌లాండ్ స్పీడ్ పోస్ట్ ధరలను చివరిసారిగా 2012లో సవరించడం జరిగిందని, నూతన టెక్నాలజీ , కొత్త ఆవిష్కరణల్లో పెట్టుబడుల కోసం ధరలను సవరించినట్టు పేర్కొన్నారు.
చార్జీలు ఇలా..
స్థానికంగా 50 గ్రాములలోపు డెలివరీ చేయడానికి తపాలా శాఖ రూ.19 చార్జీ వసూలు చేయనుంది. అదే 2,000 కి.మీ. వరకు రూ.47 వసూలు చేయనుంది. 51 నుంచి 250 గ్రాముల వరకు స్థానికంగా అయితే రూ.24 చొప్పున.. 2,000 కి.మీ. వరకు అయితే రూ.77గా చార్జీ నిర్ణయించారు. ఆపైన బరువుకు దూరాన్ని బట్టి ధరలను రూ.28 నుంచి రూ.93 వరకు చెల్లించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్, ఓటీపీ సేవల ధరలపై అదనంగా జీఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆన్‌లైన్ పేమెంట్, ఎస్‌ఎంఎస్ ఆధారిత డెలివరీ, రియల్‌టైమ్ డెలివరీ అప్‌డేట్స్, ఆన్‌లైన్ బుకింగ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. విద్యార్థులకు స్పీడ్‌పోస్టులో 10 శాతం, బల్క్ బుకింగ్స్‌కు 5 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్టు శ్రీదేవి వెల్లడించారు.