
పురం..లేదు జలం
వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. నీటి వనరులు అడుగంటిపోతున్నాయి.
- హిందూపురంలో తీవ్ర నీటిఎద్దడి
- రూ. 5.07 కోట్ల నిధులున్నా..ప్రయోజనం సున్నా
- పీఏబీఆర్ పథకానికి రూ.26 కోట్ల బకాయిలు
-బిందెడు నీటి కోసం జనం నానా అవస్థలు
హిందూపురం అర్బన్ : వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. నీటి వనరులు అడుగంటిపోతున్నాయి. బిందెడు నీటి కోసం ప్రజలు నానా అవస్థ పడుతున్నారు. మరీముఖ్యంగా హిందూపురం పట్టణంలో ఎప్పటిలాగే నీటి సమస్య ఉధృతరూపం దాల్చుతోంది. కొన్ని ప్రాంతాల్లో 20 రోజులకోసారి కూడా నీరు రావడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే రానురాను పరిస్థితి ఎలా మారుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ వేసవిని ఎలా గట్టెక్కాలన్న ప్రశ్న వారిని వేధిస్తోంది.
హిందూపురం పట్టణ జనాభా 1.60 లక్షలు. వీరికి రోజూ సుమారు 10 ఎంఎల్‌డీ (మిలియన్ లీటర్స్ ఫర్ డే) నీరు అవసరం. మునిసిపాలిటీకి ప్రధాన వనరు అయిన పీఏబీఆర్ పథకం నుంచి రోజుకు సగటున 3.39 ఎంఎల్‌డీ మించి నీరు సరఫరా కావడం లేదు. మునిసిపాలిటీ పరిధిలో 148 బోర్లు, ట్యాంకర్ల ద్వారా ప్రతిరోజూ 2 ఎంఎల్‌డీ నీరు అందిస్తున్నారు. ఇందులో కూడా ఇప్పటికే 51 బోర్లలో నీటి లభ్యత తగ్గిపోయింది. పీఏబీఆర్, బోర్లు, ట్యాంకర్ల ద్వారా మొత్తం కలిపినా రోజుకు 6 ఎంఎల్‌డీ నీరు లభ్యం కావడం లేదు. నీటి కొరత కారణంగా కొళాయిలకు 10-15 రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి బోర్లు, పీఏబీఆర్ పథకం ద్వారా నీటి లభ్యత మరింత తగ్గిపోయే సూచనలు కన్పిస్తున్నాయి. ఇదే జరిగితే పట్టణవాసులకు కన్నీటి కష్టాలు తప్పవు. కొత్తగా బోర్లు వేద్దామన్నా నీరు లభించే పరిస్థితి లేదు. వెయ్యి అడుగుల వరకు తవ్వినా నీటిచెమ్మ తగలని పరిస్థితి.
రూ.5.07 కోట్లు విడుదల
పట్టణంలో నీటి ఎద్దడిని అధిగమించేందుకు కరువు నిధుల కింద రూ.5.07 కోట్లు విడుదలయ్యాయి. ట్యాంకర్ల సంఖ్యను పెంచి.. వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తీసుకుని సరఫరా చేసేందుకు ఈ నిధులను ఖర్చు చేస్తున్నారు. కొత్త బోర్లు వేయడం, ఉన్న బోర్ల ఫ్లషింగ్, డీపింగ్, పైపులైన్లు, మోటార్ల మరమ్మతులు వంటి వాటి కోసం మరిన్ని నిధులు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు. ఇక పీఏబీఆర్ నుంచి పట్టణానికి ప్రస్తుతం విడుదల చేస్తున్న 3-4 ఎంఎల్‌డీ నీటిని కనీసం 8 ఎంఎల్‌డీ వరకు సాధించుకుంటేనే వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి వీలుంటుంది. అయితే.. పీఏబీఆర్ పథకానికి మునిసిపాలిటీ ఇప్పటికే రూ.26 కోట్ల వరకు బకాయి ఉంది. దీన్ని ప్రభుత్వం ఏఎంసీ నిధులతో చెల్లించి.. పథకాన్ని పటిష్టం చేసి సరఫరాలో అడ్డంకులను అరికడితేనే పట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో నీరు అందుతుంది.
ముందుచూపు కరువైన పాలకులు
వేసవి ముంచుకొచ్చినా స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ, మునిసిపల్ పాలకులకు ముందుచూపు కరువైంది. పట్టణంలో నీటిఎద్దడి నివారణకు మునిసిపల్ అధికారులు ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేసినా నిధులు రాబట్టుకోవడంలో మాత్రం విఫలమవుతున్నారు. రూ.250 కోట్లతో ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేసి, నీటి ఎద్దడిని శాశ్వతంగా నివారిస్తామని ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ హామీ ఇచ్చారు. ఇది ఆచరణకు నోచుకోలేదు.
20 రోజులుగా నీరు రావడం లేదు – రమాదేవి, ముద్దిరెడ్డిపల్లి
మా ప్రాంతంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. 20 రోజులుగా నీరు రావడం లేదు. ట్యాంకర్లను పంపడం లేదు. వ్యవసాయ బోర్ల వద్దకు వెళ్లాల్సి వస్తోంది. అలాగే రోజూ రూ.100 ఖర్చు చేసి ప్రైవేట్ ట్యాంకర్ల నుంచి తాగడానికే కాకుండా ఇతర అవసరాలకు కూడా నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. కొళాయిలకు సక్రమంగా నీరు వదలకపోతే మా పరిస్థితి దారుణంగా ఉంటుంది.
ట్యాంకర్ల సంఖ్యను పెంచుతాం
ప్రస్తుతం నీటి లభ్యత బాగా తగ్గింది. అయినా ప్రజలకు ఇబ్బందులు రాకుండా ట్యాంకర్ల సంఖ్యను పెంచి నీటిని సరఫరా చేస్తున్నాం. మరిన్ని పెంచి అన్ని వార్డుల్లో ఇబ్బందులు లేకుండా చూస్తాం. ఎమ్మెల్యే బాలకృష్ణ ఆర్‌డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులతో చర్చించారు. వచ్చే నెల నుంచి నీటి కేటాయింపు కొంత పెంచే అవకాశాలు ఉన్నాయి. పీఏబీఆర్ నుంచి మరో రెండు ఎంఎల్‌డీ నీరు వస్తే కొంతమేరకు వేసవి నుంచి గట్టెక్కవచ్చు.
– విశ్వనాథ్, కమిషనర్, హిందూపురం
మునిసిపల్ చైర్‌పర్సన్ వార్డులోనూ..
హిందూపురం మునిసిపల్ చైర్‌పర్సన్ ఆర్.లక్ష్మీ ప్రాతినిథ్యం వహిస్తున్న 14వ వార్డులోని ప్రశాంత్‌నగర్‌లో 20 రోజులుగా నీరు అందడం లేదని కాలనీవాసులు వాపోయారు. ఈమేరకు మంగళవారం ఆ కాలనీ మహిళలు మునిసిపల్ కార్యాలయానికి వచ్చి కమిషనర్ విశ్వనాథ్‌ను నిలదీశారు. నీటికోసం ఇబ్బందులు పడుతున్నామని పలుసార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. కనీసం ట్యాంకర్ల ద్వారానైనా సరఫరా చేయాలని కోరారు.